దేశం కోసం

Share Icons:

దేశం కోసం

భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కాపాడాల్సిన భాద్యత అందరిపై ఉంది. దేశభక్తి, ధర్మరక్షణ, ప్రతి కుటుంబంలో ఉండాల్సిన అవసరం. ముఖ్యంగా యువత సమాజంలో కీలక పాత్ర పోషించాలంటే వివేకానందుడి భావాలను పెంపొందించుకుని దేశంకోసం తన వంతు సహకారం అందించాలి. రామబాణం మాదిరి లక్ష్యం (గురి) తప్పని దృఢ మనస్కులై యువత ఉండాలి. మాతృబాషకు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వాలి. భారతదేశ చరిత్ర నేటి తరం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. దేశంలో అపారంగా ఉన్న యువశక్తి, యువత పరిజ్ఞానం ప్రగతికి ఉపయోగపడేలా ఉండాలి. యువతకు సమాజం పట్ల సదవగాహన ఉండాలి.  దేశభక్తి అంటే ఒక జాతి ఆత్మగౌరవానికి, ఔన్నత్యానికి అనుకూలంగా వ్యవహరించడం. భారత జాతి సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించడం.

 

‘‘అంతా ఒక్కటే- మనమంతా ఒక్కటే; రేకులు వేరైనగాని- పూవు ఒక్కటే’’ అని చెప్పడం. తను పుట్టిన నేలను, సంప్రదాయాలను, చారిత్రకతను అభిమానించడం. తన మతాన్ని అనుసరిస్తూనే దేశభక్తిని కలిగి వుండటమే జాతీయత లేదా దేశభక్తి. ఈ దేశంలో పుట్టడం ఒక యోగం. ఈ నేలపై నడవటం ఒక భాగ్యం! ఈ దేశంలో పుట్టాను కాబట్టే నాకింత గుర్తింపు, పేరు వచ్చింది  అని గుర్తుంచుకున్నవాడు దేశభక్తుడవుతాడు. యువతలో దేశభక్తి త్యాగము  ప్రతివ్యక్తీ తను కుటుంబానికి చేయవలసిన సేవచేస్తూనే శక్తివంచన లేకుండ సంఘసేవ చేయాలి. ప్రజలు త్యాగతత్పరులై, దేశసేవకు అంకితం కావాలి. సైనికులు తమ ప్రాణాన్నికూడా త్యాగం చేసి దేశ రక్షణకు సిద్ధపడుతున్నారు. శక్తి వంచన లేకుండా వారు అనుసరిస్తున్న ఆ త్యాగమే నిజమైన దేశభక్తి. తల్లిదండ్రులు ఉగ్గుపాలతో దేశభక్తిని రంగరించి పిల్లలను క్రమశిక్షణతో పెంచాలి. దేశభక్తి కలిగిన ఆదర్శవంతమైన పౌరులుగా యువతను తీర్చిదిద్దాల్సినకర్తవ్యం వారిది. దేశం కోసం పరితపించే వారిలోనే నైపుణ్యాలు, శక్తి సామర్ధ్యాలు పెరుగుతాయి. దేశభక్తి కలిగిన పౌరుడు కుటుంబ విలువలను గుర్తిస్తాడు. చిన్ననాటినుంచే పిల్లల్లో జాతీయ భావాలు పెంపొందించడం ద్వారా వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు మార్గం సుగమమవుతుంది. ఈ దేశం తత్త్వవేత్తలకూ, మేధావులకూ ప్రతీకలైన శంకరాచార్య, వివేకానంద, అరవిందులు, సర్వేపల్లి రాధాకృష్ణ, శివానందమూర్తి వంటి వారిని స్మరించుకోవడంకూదా సంపూర్ణ దేశభక్తిని చాటిచెబుతుంది.

-నందిరాజు రాధాకృష్ణ

Leave a Reply