వైసీపీ వైపు మాజీ పీసీసీ చూపు…లొకల్ బాడీల్లోనే

Raghavira Reddy-future-ap-pcc
Share Icons:

అనంతపురం: స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అధికార వైసీపీలోకి వలసలు మొదలయ్యాయి. ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు వైసీపీ కండువా కప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి రఘువీరా రెడ్డి.. కూడా వైసీపీలో చేరే అవకాశముందని తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఆయన వైఎస్ఆర్సీపీలో చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనికోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మంతనాలు పూర్తయినట్లు సమాచారం.

ఇదిలా ఉంటే రఘువీరారెడ్డి వైఎస్ కేబినెట్‌లో కీలకమైన వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన హఠాన్మరణం అనంతరం రఘువీరా కాంగ్రెస్‌లోనే కొనసాగారు. రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో కొనసాగారు.రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని కూడా దాదాపుగా కోల్పోయిన పరిస్థితుల్లో పీసీసీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టినప్పటికీ.. ఆశించిన ఫలితాలను ఆయన రాబట్టుకోలేకపోయారు. 2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఒక్క అభ్యర్థి కూడా అసెంబ్లీకి ఎన్నిక కాలేదంటే ఆ జాతీయ పార్టీ ఏ దుస్థితికి చేరుకుందో అర్థం చేసుకోవచ్చు.

ఈ పరిస్థితుల్లో చేసేదేమీ లేక రఘువీరా పీసీసీ పదవికి రాజీనామా చేశారు. రాజకీయాల నుంచి దాదాపుగా తప్పుకొన్నారు. వ్యక్తిగత పనులపై దృష్టి పెట్టారు. రఘువీరా రెడ్డి మళ్లీ క్రియాశీలక రాజకీయాల వైపు అడుగులు వేయడానికి కూడా వైఎస్ఆర్సీపీనే కారణమనే వాదన కూడా అనంతపురం జిల్లా రాజకీయాల్లో వినిపిస్తోంది. తన తండ్రికి ఆప్తుడిగా.. వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్న రఘువీరా రెడ్డిని తమ పార్టీలో చేర్చుకోవడానికి వైఎస్ జగన్ ఆసక్తితో ఉన్నారని, ఆయన ఎప్పుడొచ్చినా సరే.. స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నారనే సంకేతాలు ఇదివరకే ఇచ్చారు. ఈ క్రమంలోనే రఘువీరా కూడా వైసీపీలో చేరడానికి పెద్దగా అభ్యంతరాలు కూడా లేవని తెలుస్తోంది. మరీ చూడాలి ఈ మాజీ పీసీసీ వైసీపీలోకి వెళతారో లేదో.

 

Leave a Reply