బీజేపీలోకి వెళ్లనున్న మాజీ ఎంపీ వివేక్…వి‌హెచ్ కాంగ్రెస్ కి షాక్ ఇస్తారా?

former mp vivek ready to join bjp
Share Icons:

హైదరాబాద్:

 

ఇటీవల టీఆర్ఎస్ కి రాజీనామా చేసి తటస్థంగా ఉన్న తెలంగాణ ప్రభుత్వ మాజీ సలహాదారు జి.వివేక్‌ బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇక ఈయనతో పాటు మరో ముగ్గురు సీనియర్ నేతలు నేడు బీజేపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. నేడు ఢిల్లీ వెళ్తున్న వీరు అమిత్ షా అపాయింట్‌మెంట్ లభిస్తే ఆయన సమక్షంలో కాషాయం తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం జరుగుతోంది. బుధవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ను కలిసిన వివేక్ పార్టీలో చేరిక విషయమై దాదాపు గంటపాటు చర్చించినట్టు తెలుస్తోంది.

 

అయితే టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఇటీవల వివేక్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయనను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. అయితే, ఇప్పటికే అమిత్‌ షా, రాంమాధవ్‌లతో మూడుసార్లు భేటీ అయిన వివేక్ బీజేపీలో చేరేందుకే మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. అంతేకాదు, రాజ్యసభ సభ్యత్వాన్ని కానీ, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష పదవిని కానీ కోరినట్టు సమాచారం.

 

ఇదిలా ఉంటే దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న తెలంగాణ సీనియర్ రాజకీయవేత్త వి.హనుమంతరావు తన భవిష్యత్తుపై తీవ్ర నిర్ణయం తప్పదంటున్నారు. తెలంగాణ పీసీసీ విషయంలో గత కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్న వీహెచ్ త్వరలోనే పార్టీ మార్పుపై నిర్ణయం ఉంటుందని అన్నారు. తాను స్వయంగా కోరినా తన పేరు లేకుండానే పీసీసీ నేతలు ప్రతిపాదిత అభ్యర్థుల జాబితాను హైకమాండ్ కు పంపారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు నిజాయతీపరులకు అన్యాయం జరుగుతోందని, పార్టీలో రాజీవ్ గాంధీ అభిమానులకు న్యాయం జరగడం లేదని వీహెచ్ వాపోయారు. కార్యకర్తలు, అభిమానులతో చర్చించిన మీదట రాజీవ్ గాంధీ జయంతి తర్వాత తన నిర్ణయం వెల్లడిస్తానని స్పష్టం చేశారు.

Leave a Reply