కాంగ్రెస్ లో మరో నలుగురు గులాబీ ఎంపీలు

Share Icons:

 హైదరాబాద్, నవంబర్ 21,

తెలంగాణ రాష్ట్రీయ సమితి పార్టీ సంక్షోభంవైపు వెళుతుందా..? పరిస్థితులు గమనిస్తే అదే జరిగేలా కనిపిస్తుంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు పార్టీ ఎంపీలు కాంగ్రెస్‌ తీర్థం తీసుకునేందుకు సిద్ధమయ్యారని విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి రాజీనామా చేశారు. బహిరంగంగా టీఆర్‌ఎస్‌ పరిస్థులను ఎండగట్టారు. మరోవైపు పార్టీలో స్వేచ్ఛ ఉండదు, ఆ కుటుంబ పెత్తనమే ఉంటుందని, నిజంగా పార్టీ కోసం కష్టపడిన వారికి ప్రాధాన్యత లేదంటూ కుండ బద్దలు కొట్టారు. సోనియా సభ పెట్టిన తరువాత కూటమికి కలిసొస్తుందని భావిస్తున్నారు.. కాని అది పూర్తిగా సుడి తిప్పుతుందని తాజాగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఈ నెల 23న జరిగే సోనియా సభలో టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మహబూబబాద్‌ ఎంపీ సీతారామ్‌నాయక్‌, నల్గొండ ఎంపీ గుత్తాసుఖేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ లోక్‌సభ ఫ్లోర్‌లీడర్‌ జితేందర్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌ గూటికి రానున్నారని విశ్వసనీయ సమాచారం. దీనిపై టీఆర్‌ఎస్‌లో కలవరం మొదలైంది. ఎన్నికల వేళ పార్టీకి ఈ కుదుపేంటని కంగారు పడుతున్నారు. వెంటనే పార్టీ కోర్‌ టీం సభ్యులతో కేసీఆర్‌ భేటీ అయి వారిని బుజ్జగించాలని ప్రయత్నాలు ప్రారంభించారని తెలుస్తోంది. ఒకే సారి ఇంత మంది పార్టీ వీడవలసిన అవసరం ఉందా.. అనే సందేహం కలగకమానదు.. కాని ప్రధానంగా టీఆర్‌ఎస్‌ ఎంపీలు మొత్తం ఆత్మాభిమానం చంపుకోని వారు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పార్టీలో ఎంపీలంటే పురుగులను చూసినట్లు చూస్తున్నారంటూ సన్నిహితుల దగ్గర ఎంపీలు వాపోయేవారు.

ఎప్పుడైనా సీఎం కేసీఆర్‌ ఢిల్లీ వస్తే అక్కడ కేంద్ర మంత్రిని కలవడానికి వెళ్లే సమయంలో ఎవరైనా ఎంపీ అక్కడ కనిపిస్తే చాలు ‘నీకేం పని ఇక్కడ, నువ్వు రావాల్సిన అవసరం లేదు.’ అంటూ చాలా కటువుగా కేసీఆర్‌ సమాధానం చెప్పేవాడని చాలా మంది ఎంపీలు మీడియా ప్రతినిధుల దగ్గర వాపోయేవారు. దాంతో కొన్నాళ్లకు సీఎం ఢిల్లీ వస్తున్నాడంటే ఎంపీలు హడలిపోయే పరిస్థితికి వచ్చింది. ఎప్పుడు రమ్మంటాడో తెలియదు, ఎప్పుడు పొమ్మాటాడో తెలియని పరిస్థితి అని తలలు పట్టుకునే వారు. ఈ క్రమంలోనే పార్టీలో హోదాలు ఇచ్చినా, ఆత్మాభిమానం కరవై వారు కాంగ్రెస్‌ బాట పడుతున్నట్లు సమాచారం.

తెలంగాణలో ఉండే సమయంలో ఎంపీలు వళ్లు దగ్గర పెట్టుకునే ఉండేవారని, వారు ఢిల్లీలో ఉన్నప్పుడు నిఘా బంధనాలకు దూరంగా ఉండటం వల్ల కాంగ్రెస్‌ పెద్దలతో సత్సంబంధాలు నెరిపేవారని తెలుస్తోంది. మరోవైపు టీడీపీ అధినేత రంగంలోకి దిగి కూటమిని దారిన పెడుతున్న నేపథ్యంలో ఎవరు ఎప్పుడు పార్టీలోకి రావాలో అనేది కూడా ఒక ప్రణాళికా బద్ధంగా జరుగుతోందని సమాచారం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగే లోపే ఇంకా ఎన్ని సిత్రాలు చూడాలో మరి.

మామాట: ఎన్నికల ఋతువులో గోడ దూకడం సాధారణమే… 

Leave a Reply