78 ఏండ్ల వయసులోనూ కత్తి పట్టిందంటే ప్రత్యర్ధి శిరసానమామి!

Share Icons:

కేరళకు చెందిన 78 ఏళ్ల వృద్ధురాలు మీనాక్షి అమ్మ భారతదేశ పురాతన మార్షల్‌ ఆర్ట్‌ కలరిపయట్టును నేటికి కూడా సాధన చేయడమే కాక అమ్మాయిలు దాన్ని సాధన చేసేలా ప్రొత్సాహిస్తున్నారు. ఈ సందర్భంగా మీనాక్షి అమ్మ మాట్లాడుతూ.. ‘‘ఏడేళ్ల వయసు నుంచే కలరి సాధన చేయడం ప్రారంభించాను. ఇప్పటికీ ప్రాక్టీస్‌ చేయడమే కాక ఇతరులకు నేర్పుతున్నాను’’ అని తెలిపారు. కలరిపయట్టు నేర్పే ఈ స్కూల్‌ని మీనాక్షి భర్త 1949లో ప్రారంభించాడు. ఆయన మరణం తర్వాత మీనాక్షి ఈ స్కూల్‌ బాధ్యతలు చూస్తున్నారు.

‘‘రోజు ఉదయం పేపర్‌ తెరిచామంటే.. మహిళపై జరుగుతున్న దాడులకు సంబంధించి ఏదో ఓ వార్త ఉంటుంది. ఇలాంటి అరాచకాల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే కలరిపయట్టు నేర్చుకోవడం ఎంతో మంచింది. ఈ మార్షల్‌ ఆర్ట్‌ కళను నేర్చుకోవడం వల్ల మహిళలు శారీరకంగా, మానసికంగా ధృడంగా తయారవుతారు. వారి మీద వారికి నమ్మకం పెరుగుతుంది.. ఒంటరిగా ఉద్యోగాలకు వెళ్లడం.. ప్రయాణాలు చేయాల్సి వచ్చినా వారు భయపడరు’’ అన్నారు మీనాక్షి.

‘‘కలరిపయట్టులో పూర్తిగా నిమగ్నం అయితే మన శరీరమే కళ్లవుతాయి. ప్రత్యర్థి మాయమవుతాడు. దీనిలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి శాంతికి సంబంధించింది అయితే మరోకటి యుద్ధంలో వాడేది. కలరిపయట్టు నేర్చుకోవడం వల్ల మనసు, బుద్ధి, శరీరం, ఆత్మ పూర్తిగా శుద్ది అవుతాయి. ఏకాగ్రత పెరుగుతుంది. వేగం, శాంతి పెరుగుతాయి. శారీరక, మానసిక శక్తి పునరుత్తేజమవుతోంది’’ అన్నారు.

నృత్యం,యోగా అంశాలను కలిగి ఉన్న కలరిపయట్టులో కత్తులు, కవచాలు, వంటి ఆయుధాలు ఉంటాయి. కలరి 3,000 సంవత్సరాల పురాతనమైనది. దీని గురించి ప్రాచీన హిందూ గ్రంథాలలో ప్రస్తావించారు. అయితే బ్రిటీష్‌ పాలనలో కలరిపయట్టు సాధనపై నిషేధం విధించారు. అయితే స్వాతంత్య్రం వచ్చాక నిషేధాన్ని తొలగించినప్పటికి పూర్వ వైభవం రాలేదు. కాకపోతే 20వ శతాబ్దం ప్రారంభం నుంచి కలరిపయట్టుపై ఆసక్తి చూపే వారి సంఖ్య పెరగడం మంచి పరిణామంగా భావిస్తున్నారు.

సేకరణ :- మామాట డస్క్ (అంతర్జాల సంచికల నుండి)

Leave a Reply