రాజధాని ఇష్యూ: హైపవర్  కమిటీ ప్రాథమిక అంచనా ఇదే…

ap minister buggana rajendranath reddy fires on chandrababu
Share Icons:

అమరావతి: రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో దూకుడుగా వెళుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే జి‌ఎన్ రావు కమిటీ, బోస్టన్ కమిటీలు మూడు రాజధానులు ఉండాలని ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ  మూడు రాజధానులని ఫైనల్ చేయడంలో భాగంగా ప్రభుత్వం హైపవర్ కమిటీ నియమించింది. ఈ కమిటీ తొలిసారి భేటీ అయ్యి ప్రాథమిక అంచనా ఇచ్చింది.   రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అధ్యక్షతన హైపవర్ కమిటీ తొలి సమావేశం జరిగింది.

సమావేశానికి ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రులు బొత్స సత్యనారాయణ, మేకతోటి సుచరిత,పేర్ని వెంకటరామయ్య, మేకపాటి గౌతంరెడ్డి,కొడాలి నాని, ఆదిమూలపు సురేష్, హైపవర్ కమిటీ ఉన్నతాధికారులు, జీఎన్ రావు కమిటీ సభ్యులు, బీసీజీ కమిటీ సభ్యులు హాజరయ్యారు.

సమావేశం అనంతరం ఆ వివరాలను బుగ్గన మీడియాకు వివరించారు. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి ఏ విధంగా జరగాలి? అన్ని ప్రాంతాల అభివృద్ధి ఎలా ఉండాలి? అనే అంశాలపై జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదిక, బీసీజీ నివేదిపై సుదీర్ఘంగా చర్చించామని బుగ్గన తెలిపారు. ప్రస్తుతం అభివృద్ధి వికేంద్రీకరణ, పరిపాలన వికేంద్రీకరణపై రాష్ట్రంలో చర్చలు జరుగుతున్నాయని.. కమిటీలు ఇచ్చిన నివేదికలు విశ్లేషించుకొని ముందుకు వెళ్లేందుకే ఈ హైపర్ కమిటీని సీఎం ఏర్పాటు చేశారని వెల్లడించారు.

తామిచ్చిన నివేదికల సారాంశాన్ని జీఎన్ రావు, బీసీజీ ప్రతినిధులు హైపవర్ కమిటీకి వివరించారు. విశాఖ నగరాన్నే రాజధానిగా ఎందుకు ఎంచుకున్నారని ఈ సందర్భంగా మంత్రులు ప్రశ్నించారు. గ్రీన్ ఫీల్డ్ రాజధాని నిర్మాణానికి అయ్యే ఖర్చును ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ భరించలేదనే విషయాన్ని తమ అధ్యయనంలో వెల్లడైందని వారు చెప్పారు. ఏపీలో విశాఖ కేంద్రంగా పరిపాలన సాగిస్తే రాష్ట్రాభివృద్ధికి చోదక శక్తి అవుతుందని మంత్రుల అభిప్రాయపడ్డారు.

అంతేకాదు అమరావతి ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలని హైపర్ కమిటీ అభిప్రాయపడింది. రాజధాని రైతుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలని.. రైతుల ముందు రెండు-మూడు ఆప్షన్లను ఉంచాలని భావిస్తోంది. ప్రతి జిల్లాలోనూ కీలక ప్రాజెక్టులు… చేపట్టాల్సిన అభివృద్ది పనులపై హైపవర్ కమిటీ దృష్టి పెట్టింది.

 

Leave a Reply