వలసల పర్వం: వైసీపీలోకి మాజీ మంత్రి

Share Icons:

విశాఖపట్నం: స్థానిక సంస్థల ఎన్నికల వేళ వైసీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు వైసీపీలో చేరగా, ఇప్పుడు జనసేనకు చెందిన ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు అధికార వైసీపీలో చేరారు. మంగళవారం ఆయన మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్ కుమార్‌తో కలిసి వైసీపీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. వైసీపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి వారికి కండువాలను కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. తమ అనుచరులతో కలిసి పెద్ద సంఖ్యలో వారిద్దరూ వైసీపీలో చేరడంతో విశాఖలో ఆ పార్టీ మరింత బలపడిందని అంటున్నారు.

పసుపులేటి బాలరాజు చాలాకాలం పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన విషయం తెలిసిందే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఆయన మంత్రివర్గంలో పనిచేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హఠాన్మరణం అనంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో బాలరాజు కాంగ్రెస్‌లో ఉండిపోయారు. జగన్ కాంగ్రెస్‌కు ఎదురు తిరిగి, కొత్త పార్టీని ప్రకటించిన తరువాత ఆయనపై ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్ర విభజన అనంతరం ఆయన కాంగ్రెస్‌లో కొనసాగలేకపోయారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పాడేరు నుంచి పోటీ చేసి, వైసీపీ అభ్యర్థి గిడ్డి ఈశ్వరి చేతిలో పరాజయం పాలయ్యారు.

గత ఏడాది సార్వ్రతిక ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. తనకు పట్టు ఉన్న పాడేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పటికీ.. మరోసారి ఓడిపోయారు. ఆ తరువాత ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. పవన్ కల్యాణ్ విశాఖపట్నంలో లాంగ్ మార్చ్‌ను నిర్వహించిన రోజే.. పార్టీకి గుడ్‌బై చెప్పారు.

బాలరాజును పార్టీలో చేర్చుకోవడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంగీకరించడంతో.. ఆయన చేరిక లాంఛనమే అయింది. ఈ ఉదయం ఆయన మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్ కుమార్‌తో కలిసి వైసీపీలో చేరారు. ఆయన చేరడం వల్ల గిరిజన ఓటుబ్యాంకు మరింత బలోపేతమౌతుందనే అభిప్రాయం వైసీపీ నేతల్లో వ్యక్తమౌతోంది.

Leave a Reply