స్నేహ మాధుర్యం:

Share Icons:

 స్నేహ మాధుర్యం:

స్నేహం మాధురాతి మధురం. స్నేహానికి హద్దులు ఉండవు. పరిమితులు ఉండవు. స్నేహం ఒక గొప్ప ప్రవాహం లాంటిది. అనిర్వచనీయమైనది. త్యాగాన్ని కోరుకుంటుంది. ప్రేమను కురిపిస్తుంది. సంతోషాన్ని కలిగిస్తుంది. తృప్తిని కలిగిస్తుంది. అసంతృప్తిని దూరం చేస్తుంది. ఆశలను చిగురింపజ్తేంది. ఆశయాలను గుర్తుచేస్తుంది. స్వార్థాన్ని నామరూపాలు లేకుండా నాశనం చేస్తుంది. కపటాన్ని, మోసాన్ని కాఠిన్యాన్ని దరిచేరనీయదు. వృద్ధిని కోరుకుంటుంది. సన్మార్గంలో నడిపిస్తుంది. అందుకే చిరస్మరణీయమైన మధుర జ్ఞాపకాలను మిత్రులు ఎల్లప్పుడూ కోరుకుంటారు. అందుకే స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అన్నారు.

 

స్నేహానికన్నా మిన్న లోకాన లేదు. స్నేహానికి హెచ్చుతగ్గులు ఉండవు. పేద, ధనిక తారతమ్యాలు ఉండవు. స్నేహానికి కులం, మతంతో పని లేదు. కష్టసుఖాల్లో ఒకరికి ఒకరు తోడు నీడలా ఉంటారు. వారే నిజమైన స్నేహితులుగా నిలుస్తారు. ఒకరి శ్రేయస్సును మరొకరు కోరుకుంటారు. అవసరమైతే ఒకరికొకరు ఒకరు సుఖాలను, సంపదలను, సమయాన్ని సర్వస్వం త్యాగం చేయటానికి వెనుకాడరు. ఇవ్వడం, తీసుకోవడం, దాపరికం లేక పోవడం, అడగడం, తీసుకోవడం లక్షణాలు స్నేహమున్న చోటనే ఉంటాయంటారు. నిజమైన స్నేహం నిర్మలమైనది, స్వచ్చమైనది. నిజమైన స్నేహం సంపదకు స్వార్థానికి అతీతం.

 

స్నేహం త్యాగం కోరుతుంది, స్నేహం ప్రాణానికి ప్రాణం పెడుతుంది. నిజమైన స్నేహం చిరకాలం నిలుస్తుంది. మల్లెలాగా సున్నితమైంది, గులాబీలా గుచ్చుకుఉంటుంది. వెన్నెలంత స్వచ్ఛమైంది. అరమరికలులేని ఆనందాల సమ్మిళితం అసలైన స్నేహం!   స్నేహ మాధుర్యం మాటలకు అందనిది. కష్టం వచ్చినపుడు కన్నీటి కంటే ముందు నేనున్నానని గుర్తుంచుకునేదే స్నేహం. మనుషులు విడిపోవచ్చు మనసులు ఓడిపోవచ్చు, మమతలు  మాసిపోవచ్చు… కానీ మారనిది అనుభవించిన స్నేహ మాధుర్యం. స్నేహానికి  సాటి, పోటీ  ఏమీ ఉండవు.

 

-నందిరాజు రాధాకృష్ణ

Leave a Reply