అమిత్ షా న్యూ స్కెచ్: ఒకే దేశం…ఒకే బాష

hindi-diwas-2019-home-minister-amit-shahs-appeal-for-india-to-make-hindi-a-national-language
Share Icons:

ఢిల్లీ: కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఈ మధ్య సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ట్రిపుల్ తలాక్ రద్దు గానీ…జమ్మూ-కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు లాంటి అంశాల పైన వెంటనే నిర్ణయం తీసుకుని సంచలనాలు సృష్టించారు. ఈ క్రమంలోనే అమిత్ షా మరో సంచలన నిర్ణయం దిశగా ముందుకెళుతున్నారు.  భారత్ లో ఒకే భాష ఉండాలనీ, అప్పుడే దేశం ఐక్యంగా ఉంటుందని ప్రకటించారు. ఈ రోజు హిందీ దినోత్సవం సందర్భంగా షా స్పందిస్తూ..‘భిన్నభాషలు, యాసలు ఉండటం మనదేశపు బలం. కానీ మనదేశంలో ఒకే భాష ఉండాల్సిన అవసరం ఉంది. అప్పుడే విదేశీ భాషలకు చోటుండదు. అందుకే స్వాతంత్ర్య పోరాటం సందర్భంగా మన పూర్వీకులు జాతీయ భాషగా హిందీ ఉండాలని కోరుకున్నారు’ అని ట్వీట్ చేశారు.

ప్రపంచానికి భారత్ తరఫున హిందీ ప్రాతినిధ్యం వహిస్తుందని, హిందీ వల్లే దేశం ఐక్యంగా ఉంటుందని షా అభిప్రాయపడ్డారు. కాబట్టి భారతీయులంతా మహాత్మాగాంధీ, సర్దార్ పటేల్ కలలను నిజం చేసేందుకు హిందీ భాష వాడకాన్ని పెంపొందించాలని పిలుపునిచ్చారు. దీంతో షా వ్యాఖ్యలపై పలువురు రాజకీయ నేతలు, నెటిజన్లు, ముఖ్యంగా తమిళనాడు రాజకీయ పార్టీలు అంతెత్తున ఎగిరిపడ్డాయి.

అమిత్ షా వ్యాఖ్యలపై తమిళనాడు ప్రతిపక్ష నేత, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ చెన్నైలో ఘాటుగా స్పందించారు. తమిళులపై హిందీని బలవంతంగా రుద్దడానికి జరుగుతున్న ప్రయత్నాలను తాము వ్యతిరేకిస్తూనే ఉన్నామని తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు చేసిన వ్యాఖ్యలు తమను దిగ్భ్రాంతికి గురిచేశాయని చెప్పారు. ఇలాంటి వ్యాఖ్యలతో భారత సమగ్రత, ఐక్యతకు ప్రమాదం ఏర్పడుతుందని హెచ్చరించారు. కాబట్టి తన వ్యాఖ్యలను షా వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు

మరోవైపు తమిళ నేత వైగో సైతం షా వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు. హిందీ భాషను జాతీయస్థాయిలో దేశమంతా రుద్దాలనుకోవడం మూర్ఖత్వమని విమర్శించారు. అదే జరిగితే హిందీ భాషను వద్దనుకునే రాష్ట్రాలు భారత్ లో ఉండవని తీవ్ర హెచ్చరికలు చేశారు. హిందీని జాతీయ భాషగా చిత్రీకరించడం దేశానికి శాపమని వ్యాఖ్యానించారు. అటు హైదరాబాద్ లోక్ సభ సభ్యుడు, మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ షా వ్యాఖ్యలను తప్పుపట్టారు. భారత్ హిందీ, హిందూ, హిందుత్వ అనే ఆలోచనల కంటే చాలా పెద్దదని ఒవైసీ తెలిపారు. హిందీ భాష ప్రతీ భారతీయుడి మాతృభాష కాదని ఆయన స్పష్టం చేశారు. ‘భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 29 ప్రతీభారతీయుడికి భాషా, సాంస్కృతిక హక్కును కల్పిస్తోంది’ అని ఒవైసీ ట్వీట్ చేశారు.

Leave a Reply