మహాకవి గురజాడ వర్ధంతి నేడు

Share Icons:

తిరుపతి, నవంబరు 30,

ఒకనాడు.. అడుగుజాడ గురజాడ అన్న శ్రీశ్రీ.. మరో అడుగు ముందుకు వేసి… “కవిత్రయమంటే తిక్కన, వేమన, గురజాడ”  అన్నారు. అటువంటి గురజాడ అప్పారావు (1862 సెప్టెంబర్ 21 – 1915 నవంబర్ 30)   తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి, తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో ఒకరు, హేతువాది. ఆధునిక తెలుగు సాహిత్యం పయనించిన అనేక అభ్యుదయకారక మార్గాలకు ఆధ్యుడు గురజాడ అప్పారావు. 19 వ శతాబ్దంలోను, 20 వ శతాబ్ది మొదటి దశకంలోనూ ఆయన చేసిన రచనలు ఈనాటికీ ప్రజల మన్ననలను పొందుతున్నాయి.

గురజాడ ప్రజలందరికీ అర్ధమయ్యే జీవ భాషలో రచనలు చేసారు. వీరి కన్యాశుల్కము నాటకానికి సాహితీ లోకంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నాటకంలో ఆయన సృష్టించిన గిరీశం, మధురవాణి, రామప్ప పంతులు మొదలైన పాత్రలు ప్రఖ్యాతి పొందాయి. అభ్యుదయ కవితా పితామహుడు అని బిరుదు పొందిన అప్పారావు, తెలుగు సాహిత్యంలో వాడుక భాష ఒరవడికి కృషి చేసిన వారిలో ముఖ్యుడు. ఆయనకు కవి శేఖర అనే బిరుదు కూడా ఉంది.

1913 లో అప్పారావు పదవీ విరమణ చేసారు. అప్పటినుండి అనారోగ్యంతో బాధపడేవారు. ఇదే సమయంలో మద్రాస్ విశ్వవిద్యాలయం వారు “ఫెలో”తో గౌరవించారు. చివరికి, 53 సంవత్సరాల వయసులో 1915 నవంబర్ 30 న గురజాడ అప్పారావు మరణించారు.

దేశమును ప్రేమించుమన్నా..

గురజాడ అప్పారావు 1910 సంవత్సరంలో రచించిన ఈ గేయం ప్రజల్లో దేశ భక్తిని ప్రబోధించింది. స్వతంత్ర్యసమరంలోకి ప్రజలను కార్యోన్ముఖుల్ని చేసింది. ఈ ప్రముఖ గేయానికి ద్వారం వెంకటస్వామి నాయుడు స్వరాలను కూర్చారు. దీనిని కృష్ణా పత్రిక 1913 ఆగస్టు 9 తేదీన ప్రచురించింది. ఆ గేయం నేటికీ, ఏనాటికీ సార్థకమైనదే… మీ కోసం..

దేశమును ప్రేమించుమన్నా
మంచి యన్నది పెంచుమన్నా
వొట్టి మాటలు కట్టిపెట్టోయ్‌
గట్టిమేల్‌ తలపెట్టవోయి

పాడి పంటలు పొంగిపొర్లె
దారిలో నువు పాటు పడవోయి
తిండి కలిగితే కండ కలుగును
కండ కలవాడేను మనిషోయి

యీసురోమని మనుషులుంటే
దేశమేగతి బాగుఅగునోయ్‌
జల్దుకుని కళలన్ని నేర్చుకు
దేశి సరకులు నింపవోయ్‌

దేశాభిమానం నాకు కద్దని
వొట్టి గొప్పలు చెప్పుకోకోయ్‌
పూని ఏదైనాను ఒక మేల్‌
కూర్చి జనులకు చూపవోయ్‌

చెట్టపట్టాల్‌ పట్టుకొని
దేశస్థులంతా నడువవలెనోయ్‌
అన్నదమ్ముల వలెను జాతులు
మతములన్నియు మెలగవలెనోయ్‌

సొంత లాభం కొంత మానుకు
పొరుగు వానికి తోడుపడవోయ్‌
దేశమంటే మట్టి కాదోయ్‌
దేశమంటే మనుషులోయ్‌.

మామాట: ప్రజా కవిశేఖరునికి నివాళి.

Leave a Reply