టీడీపీకి హ్యాండ్ ఇచ్చిన మాజీ మంత్రి…కుమారుడుతో పాటు వైసీపీలోకి…

main leaders ready to leave tdp
Share Icons:

గుంటూరు: టీడీపీకి ఏ మాత్రం టైమ్ బాగోలేదు. వరుసగా ఆ పార్టీ నేతలు పార్టీని వీడుతూనే ఉన్నారు. ఓ వైపు స్థానిక సంస్థల ఎన్నికలు ఆరు నెలల పాటు వాయిదా పడిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మరో షాక్ తగిలింది.  టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి రాజీనామా చేశారు. తన కుమారుడు గాదె మధుసూధన్ రెడ్డితో సహా పార్టీకి గుడ్‌బై పలికారు. నేడో, రేపో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నారు.

ఈ సందర్భంగా గాదె మాట్లాడుతూ…. చంద్రబాబు నాయుడి వైఖరి నచ్చకపోవడం వల్లే తాము పార్టీ ఫిరాయిస్తున్నామని కుండబద్దలు కొట్టారు. చంద్రబాబు నమ్మించి, మోసం చేశారని ఆరోపించారు. బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గం ఇన్‌ఛార్జి బాధ్యతలను తన కుమారుడికి అప్పగిస్తామని హామీ ఇచ్చిన ఆయన తన మాటను నిలబెట్టుకోలేదని ధ్వజమెత్తారు. పారిశ్రామికవేత్త నరేంద్ర వర్మకు బాపట్ల బాధ్యతలు ఇచ్చారని, డబ్బులకు చంద్రబాబు అమ్ముడుపోయారని మండిపడ్డారు.

చాలాకాలం పాటు గాదె వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు. దేవాదాయ శాఖ మంత్రిగా కొనసాగారు. ఆయన హఠాన్మరణం అనంతరం ఏర్పడిన కే రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాల్లో కూడా కేబినెట్‌లో కొనసాగారు. 2014 ఎన్నికల సమయంలో గాదె వెంకటరెడ్డి తెలుగుదేశంలో చేరారు.

తన కుమారుడు గాదె మధుసూధన్ రెడ్డిని తెర మీదికి తీసుకుని వచ్చారు. బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గం ఇన్‌ఛార్జి బాధ్యతలను తన కుమారుడికి ఇవ్వాలంటూ ప్రయత్నించినప్పటికీ.. చంద్రబాబు వినిపించుకోలేదని గాదె వెంకటరెడ్డి తాజా ఆరోపణ. తన కుమారుడికి బదులుగా పారిశ్రామికవేత్త నరేంద్ర వర్మకు ఈ బాధ్యతలను అప్పగించారని చెప్పారు. తన అనుచరుల కోరిక మేరకు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు.

Leave a Reply