రఫేల్ యుద్ధవిమానానికి ఆయుధపూజ చేసిన రాజ్ నాథ్…ఎవరినీ భయపెట్టం…

First Rafale Jet Handed Over by France, Rajnath Singh Calls it Deterrent and Not Sign of Aggression
Share Icons:

ఫ్రాన్స్: దసరా సందర్భంగా కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్… ప్రాన్స్‌లోని డసో ఏవియేషన్‌ సంస్థ నుంచి తొలి యుద్ధ విమానం రఫేల్‌ను స్వీకరించి ఆయుధ పూజ చేశారు. అనంతరం ఆయన 25 నిమిషాలపాటు విమానంలో చక్కెర్లు కొట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్‌ సోనిక్‌ వేగంతో తాను ప్రయాణిస్తానని కలలో కూడా ఊహించలేదని, రఫేల్‌లో విహారం చాలా సౌకర్యవంతంగా ఉందన్నారు. రఫేల్‌ రాకతో దేశ భద్రత మరింత పటిష్టమవుతుందని చెప్పారు.

2021 నాటికి 18, 2022 నాటికి మొత్తం 36 రఫేల్‌ జెట్లు భారత్‌ అమ్ముల పొదిలో చేరుతాయన్నారు. ఈ ఘనత ప్రధాని నరేంద్ర మోదీదేనన్నారు. మోదీ సాహసోపేత నిర్ణయాల వల్ల దేశానికి మేలు జరుగుతోందని చెప్పారు. అయితే దేశ భద్రతకు మా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని, సామర్థ్యాన్ని పెంపొందించుకోవడంలో భాగమే అత్యాధునిక ఆయుధాలు సమకూర్చుకోవడం అని అన్నారు. ఆయుధ సామగ్రిని సమకూర్చుకుని ఎవరినీ భయపెట్టాలన్న ఉద్దేశం భారత్‌కు లేదని స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే పాకిస్థాన్ చైనా మద్ధతు కోసం సరికొత్త ఎత్తులు వేస్తోంది. పాక్ ప్రధాని మంగళవారం చైనా పర్యటనకు వెళ్ళిన విషయం తెలిసిందే. అయితే ఇమ్రాన్ కంటే ముందే పాక్ ఆర్మీ చీఫ్ ఖమర్ జావెద్ బజ్వా చైనాలో అడుగుపెట్టడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. పాక్‌లో పెట్టుబడులు పెట్టాలని కోరుతూ ఖమర్ బజ్వా ఇటీవల పాక్‌లో వ్యాపారవేత్తలతో సమావేశమై అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు ఇమ్రాన్ కంటే ముందే చైనాలో పర్యటిస్తున్నారు.

కాగా, చైనాలో పర్యటిస్తున్న ఇమ్రాన్.. వ్యాపారవేత్తలతో భేటీ అయ్యారు. అదే సమయంలో కశ్మీర్ విషయంలో మద్దతు కోరుతూ బజ్వా చైనా మిలటరీ అధికారులతో సమావేశమయ్యారు. ఇమ్రాన్‌తోపాటు బజ్వాకు కూడా చైనా సమాన ప్రాధాన్యం ఇస్తుండడం ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరుస్తోంది. నిజానికి చైనా పర్యటకు వెళ్లే అధికారుల జాబితాలో బజ్వా పేరు లేదు. అయితే, చివరి నిమిషంలో చేర్చడం దానికి చైనా కూడా ఓకే చెప్పడం జరిగిపోయాయి.

 

Leave a Reply