‘మణిశంకరో’పాఖ్యానం… బీజేపికి కంఠాభరణం

Share Icons:

కాంగ్రెస్ స్వయం కృతాపరాధం
నష్టనివారణ చర్యలకు దిగిన రాహూల్

‘ మోడీ నీచమైన జాతికి చెందిన వాడు. ఆయనకు సభ్యత లేదు ’       – మణిశంకర్ అయ్యర్

‘ ఇది గుజరాత్‌కే అవమానం…. మొఘల్ ఆలోచనకు ప్రతిరూపం’       – ప్రధాని నరేంద్రమోడీ

గుజరాత్ ఎన్నికల వేళ రెండు ప్రధాన రాజకీయ పార్టీలు ఆట మొదలెట్టాయి. మణిశంకర్ వ్యాఖ్యలను సొమ్ముచేసుకోవడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అదే మణిశంకర్ అయ్యర్‌ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసి నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించింది.  ఇది ఇవ్వాళ భారతదేశంలో చర్చ జరగుతున్న వాడివేడి అంశం.

’నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందీ…‘ అంటారు పెద్దలు. ఈ మాట ఎంతో అనుభవం గడించిన తరువాతగానీ, సామెతల రూపంలోకి రాలేదు. ఇప్పడు ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుందీ.. అంటే, ప్రధాని మోడీపై కాంగ్రెస్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ చేసిన ’నీచ‘ వ్యాఖ్యలు ప్రస్తుతం ఆ పార్టీకి తీరని నష్టాన్ని కలిగిస్తున్నాయి. సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్న భారతీయ జనతాపార్టీని గట్టేక్కించే చుక్కానిలా పరిణమించాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ స్వయం కృతాపరాధంతో తల్లడిల్లుతోంది.

యావత్తు దేశం గుజరాత్ ఎన్నికల వైపు చూస్తోంది. కేంద్రంలో భారతీయ జనతాపార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత తన కంచుకోట గుజరాత్‌లో జరుగుతున్న తొలిఎన్నికలు(స్థానిక ఎన్నికలు,ఉపఎన్నికలుకాకుండా) కావడం విశేషం. ఇక్కడ ఫలితం ఎలా ఉండబోతోందనేది ఆసక్తికర అంశంగా మారింది. దేశంలోని అన్ని రాకీయపార్టీలు, అందరు విశ్లేషకులు, సామాన్యులు అటువైపే చూస్తున్నారు.

నరేంద్ర మోడీ చాలా కాలం గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేశారు. భారతీయ జనతా పార్టీకి వెన్నుదన్నుగా నిలిచారు. చివరకు తిరుగులేని నాయకుడిగా తయారై ప్రధాని పీఠాన్ని అధిరోహించారు. ప్రధాని అయిన తరువాత ఆ రాష్ట్రమే కాదు, యావత్తు దేశం ఆయనపై పెద్దగా ఆశలు పెట్టుకుంది. అయితే, ఆయన సామాన్య జనానికి వాతలే తీశారు. మిగిలిన నాయకులకంటే తానేమి భిన్నమైన వాడిని కానని చెప్పడానికి ఎంతో కాలం పట్టలేదు. పెద్ద నోట్ల రద్దు, వస్తుసేవల పన్ను (జీఎస్టీ) అమలు వంటివి దేశంలోని సామాన్యుల నడ్డి విరిచాయి. అదే రకంగా గుజరాత్‌లోనూ ప్రభావాన్ని చూపాయనడంలో అనుమానం లేదు. ఇక్కడ వ్యాపార వర్గాలు ఎక్కువ.

రాష్ట్రంలో వ్యాపార, వాణిజ్య వ్యవహారాలలో ప్రభుత్వం జోక్యం చేసుకున్న తీరు చాలా అనుచితంగా ఉన్నదనేది గుజరాత్‌లో ప్రతి చిన్న, పెద్ద వ్యాపారి భావిస్తున్నాడు. తమకు ఇస్తున్న కనీస మద్దతు ధరను మరింతగా పెంచాలని సౌరాష్ట్ర పత్తి రైతులు డిమాండ్ చేయడంలోనూ, ప్రైవేట్‌ విద్యాసంస్థలలో ఫీజులు చాలా అధిక మొత్తంలో ఉండడం పట్ల విద్యార్థుల నిరసనలు వెరసి ప్రభుత్వం పట్ల గుజరాత్‌ ప్రజల అసంతృప్తి ఆగ్రహావేశాలను సంపూర్ణంగా ప్రతిబింబిస్తున్నాయి. ఇవన్నీ రెండు దశాబ్దాల బీజేపీ పాలన పట్ల వ్యతిరేకతకు నిదర్శనాలుగా నిలుస్తున్నాయి. మరోవైపు హార్దిక్‌ పటేల్‌ సభలకు జనం తండోపతండాలుగా రావడాన్ని బట్టి యువ గుజరాతీ ఓటరు తమకు ఉండబోరన్న అంశం కూడా బీజేపీ నాయకులను కలవరపెడుతోంది.

దీనిని పసిగట్టిన భారతీయ జనతా పార్టీ విజయ సాధనకు గుజరాత్‌ ఆత్మగౌరవాన్నిఅంతిమ బ్రహ్మాస్త్రంగా, భూమి పుత్రుడుగా వెలుగొందుతోన్న నరేంద్ర మోదీ ఆకర్షణ శక్తిని తన ప్రధాన ప్రచారాస్త్రంగా చేసుకున్నది. మరోవైపు మొగల్ పాలకుల పేర్లను పదే పదే గుర్తు చేస్తూ, దానిని కాంగ్రెస్ పాలకులకు ఆపాదించి హిందూ ఓట్లను గంపగుత్తగా గడించే ప్రయత్నం చేస్తోంది. ఇలా నానా కష్టాలు పడుతున్నా భారతీయ జనతా పార్టీకి గ్రామీణ ప్రాంతాలలో పట్టు సడలుతోంది. పట్టణ ప్రాంత గుజరాతీలు బీజేపీకి మరొక అవకాశాన్ని ఇవ్వడానికి సుముఖంగా ఉన్నా, వారిలోని వాణిజ్య వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ, రాష్ట్ర రాజకీయ పరిణామాలను నిర్దేశించగల శక్తి సామర్థ్యాలను తాను కోల్పోతున్న సత్యాన్ని బీజేపీ అర్థం చేసుకొని తీరాలి.

ఇలాంటి స్థితిలో భారతీయ జనతాపార్టీ చేతికి కాంగ్రెస్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ ఒక అస్త్రాన్ని అందించారు. ’మోదీ నీచమైన జాతికి చెందిన వాడు, ఆయన సభ్యత తెలియదు‘ అంటూ నోటి దురుసును ప్రదర్శించాడు. ఇదే ప్రస్తుతం పెద్ద దుమారమై కూర్చుంది. ఇంత వరకూ మంచి ఊపు మీదున్న కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ చేసుకుంది. నష్ట నివారణగా మణిశంకర్ అయ్యర్ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసి చర్యలు తీసుకున్నారు. కానీ, దారిన పోయే అంశాలను నెత్తికి తెచ్చుకుని సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన స్థితి మాత్రం తప్పడం లేదు. ఎదురు దాడి చేయాల్సిన స్థితి నుంచి ఆత్మరక్షణలో పడింది. 2014లో కూడా మోదీ పై ‘చాయ్ వాలా… ఏఐసీసీ కార్యాలయంలో చాయ్ అమ్ముకోవాలి’ అంటూ మణి శంకర్ అయ్యర్‌ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ను కష్టాల్లోకి నెట్టాయి. ఇప్పుడు మళ్ళీ మణి శంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలనే ప్రధానాంశాలుగా మార్చుకుని మోడీ ముందుకు సాగుతున్నారు.

మామాట : గెలవాలంటే మణిశంకర్ అయ్యర్‌తో తిట్టుంచుకోవాల్సిందేనేమో…!

 

One Comment on “‘మణిశంకరో’పాఖ్యానం… బీజేపికి కంఠాభరణం”

  1. ‘మణిశంకరోపాఖ్యానం’ పట్ల తిట్టించుకున్న వాళ్లే ఎక్కువ సంబరపడి గుజరాత్ ఎన్నికల్లో ‘సొమ్ము’ చేసుకుంటున్నట్లున్నారు..

Leave a Reply