గాంధీ అంటే.. ఒక సత్యం, ఒక అహింస. లోహియా – గాంధి ..  వారిదొక అనుబధం.

Share Icons:

గాంధీ అంటే.. ఒక సత్యం, ఒక అహింస. లోహియా – గాంధి ..  వారిదొక అనుబధం

ఇరవయ్యో శతాబ్దపు రాజకీయాలు భారత దేశంలో ఒక వ్యక్తి చొరవ, శక్తియుక్తుల చుట్టూనే పరిభ్రమించాయి. ఆయనే మహాత్మా గాంధి. ఈ దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మోహన్ దాస్ కరమ్‌చంద్ గాంధీ అంటే ఎవరో వెంటనే స్ఫురణకు రాకపోవచ్చుగానీ.. గాంధీ.. మహాత్మాగాంధీ అనే పేరు ప్రతివారికీ నాలుకపై ఆడుతుంటుంటుంది. మస్తిష్కంలో ఆ రూపు మెదలుతుంటుంది. ఆ బోసినవ్వుల వదనం కొల్లాయి వస్త్రాలు, చేతిలో ఓ కర్ర.. మస్తిష్కంలో ఆ రూపు మెదలుతుంటుంది. మహాత్మునికి ఇప్పుడు, ప్రత్యేకంగా ఈ నెలలో అధిక ప్రాచుర్యం లభించింది. ఆయన 150 వ జయంతి అందుకు కారణం. విభిన్న అభిప్రాయాలు, విధానాలు, ఆలోచనా సరళి, జీవన శైలి ఉన్నవారికి కూడా ఆ రోజుల్లో గాంధీ అంటే ఒక ప్రగాఢమైన గౌరవం, నమ్మకం ఉండేవి.

కాంగ్రెస్ పార్టీ విధానాలను, వ్యవహార శైలిని వ్యతిరేకించేవారుకూడా మహాత్మా గాంధి అంటే శిరసువంచి గౌరవిస్తారు. అది ఆయన వ్యక్తిత్వం, సౌశీల్యం, నిరాడంబరత, సత్యశోధన, స్వాతంత్ర్య కాంక్ష, అనుసరించిన అహింసామార్గం గొప్పతనమే..నేటి రోజులను పక్కనపెట్టి, గతకాలంలో ఆయనతో కలిసినడిచిన మహోన్నతులనేకమంది. భారత స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో మహాత్ముని సమకాలీనులను పక్కన పెడితే, జవహర్ లాల్ నెహ్రూ ఆయనకంటే 20 సంవత్సరాలు చిన్న. అయితే గాంధీ కంటే 40 సంవత్సరాలు, నెహ్రూ కంటే 20 సంవత్సరాలు చిన్న అయిన రాం మనోహర్ లోహియ పై వారిద్దరి ప్రభావం ఎక్కువగా ఉండేది. గాంధీ అంటే లోహియాకు అపార గౌరవం. బ్రిటిష్ పాలనా శృంఖలాలు తెంచి భారత దేశానికి స్వతంత్ర్యం సాధించాలన్న దృఢసంకల్పంతో గాంధీ పిలుపు మేరకు ముందుకువచ్చి తమను తాము అంకితం చేసుకునేందుకు సిద్ధమైన వేలాది మందిలో లోహియా ఒకరు. గాంధిజీ, నెహ్రూ వల్లనే రాజకీయాల్లో, స్వాతంత్ర్య ఉద్యమంలో తాను స్ఫూర్తి పొందానని, ఆ లోహియానే చెప్పారు.  నెహ్రూను గౌరవించారు, రాజకీయంగా ఎప్పుడూ తూలనాడలేదు.

స్వాతంత్ర్యానంతరం కాల క్రమేణా కాంగ్రెస్‌కు బద్ధ ప్రతిపక్షంగా తయారైన లోహియా, స్వాతంత్ర్యానికి పూర్వం  యువకునిగా కాంగ్రెస్ లో ఒక చురుకైన కార్యకర్త.  భారత జాతీయ కాంగ్రెస్ నాయకత్వంలో రాజకీయ ప్రవేశం చేయాలన్న కుతూహలం ఉన్న లోహియాను మహాత్మునికి మొదట పరిచయం చేసింది  జమ్నాలాల్ బజాజ్. ఆయన గాంధీజీకి అత్యంత సన్నిహితుల్లో ఒకరు. లోహియాకు గాంధీ రాజకీయ పంథా ఎంతగానో నచ్చి ఆ మర్గంలో అడుగెయ్యాలన్న ఉత్సాహం ఉందని,  అంతే గాక.. అప్పటికే “ఉప్పు పై పన్ను – సత్యాగ్రహం” అంశంపై ఆయన పి హెచ్ డి పరిశోధనా  పత్రాలు సమర్పించారని తెలుసుకుని గాంధి సానుకూలంగా స్పందించి  రాజకీయ ప్రవేశానికి ఆయనను ప్రోత్సహించారు. 1935 లో జవహర్‌లాల్ నెహ్రూ భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఉన్న సమయంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో లోహియాను ఒక ఉన్నత స్థాయి సభ్యునిగా, కాంగ్రెస్ విదేశీ సంబంధాల విభాగం కార్యదర్శిగా నియమిస్తూ గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు.

కాంగ్రెస్ కంటే గాంధీజీ అత్యంత శక్తిమంతుడని ఒక గొప్ప నాయకుడని లో చేరిన అతి కొద్ది సమయంలోనే లోహియా గ్రహించారు. గాంధీ పట్ల ఎంతగానో గౌరవం, విశ్వాసం ఉన్నప్పటికీ జాతీయ, అంతర్జాతీయ విషయాలలో ఎప్పటికప్పుడు నిస్సంకోచంగా, సూటిగా తన అభిప్రాయాలను గాంధి ఎదుట వ్యక్తం చేయ్సడంలో ఆయన జంకేవాడు కారు.  అప్పటినుంచీ ఓ అయిదేళ్ళ కాలంపాటు అత్యంత దగ్గరగా గమనిస్తూ లోహియా మేధాశక్తి సంపదను, రాజకీయ దూరదృష్టిని, పార్టి నాయకునిగా తనపై ఆయన విశ్వాసాన్ని నిశితంగా పరిశీలించే అవకాశాన్ని గాంధీ వినియోగించుకున్నారు. లోహియా శక్తి సామర్ధ్యాలు, సచ్ఛీలత, విశ్వసనీయతలకు ఆయన ముగ్ధులయ్యారు. తన ఆశయాలను యువకుడైన లోహియా తప్పకుండా నెరవేర్చగలడన్న ప్రగాఢ నమ్మకం గాంధీకి ఏర్పడినట్లే.. మహాత్ముని కలలను సాఫల్యం చేస్తూ లోహియా కూడా తన వ్యక్తిత్వాన్ని మరింత పెంచుకుని గాంధీకి చేరువ కాగలిగారు.

1936-38 కాలంలో కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ కొత్తగా ప్రారంభించిన ఒక సంచిక సంపాదక బాధ్యతలను లోహీయా సమర్ధంగా నిర్వహించి గాంధీకి మరింత ఇష్టుడయ్యారు.  లోహియా బాధ్యతలు నిర్వహిస్తున్న సంచికకు గాంధీ క్రమం తప్పకుండా వ్యాసాలు రాస్తుండేవారు. అంతేగాక, తన స్వీయ సంపాదకత్వంలో వెలువడుతున్న “ద హరిజన్” ప్రచురణలో లోహియా వ్యాసాలను ప్రచురించి మరింత ప్రోత్సహించారు.

ఒకసారి, యుద్ధ వ్యతిరేక ప్రసంగాలను చేసారన్న అభియోగంపై బ్రిటిష్ పాలకులు లోహియాను అరెస్ట్ చేసారని విన్నవెంటనే..”లోహియా జైలులో ఉంటే నేను మౌనం వహించి కూర్చోలేను. లోహియాకున్న నిరాడంబత, ధైర్య సాహసాలున్న మరొక వ్యక్తిని నేను చూడలేదు. అతనెప్పుడూ హింసను సమర్ధించలేదు, ప్రోత్సహించలేదు. అతని చర్యలు అతని ఔన్నత్యాన్ని మరింత పెంచాయి.”అని గాంధీ వ్యాఖ్యానించారు. అదే విధంగా మరోసారి రహస్య స్థావరంలో ఉన్న లోహియాను బ్రిటిష్ ప్రభుత్వం పట్టుకుని 1944-46 రెండేళ్ళపాటు లాహోర్ జైలులో బందీ చేసి, తీవ్రంగా హింసించినప్పుడు గాంధీ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడితెచ్చి విడుదల చేయించి లోహియా పట్ల తనకున్న అభిమానం  చాటుకున్నారు.

స్వాతంత్ర్యానంతరం, గాంధీజీ మరణానంతరం కాంగ్రెస్ పాలనా విధానాలతో విభేదించి విలువలతో కూడిన ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన లోహియా అనుచరులు, అభిమానులు… సైతం ఇప్పటికీ గాంధీపట్ల గౌరవభావం ప్రదర్శిస్తునే ఉన్నారు. లోహియా అలోచనా సరళిని అవలంబిస్తూ, ఆయన అడుగుజాడల్లో నడచి, సంయుక్త సోషలిస్ట్ పార్టీ సిద్ధాంతాలకు అంకితమై,  ఆయన వ్యక్తిత్వాన్ని ఈ తరం వారికి తెలియజేసే బృహత్తర కార్యభారం భుజానికెత్తుకున్న “రామ మనోహర్ లోహియా సమతా ట్రస్ట్ (సోమాజిగూడ), లోహియ విజ్ఞాన సమితి, బేగంపేట, హైదరాబాద్ – నిర్వాహకులు శ్రీ రావెల సోమయ్య ఆధ్వర్యంలో మహాత్మాగాంధిని పలుకోణాలలో ఆవిష్కరించే ప్రయత్నంలో ప్రముఖ సంపాదకుడు నార్ల వెంకటేశ్వరరావు “ఆంధ్రప్రభ – ఆంధ్రజ్యోతి” పత్రికల్లో 1944-73 కాలంలో రాసిన సంపాదకీయాలలో ముప్ఫై మూడు ఆణిముత్యాలను  ఏర్చి కూర్చి సంకలనం చేసి “మహా స్వప్నం – మహాత్మా గాంధీ” పేరిట ఒక పుస్తకరూపం ఇచ్చారు. గాంధీజీని తెలుసుకునేందుకు ఇది ఒక కరదీపిక. ఈ తరానికి గాంధీని పరిచయం చెయ్యడానికి శ్రీ సోమయ్య కృషికి ఫలితం లభిస్తుందనే ఆశిద్దాం..

మహాత్ముడు చనిపోయినప్పుడు ఆయన రాసిన సంపాదకీయం ఆంధ్రదేశాన్ని పట్టి కుదిపింది. “Great people may think alike, but great men do not feel or opine alike”,  అనే అక్షరసత్యానికి ప్రత్యక్ష సాక్ష్యం నార్ల.  స్వాతంత్రోద్యమంలో, గాంధీ పోషించిన పాత్రని మనసారా మెచ్చుకుంటారు నార్ల. గాంధీజీ గురించి సంపాదకుని కలం నుంచీ జాలువారిన కొన్ని పసిడి తునకలు…

*గాంధీకి భారత ప్రజానాయకత్వం ఒకరిచ్చింది కాదు. ఒకరు తొలగించితే తొలగిపోయేదికాదు. చివరకు తనకు తానుగా తోసిపుచ్చలేదు. చరిత్రే ఆయన్ను ఎన్నుకుంది…. *గాంధీజీ ఒక వ్యక్తి కాదు. ఒక సంస్థ. ఒక సంస్థ కూడా కాదు. ఒక తేజస్సు, ఒక ఓజస్సు. బుద్ధునివలె, క్రీస్తువలె, గాంధీజీకి ప్రధాన సందేశం సత్యం, అహింసలే. కానీ ఆ ప్రాచీన సందేశాన్ని ఆదునిక యుగధర్మంతో – దాని అవసరాలతో – మిళితం చేయడం గాంధీజీలోని ప్రత్యేకత. విశిష్టత. *సత్యాగ్రహ పద్ధతిని చూపించడం ద్వారా, బుద్ధుని బోధనలను, ఏసుక్రీస్తు సందేశాన్నిగాంధీజీ ఒక ఉత్తమ పరి ణతికి తెచ్చారు.

*ఈ రాజకీయ నాయకులలో గాంధీ స్థానం   విశిష్టమైనదేకాక, విభిన్నమైనదికూడా. భారత నైతిక విప్లవకారులలో గాంధి అసమాన్యుడు గనుకనే భారత స్వాతంత్ర్య నిర్మాతలలో ఆయన స్థానం అసమాన్యమైనట్టిది. *గాంధి ప్రారంభించిన ఈ నైతిక విప్లవం పరిపూర్తి చెందితేనే, మనకు మరి ఏడురోజుల్లో  సంక్రమించనున్న స్వాతంత్ర్యం సార్ధకం కావడమైనా, సుస్థిరత్వాన్ని పొందడమైనా.. * గాంధీజీ ఆరోగ్యం కుంచించుకుపోతున్నదంటూ…. ఆయనకు కంటి చూపు తగ్గింది. కానీ నేటి దేశ పరిస్థితులను సునిశితంగా చూడగలుగుతున్నది ఆయనొక్కడే. ఆయన కాలు చేతులకు వణుకు పుట్టింది.కాని, కర్తవ్య పథాన్ని మెట్టడంలో నేటికీ దేశం మొత్తంపై ఆయనదే ముందడుగు. ఆయన శరీర పటుత్వం పూర్తిగా సన్నగిల్లింది. ఐనా, లక్ష్యబలంలో ఆయనే మిన్న. దేహదారుఢ్యం తగ్గినకొద్దీ – ఆయనలో మనో దారుఢ్యం హెచ్చుతుంది.  మనో దారుఢ్యం కంటే మిన్నగా ఆత్మశక్తి పెంపొందుతుంది. నానాటికి ఇతోధిక శక్తితో, దీప్తితో, ప్రతిభతో, విజ్ఞతతో ఆయన విలసిల్లుతున్నారు.

*దేశ విభజన మహా అనర్ధదాయకమని తుదివరకూ ఆయత్నాన్ని శక్తివంచన లేకుండా ప్రతిఘంటించినవాడు ఆయనే.  *జన్మవల్ల ఆయన హిందువు కావచ్చు, అయినా అన్ని మతాల మూల సిద్ధాంతాలు ఆయనలో పరాకాష్ఠ చెందినవి. అంచేతనే ఆయమ్న హత్యకు గురికావడం ప్రతి మతానికి లజ్జాకరమైన విషయమే. గాంధీజీ భారతీయుడు. కాని, ఆయన అస్తమయానికి దురపిల్లుతున్నది ఒక్క భారతదేశమే కాదు. చైనా నుంచి పెరూ వరకు సమస్త ప్రపంచం..

*గాంధీజీ దారుణ హత్య మరుసటిరోజు..(ఆంధ్రప్రభ 1, ఫిబ్రవరి, 1948) ఓ నాలుగు వాక్యాలు రాసి… “తండ్రిని చంపుకొనదమా? గురువును పొట్తన పెట్టుకొనడమా?? మనం సభ్య మానవులమేనా?  ఈ సిగ్గును మనం ఎలా భరించగలం? ఈ క్ష్టం నుంచి ఎలా గట్టెకగలం? మంకు ఏమి దిక్కు? ఏది దారి? అబ్బ ఎంత చీకటి? గుండెలపై ఎంతపెద్ద రాయి! ..  ఉహు! ఇక రాయలేను. చేతి నుంచి కలం జారి… “  అని అర్ధంతరంగా ముగించారు సంపాదకీయాన్ని.

ఎన్నో, ఎన్నెన్నో.. ఇలాంటివెన్నెనో…

-నందిరాజు రాధాకృష్ణ

Leave a Reply