జగన్..అప్పుడు…ఇప్పుడు…ఎప్పుడు మా అబ్బాయే…కానీ

Former MP JC Diwakar Reddy Shows his Resentment Over Govt: Made Satirical Comments On Jagan
Share Icons:

అమరావతి: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సెటైర్లు వేశారు.  జగన్ పాలనకు 100కు 150 మార్కులు ఇవ్వాలని, పరిపాలనలో జగన్ కిందా.. మీదా పడుతున్నారని ఎద్దేవా చేశారు. కానీ అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడూ జగన్ మా అబ్బాయే అన్నారు. జగన్ పాలన జనరంజకంగా సాగుతోందని అన్నారు. ఇక దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన బస్సులపై కేసులు నమోదు చేయడం పట్ల.. జేసీ అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్నో ట్రావెల్స్ ఉండగా.. జగన్‌కు నా బస్సులే కనిపిస్తున్నాయన్నారు.

అయితే తనకు ఉన్న బస్సుల్లో ఇప్పటి వరకు 31 బస్సులు సీజ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న చిన్న లోటుపాట్లు ఆర్టీసీతో సహా ఏ ట్రావెల్స్‌కైనా సహజమన్నారు. అపరాధ రుసుంలను విధిస్తే సరిపోయే తప్పిదాలకు సీజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని దివాకర్ రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండేందుకే,  తాను రాజకీయ సన్యాసం తీసుకున్నానని చెప్పుకొచ్చారు. చూసే వారి కళ్లను బట్టి రాయలసీమ అభివృద్ధి ఉంటుందని,  ఎవరికి వాళ్లు తమ ప్రాంతం అభివృద్ధి కావాలని కోరుకోవడంలో తప్పులేదన్నారు. చంద్రబాబు సాగు నీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం ఇచ్చారని.. ఎన్ని వర్షాలు పడినా ప్రాజెక్టులు లేకపోతే ఫలితం శూన్యమని జేసీ వ్యాఖ్యానించారు.

కాగా, దివాకర్ ట్రావెల్స్ బస్సుల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుంటున్నారని.. ఇష్టం వచ్చినట్టుగా టికెట్ల రేట్లను పెంచుతున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో అధికారులు విచారణ జరపగా ఆ ఆరోపణలు నిజమేనని తేలింది. దీంతో అక్టోబర్ 16న దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన 23 బస్సులను సీజ్ చేశామని ఆర్టీఏ అధికారులు తెలిపారు.

ఇక ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత నక్కా ఆనందబాబు మండిపడ్డారు. టీడీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో విజయవాడలో దళితుల ఆత్మగౌరవ యాత్ర ఈరోజు నిర్వహించారు. ఈ యాత్రను పోలీసులు అడ్డుకున్నారు. కార్యకర్తలను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో నక్కా ఆనందబాబు మాట్లాడుతూ, ప్రభుత్వం చేసిన తప్పులను ప్రశ్నించిన ప్రతిపక్షాలు, మీడియా గొంతు నొక్కాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా టీడీపీ నేత వర్ల రామయ్యపై పోలీస్ అధికారుల సంఘం నేతలు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. వర్ల రామయ్యపై రాజకీయ నేతల తరహాలో వ్యాఖ్యలు గుప్పించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

 

Leave a Reply