ముగిసిన చైతన్య రథసారధి శకం…రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మృతి

Share Icons:

నల్గొండ, ఆగస్టు 29:

బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సినీ నటుడు, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ కామినేని హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. నెల్లూరులో ఓ వివాహానికి వెళ్తుండగా నల్లగొండ జిల్లా అన్నేపర్తి వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్వయంగా ఆయనే వాహనం నడపడంతో డివైడర్‌పై నుంచి దూసుకుపోయి ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. స్థానికులు ఆయనను హుటాహుటీన వైద్యం కోసం కామినేని హాస్పిటల్‌కు తరలించారు. హరికృష్ణ తలకు బలమైన గాయం కావడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. అందరినీ శోక సంద్రంలో ముంచి హఠాన్మరణం చెందిన చైతన్య రథసారథి జీవనయానం ఒకసారి మననం చేసుకుందాం…

జననం, వివాహం…

నందమూరి తారకరామారావు, బసవతారకం నాలుగో సంతానంగా హరికృష్ణ సెప్టెంబరు 2, 1956న కృష్ణా జిల్లా నిమ్మకూరులో జన్మించారు. హరికృష్ణకి ఇద్దరు భార్యలు మొదటి ఆమె లక్ష్మీ కాగా, రెండో భార్య శాలిని. ఈయనకి ముగ్గురు కుమారులు జానకిరామ్, కల్యాణ్ రామ్, ఎన్టీఆర్.  ఒక కుమార్తె సుహాసిని.

సినీ ప్రస్థానం నుంచి రాజకీయ ప్రస్థానం

చిన్నతనంలోనే 1967లో ‘శ్రీ కృష్ణావతారం’ సినిమాతో తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత ‘తల్లా పెళ్లామా’, ‘రామ్‌ రహీమ్‌’, ‘దాన వీర శూర కర్ణ’ తదితర చిత్రాల్లో అలరించారు. ఆ తర్వాత సినిమాల నుంచి కొంచెం విరామం తీసుకున్న ఆయన తిరిగి ‘శ్రీరాములయ్య’తో 1998లో మరోసారి వెండితెరపైకి వచ్చారు. ఆ తర్వాత ‘సీతారామరాజు’, ‘లాహిరి లాహిరి లాహిరిలో’, ‘శివరామరాజు’, ‘సీతయ్య’, ‘టైగర్‌ హరిశ్చంద్ర ప్రసాద్‌’, ‘స్వామి’, ‘శ్రావణమాసం’ తదితర చిత్రాల్లో నటించి మెప్పించారు. ఈ సినిమాల తర్వాత ఆయన మళ్లీ ముఖానికి రంగేసుకోలేదు. నందమూరి తారకరామారావు రాజకీయాల్లోకి వచ్చాక.. హరికృష్ణ ఆయన వెంటే నడిచారు. ఎన్టీఆర్‌ ప్రచార వాహనం చైతన్య రథాన్ని హరికృష్ణ నడిపించారు.

తెలుగు దేశం పార్టీ పగ్గాలు చంద్రబాబు నాయుడు చేతుల్లోకి వెళ్లాక.. ‘అన్న తెలుగుదేశం’ పార్టీని స్థాపించారు. మళ్లీ తెలుగుదేశంలో చేరారు. 1996-99 మధ్య ఎమ్మెల్యేగా పనిచేసిన హరికృష్ణ.. 1996లో రవాణా మంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సేవలు అందించారు. ఆపై 2008లో టీడీపీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక ఆయిన హరికృష్ణ అప్ప‌ట్లో రాష్ట్ర విభ‌జ‌న నిర్ణ‌యానికి నిర‌స‌న‌గా రాజ్య‌స‌భ స‌భ్యుడిగా రాజీనామా చేశారు. ప్రస్తుతం టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. రాజ‌కీయాల్లో వివిధ ప‌ద‌వులు నిర్వ‌హించిన‌ప్ప‌టికీ సినిమాల ద్వారానే ఆయ‌న ప్ర‌జ‌ల్లోకి ఎక్కువ‌గా చేరువ‌య్యారు.

ఆ కుటుంబానికి రోడ్డు ప్రమాదమే శాపమా….???

హరికృష్ణ పెద్ద కుమారుడు కూడా రోడ్డు ప్రమాదంలో దుర్మరణంపాలయ్యారు. నాలుగేళ్ల కిందట నల్లగొండ జిల్లా మునగాల మండలం ఆకుపాము వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన పెద్ద కుమారుడు జానకిరామ్ దుర్మరణం చెందారు. 2014 డిసెంబరు 6 న హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పడంతో జానకిరామ్ మృతిచెందారు. ట్రాక్టర్‌ను తప్పించబోయి జానకిరామ్ కారు బోల్తాపడింది. నాడు తనయుడి మరణవార్త తెలియగానే కుప్పకూలిపోయిన హరికృష్ణ దేవుడు నన్ను మోసం చేశాడంటూ రోదించారు. పెద్ద కుమారుడి మాదిరిగానే ఆయన కూడా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. ఇక 2009 ఎన్నికల సమయంలో టీడీపీ తరఫున ప్రచారం చేసిన నటుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఖమ్మం జిల్లాలో ఎన్నికల ప్రచారం ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా నల్లగొండ జిల్లా మోతే వద్ద ఆయన ప్రయాణిస్తోన్న వాహనం ప్రమాదానికి గురయ్యింది.

శోక సంద్రంలో నందమూరి కుటుంబం-అభిమానులు..

తండ్రి రోడ్డు ప్రమాద వార్తా వినగానే కామినేని హాస్పిటల్ కి బయలుదేరిన ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లకు మార్గ మధ్యమంలోనే చేదువార్త వినిపించింది. ఆసుపత్రికి రాగానే శుభకార్యనికి వెళ్ళి నీర్జీవమై తిరిగొచ్చిన తండ్రి బౌతికకాయాన్ని చూసి అన్నదమ్ములు ఇద్దరు కన్నీటి పర్యంతమయ్యారు. ఆసుపత్రి బయట ఉన్న నందమూరి అభిమానులు అంతా కన్నీరు కారుస్తూ హరికృష్ణ అమరహే అంటూ నినాదాలు చేశారు. ఇక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పలువురు సినీ నటులు సీతయ్య మరణ వార్త విని ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ప్రస్తుతం హరికృష్ణ పార్థీవ దేహాన్ని ఆయన ఇంటికి తరలించే పనిలో ఉన్నారు.

మామాట: సీతయ్యకు మామాట అందిస్తున్న అక్షర నివాళులు

Leave a Reply