సాకర్ సమరానికి సర్వం సిద్ధం..

FIFA World Cup 2018
Share Icons:

మాస్కో, 14 జూన్:

ప్రపంచంలో అతి పెద్ద క్రీడా ఈవెంట్ అయిన ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు ఉన్న క్రేజ్, ఆదరణ, ఆదాయం విషయంలో ఒలింపిక్స్ కూడా దీని ముందు దిగదుడుపే అని చెప్పాలి.

ఏకంగా రెండొందలకు పైగా దేశాలు… 300కోట్లకి పైగా జనాభా ఈ టోర్నీనీ వీక్షిస్తుందంటే దీని ఆదరణ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇందులో ఉన్నంత పోటీతత్వం ఇంకెక్కడా కనిపించదంటే అతిశయోక్తి కాదు. రష్యా వేదికగా 21వ ఫిఫా ప్రపంచకప్‌కు రంగం సిద్దమైంది. గురువారం రష్యా రాజధాని లుజ్నీకి స్టేడియంలో జరిగే ఆరంభ వేడుకతో టోర్నీ ప్రారంభమవుతుంది.

russia vs saudi arabia

అక్కడే ఆతిథ్య రష్యా.. సౌదీ అరేబియా మధ్య తొలి మ్యాచ్ రాత్రి 8.30కి ఆరంభమవుతుంది. ఈ ప్రపంచకప్‌లో అత్యంత తక్కువ ర్యాంకు ఉన్నవి ఈ జట్లకే. ఇక ఈ మ్యాచ్లను ఇండియాలో సోనీ ఛానెల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. బ్రెజిల్‌లో జరిగిన గత ప్రపంచకప్‌లో జర్మనీ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈసారి ఆ జట్టుతో పాటు టైటిల్ కోసం ఫేవరెట్లు చాలానే ఉన్నాయి.

brazil football team 2018

గత టోర్నీలో అంచనాల్ని అందుకోలేకపోయిన బ్రెజిల్.. ఈ సారి హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఆ జట్టుదే కప్పుని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక జర్మనీ కూడా గట్టి పోటీదారే. అర్జెంటీనా, ఫ్రాన్స్, స్పెయిన్, బెల్జియం కూడా ఎన్నో ఆశలతో టోర్నీలో అడుగుపెడుతున్నాయి. ఆ జట్ల అవకాశాల్ని కొట్టిపారేయలేం. కనీసం ఆరు జట్లు టైటిల్ ఫేవరెట్లుగా కనిపిస్తుండటంతో రసవత్తర పోరు ఖాయమని భావిస్తున్నారు. ఎప్పట్లాగే ఐరోపా, దక్షిణ అమెరికా జట్లదే ఆధిపత్యంగా ఉంటుందనడంలో సందేహం లేదు.

మొత్తం 64 మ్యాచ్‌లు…

కాగా, ఈ 21వ వరల్డ్‌క్‌పలో 32 జట్లు ఎనిమిది గ్రూప్‌ల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఈ నెల 28వ వరకు గ్రూప్‌ దశ పోటీలు ఉంటాయి. ఎనిమిది గ్రూప్‌ల్లోని నాలుగేసి జట్లు… మిగతా మూడు జట్లతో ఒక్కో మ్యాచ్‌లో పోటీ పడతాయి. ప్రతి గ్రూప్‌లో టాప్‌-2 జట్లు నాకౌట్‌కు అర్హత సాధిస్తాయి. 30 నుంచి నాకౌట్‌ దశ మొదలవుతుంది. జూలై 15న జరిగే తుదిపోరుతో టోర్నీ ముగుస్తుంది. మెగా టోర్నీ కోసం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన 11 నగరాల్లోని 12 స్టేడియాల్లో మొత్తం 64 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆరంభ, ఫైనల్‌ మ్యాచ్‌లకు మాస్కోలోని లుజ్నినికి స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది.

మామాట: ఈసారి కప్ కొట్టేదెవరో?

Leave a Reply