ఉన్నావో కేసుపై ధర్నాకు దిగిన మాజీ సీఎం…

former cm akhilesh yadav is sitting on a 'dharna' outside Vidhan Sabha in protest against Unnao rape case.
Share Icons:

లక్నో: ఓ వైపు దిశ ఘటనలో నిందితులని ఎన్కౌంటర్ చేసి చంపడంతో దేశ వ్యాప్తంగా సంబరాలు జరుగుతున్న సమయంలోనే అప్పటిలో సంచలనం సృష్టించిన ఉన్నావో అత్యాచార బాధితురాలి ప్రాణాలు గాల్లో కలిసిపోయిన విషయం తెలిసిందే. విచారణ నిమిత్తం కోర్టుకు వెళుతున్న బాధితురాలికి నిప్పుపెట్టడంతో ఆమె తీవ్రగాయాలపాలైంది. 90 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. దీనిపై ఉన్నావో మృతురాలి కుటుంబసభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘మా సోదరి ఇక లేదు, ఈ దారుణానికి కారణమైన ఐదుగురికి మరణశిక్ష విధించాలన్నదే మా డిమాండ్’ అంటూ ఆమె సోదరుడు స్పందించారు.

బెయిల్‌పై బయటికి వచ్చిన నిందితులు 23 ఏళ్ల బాధితురాలపై కిరోసిన్ పోసి నిప్పంటించడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. కోర్టు విచారణకు హాజరయ్యేందుకు వెళ్తుండగా మార్గమధ్యంలో నిందితులు కాపుకాచి ఆమెపై దాడిచేశారు. 90 శాతం కాలిన గాయాలైన ఆమెను ఢిల్లీలోని సఫ్తర్‌గంజ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. 40 గంటల పాటు మృత్యువుతో పోరాడిన ఆమె… గుండెపోటు కారణంగా శుక్రవారం రాత్రి తనువు చాలించింది.

అలాగే ఇంత వరకు అధికార పార్టీకి చెందిన నాయకులెవరూ తమ కుటుంబాన్ని కనీసం పరామర్శించలేదని బాధితురాలి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో దిశ హత్య కేసు నిందితుల మాదిరిగానే తమ కుమార్తెను చంపిన వారిని కూడా ఎన్‌కౌంటర్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇక నిందితులు కఠినంగా శిక్షించాలంటూ మాజీ సీఎం అఖిలేష్ ఆధ్వర్యంలో సమాజ్‌వాది పార్టీ నేతలు అసెంబ్లీ ఎదుట ధర్నాకు దిగారు. అసెంబ్లీ గేటు వద్ద అఖిలేష్ బైఠాయించారు. నిందితులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి దురాగతాలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. ఉన్నావ్ ఘటనకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు అఖిలేష్ యాదవ్ పిలుపునిచ్చారు.

ఇదిలాఉండగా, ఉన్నావ్ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. బాధితురాలి మృతికి సంతాపం తెలిపారు. ఈ ఘటనపై విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని సీఎం పేర్కొన్నారు.

 

Leave a Reply