మళ్ళీ వేడెక్కిన కన్నడ రాజకీయం..వారి పరిస్థితి ఏంటో?

Share Icons:

బెంగళూరు: ప్రభుత్వం మారినా…కర్ణాటక లో రాజకీయ వేడి మాత్రం చల్లార్లేదు. కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం దింపేయడానికి కారణమైన అనర్హత ఎమ్మెల్యేల పరిస్తితి ఏంటో అర్ధం కావడం లేదు. వీరు ప్రస్తుత బీజేపీ సీఎం యడియూరప్పపైనే భారం వేసేశారు. తాజాగా అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టులోనూ చుక్కెదురయింది. తమపై స్పీకర్ రమేష్ కుమార్ విధించిన అనర్హత వేటుపై స్టే ఇవ్వాల్సిందిగా వీరు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే సుప్రీంకోర్టు వీరికి స్టే ఇవ్వడానికి నిరాకరించింది. స్పీకర్ నిర్ణయం పై తీర్పు కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది.

అయితే వారు అనర్హత వేటు విషయంలో స్టే సంపాదించుకుంటే కొంత ఊరట పొందవచ్చని భావించారు. తమ వల్లనే బీజేపీ ప్రభుత్వం కర్ణాటకలో ఏర్పడినప్పటికీ, తాము చూస్తూ ఉండిపోవడం తప్ప ఏమీచేయలేని పరిస్థితి ఉంది. అందుకే ఢిల్లీలో ఉన్న అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ పెద్దలను కలవాలని నిర్ణయించుకున్నారు. తమ పరిస్థితి, తమ భవిష్యత్తు ఏంటో వారి వద్దనే తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు ముఖ్యమంత్రి యడ్యూరప్ప బెంగళూరులో ఉన్నప్పటికీ వారికి అన్ని రకాలుగా సాయం అందిస్తూనే ఉన్నారు. వారిలో అసంతృప్తి తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు

ఇదిలా ఉంటే సంబంధిత నియోజకవర్గాలలో అభివృద్ధి, అధికారుల బదిలీల అంశంలో తమను పట్టించుకోవడం లేదని అనర్హత ఎమ్మెల్యేలు బీజేపీపై విరుచుకుపడుతున్నారు. మంత్రులు వ్యవహరిస్తున్న తీరుతో అనర్హత వేటుపడినవారు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఎటువంటి డిమాండ్‌ లేకుండానే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తే మీరు మా వెంట ఉంటారని భావించామని అలా కాకుండా కనీస స్థాయిలో కూడా సహకరించకపోతే ఎలాగంటూ మండిపడుతున్నారు.

తమ నియోజకవర్గాలలో ఇష్టారాజ్యంగా అధికారులను బదిలీ చేస్తున్నారని అంతకుమించి నియోజకవర్గాలలో చేపట్టదలిచిన అత్యవసర పనులకు సహకరించడం లేదని ఇలాగైతా తమ భవిష్యత్తు కావాలని సీఎం యడియూరప్పతో కొందరు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అటు సుప్రీంకోర్టులో తమ పిటీషన్‌ విచారణలపై డిమాండ్‌ చేసేందుకు న్యాయవాదులు వెనుకడుగు వేస్తున్నారని విచారం వ్యక్తం చేసినట్టు తెలిసింది. అయితే వారిని సంతృప్తి పర్చడానికి నామినేటెడ్ పోస్టులను కూడా యడ్యూరప్ప సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. కొన్ని కీలక పోస్టులకు అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేల పేర్లను సిఫార్సు చేస్తూ కేంద్ర కార్యాలయానికి కూడా పంపారని చెబుతున్నారు.

Leave a Reply