కొత్త ఏడాదంటే ఉల్లాసం, ఉత్సాహం

Share Icons:

కొత్త ఏడాదంటే ఉల్లాసంఉత్సాహం

కొత్త సంవత్సరం మొదలవుతున్నది. తెలుగు వాళ్లకి రెండు కొత్త సంవత్సరాలు. వ్యవహారికంగా  జనవరి 1న మొదటిదైతే, తిథులప్రకారం, భారతీయ శాస్త్రం ప్రకారం వచ్చే ఉగాది రెండవది. దైనందిన జీవితంలో మనం వ్యవాహరికవిధానాన్నే అనుసరిస్తాం. మనం మాట్లాడుకుంటున్నది జనవరితో మొద్లయ్యే  నూతన సంవత్సర వేళ.. నూతనోత్సాహం ఉప్పొంగే వేళ.. నిన్నటిని దాటుకుంటూ మనతో నడిచి వచ్చిన కాలం. వేసే జీవితపు అడుగు కొత్తగా ఉండాలని కోరుకుంటాం. భవిష్యత్తు ఆశావహ దృక్పథంతో గడపమని, ఆ దారిలో నడవమని, నడుస్తామని నమ్మకం కలిగించే కాలం. నిన్నటి అనుభవం సంతోషపు పూలపరిమళాలు దిద్దిన అందమైన అనుభవాలు కావొచ్చు. చేదు అనుభవాలు వదిలేసి.. కాసిన్ని అందమైన జ్ఞాపకాలను గుండెల్లో అదిమిపెట్టుకుని రానున్న రోజులన్నీ తేజోవంతం కావాలని ఆశించే వేళే నూతన సంవత్సరం.

కొత్త ఏడాదంటే ఉల్లాసం, ఉత్సాహంతోపాటు, సాధించాల్సిన లక్ష్యాలేంటో తేల్చుకోవాల్సిన కాలం. జీవనమార్గంలోకి ఆటంకంగా నిలిచే దురలవాట్లకు స్వస్తి చెప్పాలనే నిర్ణయానికి కొత్త ఏడాది ఓ చక్కటి సందర్భం. మంచిని స్వాగతించుకోవడానికి, చెడును వదిలేయడానికి ప్రత్యేకమైన ముహూర్తం. కాలచక్రంతో పోటీపడుతూ మన జీవితంలో వచ్చిపోతున్న ‘ఏడాది’ కాలపు తూకం కావాలి. వెనక్కి తొంగి చూసుకునే సందర్భమూ కావాలి. అలాంటి సంతోషకరమైన సందర్భంలో కొత్తగా కోటి ఆశలు నింపుకోవచ్చు. కొత్తగా జీవితపు లక్ష్యాలను నిర్దేశించుకోవచ్చు. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండాలని లేదు. మంచి మార్పు సాధించాలనే దీక్షకు నాంది పలికే రోజు ఈ కొత్త ఏడాదే. ఆత్మవిశ్వాసాన్ని ఆలంబన చేసుకుంటే కొత్త సంవత్సరంలో పూసే కోటి ఆశల్ని తురుముకోవచ్చు. కొంగ్రొత్త వేళ.. కొత్త ఆలోచనలకు శ్రీకారం చుడదాం. కొత్త ఊహలు, కొత్త నిర్ణయాలు గురించి మాత్రమే కాదు, గడిచిన సంవత్సరం తీసుకున్న నిర్ణయాల గురించి పునః పరిశీలన చేసుకోవాలి. కొత్త విషయాలు నేర్చు కోవడానికి చదువుతో సంబంధం లేదు. వయస్సుతో సంబంధం లేదు. పదవీ విరమణతో సంబంధం లేదు. కొత్త విషయాలని నేర్చుకోవాలన్న జిజ్ఞాస ఉండాలి.

-నందిరాజు రాధాకృష్ణ

Leave a Reply