హైదరాబాద్, 14 జూన్:
తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోయిన స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ నిర్మిస్తూ, నటిస్తుండగా, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన పాత్రల కోసం నటీనటుల అన్వేషణలో ఉన్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ గారి సతీమణి బసవతారకంగారి పాత్రను ప్రముఖ హిందీ నటి విద్యాబాలన్ పోషించనున్నట్లు ప్రకటించారు.
ఇక ఈ బయోపిక్‌లో మరో అతి ముఖ్యమైన పాత్ర నాదెండ్ల భాస్కరరావు. ఈ పాత్రను ప్రముఖ నటుడు బోమన్ ఇరానీ చేయనున్నారు.
ఇక ఎన్టీఆర్ జీవితంలో మరో ముఖ్య పాత్ర ఆయన అల్లుడు చంద్రబాబు నాయుడిది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో చంద్రబాబు పాత్రలో దగ్గుబాటి రానా నటించనున్నట్లు తెలుస్తోంది. జూలై చివరి వారంలో చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది.
మామాట: మరి ఈ వార్త ఎంతవరకు నిజమో?