హైదరాబాద్, సెప్టెంబర్ 8,
తెలంగాణ అసెంబ్లీ ఎనిమిది నెలల ముందుగానే రద్దయింది. ఈ నేపథ్యంలో సంక్షేమ, అభివృద్ధి పథకాలు సజావుగా కొనసాగుతాయా? వాటికి నిధులు సక్రమంగా విడుదలవుతాయా..? అంటే డౌటేనంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. ముఖ్యంగా ప్రతిష్టాత్మకమైన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ప్రాజెక్టుల నిర్మాణంలాంటి పథకాలను నిధుల లేమి వెంటాడే అవకాశముందని ఆయా వర్గాలు ఉటంకిస్తున్నాయి. ఈ పథకానికి రూ.20 వేల కోట్లను ఖర్చు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించింది. అయితే వీటిని మిషన్ భగీరథ కార్పొరేషన్ ద్వారానే ఖర్చు చేస్తున్నారు. ఇందుకోసం అప్పులను తీసుకొస్తున్నారు. మరోవైపు కాళేశ్వరంలాంటి భారీ ప్రాజెక్టుకు కూడా ‘కాళేశ్వరం కార్పొరేషన్’ ద్వారానే నిధులను ఖర్చు చేస్తున్నారు. అది కూడా అప్పుల రూపంలో తెచ్చి మరీ ఖర్చు చేయటం గమనార్హం.
ఈ క్రమంలో కాళేశ్వరం కోసం రూ.15 వేల కోట్లను అప్పుల రూపంలో సంగ్రహించారు. వాస్తవానికి ఈ పరిమితిని 3.5 శాతానికి పెంచాలంటూ కేసీఆర్… అనేకమార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కేంద్రం కూడా అందుకు అంగీకరించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అప్పులపై వడ్డీ బడ్జెట్లో 10 శాతానికి మించి ఉండకూడదన్నది ఎఫ్ఆర్బీఎమ్ నిబంధన. కానీ తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తున్న వడ్డీలు 13 నుంచి 14 శాతం కంటే ఎక్కువగానే ఉంటున్నాయి. వడ్డీల రూపంలోనే ఏడాదికి రూ.12 వేల నుంచి రూ.13 వేల కోట్ల భారం ఖజానాపై పడుతున్నది. దీంతో 3.5 కాకుండా 3.25 శాతానికే ఎఫ్ఆర్బీఎమ్ పరిమితిని పెంచాలని కేంద్రం నిర్ణయించింది. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం చేసే అప్పుల్లో రూ.1800 కోట్లు తక్కువగా చేయాల్సి వస్తుందని ఆర్థికశాఖకు చెందిన ఓ అధికారి తెలిపారు.
ఆర్థికపరంగా ఇలాంటి చిక్కుముడులు రాష్ట్రాన్ని వెంటాడుతుండగా… ఇప్పుడు రాజకీయపరంగా అసెంబ్లీ రద్దయింది. నిధుల విడుదలపై సందిగ్దత నెలకొంది. ముఖ్యమంత్రి, మంత్రులు అధికారంలో ఉన్నప్పుడే వివిధ స్కీములకు నిధులు ఆలస్యంగా విడుదలవు తుంటాయి.. అలాంటప్పుడు ఆపద్ధర్మ ప్రభుత్వంలో వాటిని అంత త్వరగా విడుదల చేసే అవకాశం ఉండబోదని ఆర్థికశాఖ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఇదే సమయంలో అసెంబ్లీ ఆమోదం పొందిన బడ్జెట్లోంచి.. అందులో పేర్కొన్న అంశాలకు వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు నిధులను విడుదల చేయించు కోవచ్చు. తద్వారా ఆయా శాఖలకు సంబంధించిన పథకాలు, కార్యక్రమాలను అమలు చేసుకోవచ్చు. అయితే వారు విధిగా సీఎస్ అనుమతిని తీసుకోవాల్సి ఉంటుంది. కానీ కొత్త పథకాలు, కార్యక్రమాలను ప్రారంభించే అవకాశం, అధికారం ఇటు ఆపద్ధర్మ ప్రభుత్వానికిగాని, అధికారులకుగానీ ఉండబోదని ఓ సీనియర్ ఐఏఎస్ తెలిపారు.
మామాట: ఆపద్ధర్మంలో పనిచేయకూడదని లేదుగా..