ఆత్మ సంకల్పం :

Share Icons:

ఆత్మ సంకల్పం :

నిలిచిపోయిన నీటికంటె పొర్లిపారే నీటి తరగల్లోనే ఆత్మసంకల్పం ఉరకలేస్తూ ఉంటుంది. ఆ జలధారలే గిరిశిఖరాలపై నుంచి దూకినపుడు తిరుగులేని సాహసం నురగలెత్తుతూ ఉంటుంది. ప్రాణమున్న మనుషులం గనుక మనం కూడా ప్రవహించాలి. చెత్తా చెదారంలాంటి సమస్యలొచ్చినప్పుడు వాటిని తొలగించాలి.. అవసరమైతే ఏటి ప్రవాహానికి ఎదురీదాలి. ఎందుకంటే మనిషికి ఆలోచించే శక్తి ఉంది. యుక్తి ఉంది. అనుభూతి చెందే శక్తి ఉంది. ఆచరణకు నడుం కట్టే శక్తీ ఉంది. మనిషిలో ఉన్న ఈ శక్తియుక్తులన్నీ వికసింప చేయడానికి దోహదపడేదే ఆత్మ సంకల్పం.

 

ప్రతి మనిషీ పరుల ప్రయోజనం కోసం కట్టుబడి ఉండాలి. ప్రేమా నిస్వార్ధం స్వార్ధ త్యాగం సామాజిక దృష్టీ యివన్నీ మిళితమై ఉండాలి. మనం జీవితంలో చేపట్టే ఏ పనికయినా కావలిసింది ఆత్మ సంకల్పం. ఇది మన శక్తి సామర్ధ్యాల మీద ఆధారపడి ఉంటుంది. మనం చేయాలనుకునే పని మీద ఓ నిశ్చితమైన అభిప్రాయం కలిగి ఉండటం. ఓ అంచనాకు రావడం. మన భవిష్యత్తు మీద కూడా అంతే బలమైన నమ్మకం ఏర్పరచుకోవడం. వీటన్నిటికీ కేవలం పథక రచన ఒక్కటే సరిపోదు. అందుకు దృఢ సంకల్పం చాలా అవసరం. ప్రతి ఒక్కరికీ సంకల్పం  అవసరం, సంకల్పం ఉంటే దేనినైనా సాధించవచ్చు. నిరంతరం దేవుని సేవ, పరుల సేవకు కృషిచేసేవరికి సంకల్పబలం మెండుగా ఉంటుంది.. నిజంగా మ‌నం ఏదైనా చేయాల‌నుకుంటే చేయ‌చ్చు. అందుకు ఆత్మ సంక‌ల్పం చాలు,  అనుకున్నది సాధించ‌వ‌చ్చు. దీనికి తోడు కొంత శ్ర‌మ‌ కూడా జత చేస్తే ఇక విజ‌యం మ‌న‌దే. మార్గదర్శకుడైన భగవంతుడిని, గురువును పూజించిననాడే జీవితంలో వ్యక్తి రాణిస్తాడు.

 

ఆత్మ సంకల్పం ఉన్న వారు అన్నింటిలోనూ రాణిస్తారు. జ్ఞానాన్ని నిత్యం మనన చేసిన వారే ఇతరులకు సేవ చేయగలరు. మనిషి తన అంతరంగంలో తనకు తాను సరిదిద్దుకున్నప్పుడే సమాజాన్ని సరిదిద్దగలడు. నిండైన ఆత్మ విశ్వాసం కలిగిన వ్యక్తులు జీవితంలో ఎదురయ్యే ఎలాంటి ఆటుపోట్లనైనా అధిగమించడానికే ప్రయత్నిస్తారు. దట్టంగా కమ్ముకున్న కారుమబ్బుల్ని చీల్చుకొని వచ్చే సూర్యకిరణాల్లా వారు సవాళ్లను ఎదుర్కోవడానికి సదా సిద్ధంగానే ఉంటారు..

 

-నందిరాజు రాధాకృష్ణ

Leave a Reply