TRENDING NOW

పోల్ నెం. 23. హోదా గోదాలో మిగిలేదెవరు?

పోల్ నెం. 23. హోదా గోదాలో మిగిలేదెవరు?

 

రాజకీయాలంటేనే పదవి అంతిమ లక్ష్యంగా సాగే క్రూరమైన క్రీడ. ఇందులో వావి వరుసలకు, నీతి నియమాలకూ, నైతికతకూ తావుండదని చరిత్ర మనకు ఇదివరకే పలు మార్లు ఋజువు చేసింది. అధికారం రుచి తెలిసినవారికి ఆ దాహం తీరనిది, వీడి ఉండలేనిది. పదవే పరమావధిగా సాగుతున్న నేటి రాజక్రీయడలో ఓడిపోతున్నది మాత్రం ప్రజలేనన్నది నిజం.

తిరుపతి, జూలై23, తెలుగువారు విడివిడిగా ఉండాలనుకోవడం ఇప్పటిదికాదు… చాలా కాలంగా నలుగుతున్న సమస్య. ఇది చివరకు 2014లో తెలంగాణ ఏర్పాటుతో ఓ కొలిక్కి వచ్చింది. కానీ, గతంలో కేంద్రం పలు రాష్ట్రాలను ఏర్పాటుచేసిన ఏ ఇతర సమయాలలోనూ రాష్ట్రవిభజన ఇన్ని సమస్యలను తీసుకురాలేదు. ఏపీ విభజన మాత్రం రావణ కాష్టంలాగా తయారయింది. కేంద్రంలో ప్రభుత్వం నిర్వహించిన కాంగ్రస్, భాజపా లు తమ స్వార్థం కోసం తెలుగువారితో ఆడుకుంటున్నాయి. విభజన సమయంలో అధికారంలో ఉన్న కాంగ్రస్ పార్టి హేతు బద్దంగా విభజన చేయాలనే ఋజువర్తన ననుసరించలేదు. సరే, యూపీఏ పాపాలను కడిగివేస్తామని, స్వాంతన వచనాలు పలికి ఏలికలుగా మారిన బీజేపీ కూడా అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీ ఆకాంక్షలను పట్టిచుకోవడం మానివేసింది.

ఈ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీకి ప్రధాన పాత్ర ఉంది. విభజన తరువాత ఆ పార్టీ బీజేపీతో కలిసి ఎన్నకల్లో పోటీ చేసింది. అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో రెండు పక్షాలూ అదికారం పంచుకుని నాలుగు సంవత్సరాలు కలిసి పాలనచేశాయి. ఇంత చేసీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించలేని చేతకాని తనానికి తెలుగు దేశం పార్టీ భారీ మూల్యం చెల్లించుకోవలసి ఉంది. 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా ఇవ్వవద్దని చెప్పలేదని ప్రతిపక్షనేత శాసనసభలో గుర్తు చేసినపుడు పాలక పక్షం ఆయనను పట్టించుకోలేదు. హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అన్నారు. కానీ నిన్న పార్లమెంటులో హోదా కోసం అవిశ్వాసమని మాట్లాడిన టిడిపీ ఎంపీ గల్లా జయదేవ్ అదే జగన్ వాఖ్యలను పార్లమెంటులో ఉటంకించడం గమనార్ఙం. అంటే తేలుగుదేశం పార్టీ నాయకత్వం ఇంతకాలం పప్పులో కాలేసినట్టే కదా.. కేంద్రం తీరును గుర్తిచడంలో విఫలమైనట్లే కదా.. ఏమంటారు. ఈ నేపథ్యంలో హోదాద్రోహంలో పాపం ఎవరిదో ప్రజలే నిర్ణయించాలి.

హోదా విషయంలో రాష్ట్ర పాలకులు పలు మార్లు తమ నిర్ణయాలు  మార్చుకున్నారు. హోదా వదిలి పెట్టి ప్రత్యేక ప్యాకేజీకి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిం చింది. ఈ మేరకు శాసన సభలో తీర్మాణం కూడా చేశారు. ఆ నాడు ప్రతిపక్షం వద్దన్నా వినలేదు. హోదా అంటే ఇక జైలుకే అని చంద్రబాబు విరుచుక పడ్డారు. అయితే ప్యాకేజీలో వచ్చిందేమిటో, కేంద్రం ఇచ్చిందేమిటో, వారు పుచ్చుకుంది ఏమిటో ఎవ్వరికీ తెలియదు. చివరకు అవిశ్వాసం పై పార్లమెంటులో చర్చ సందర్భంగా కూడా టీడీపీ ఎంపీలు రాష్ట్రానికి జరిగిన అన్యాయం ఏమిటో వివరించలేదు. హోదా  వద్దంటారు. ప్యాకేజీకి అంగీకరించామంటారు. తూచ్… కాదు… మళ్లీ హోదా ఇవ్వాలంటారు. చివరకు ప్రధాని మాట్లాడిన తరువాత చివరగా అవకాశం వచ్చిన కేశినేని నాని కూడా.. అయ్యా మీరు ప్యాకేజీ కింద ఇవి ఇస్తామన్నారు…. ఇంతకాలం ఇవ్వలేదు.. మాకు వెటనే విశాఖ జోన్. కడప ఉక్కు, దుగరాజపట్నం మొదలైనవి ఇవ్వండి అనే మాట అనలేదు సరికదా.. ప్రధానిని వ్యంగ్యంగా విమర్శించడానికి సమయాన్ని వృధా చేశారు. హోదా పై రాష్ట్రప్రజల్లో పెరుగుతున్న ఆవేదననుంచీ ప్రతి పక్షం ఎక్కడ లబ్ధి పొందుతుందో అనే ఆలోచనతోనే టీడీపీ పాలకులు గతంలో వద్దన్న హోదా అంశాన్ని తిరిగి తెరపైకి తెచ్చారు.. కానీ దానిపైనా చిత్తశుద్దితో పోరాడే నిబద్దత వారికి ఉందా అనే అనుమానం సగటు జీవిలో ఉంది.

ఇంతకూ పార్లమెంటు సాక్షిగా సాగిన అవిశ్వాసం నాటకంలో తేలిందేమిటి, ఎరుకపడినదేమిటి, ఎవరికైనా తెలుసా…! రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనం జరిగిందా.. కనీసం రాష్ట్ర రాజకీయ పార్టీలకైనా మేలు జరిగిందా.. వచ్చే ఎన్నికలలో విజయం లక్ష్యంగా నడిచిన అవిశ్వాసం తీర్మాణం అనే నాటకం సుఖాంతమా.. దుఃఖాంతమా? హోదా విషయంలో ఎవరు ఎన్ని యూ టర్నులు తీసుకున్నారు. ఎవరు నిలకడగా నిలబడ్డారు. ఎవరు మాట మార్చారు… ఎవరు మడమతిప్పకుండా వ్యవహరిస్తున్నారో ప్రజలు గమనించడం లేదా… ఏమో కాలమే నిర్ణయిస్తుంది.

 

మామాట : పాలకులకు ప్రజల ఆకాంక్షలు కనిపించవు.. కదా!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: