విద్యుత్తు వాహనాలకు వినూత్నమైన బ్యాటరీ, చార్జర్‌ రెడీ!15 నిమిషాల్లోనే బ్యాటరీ ఫుల్‌!

Share Icons:

బెంగళూరు స్టార్టప్‌ ఎక్స్‌పొనెంట్‌ ఎనర్జీ సంస్థ ఇవిల చార్జింగ్ కష్టాలను పరిష్కరిస్తోంది. మరికొన్ని నెలల్లోనే ఈ కంపెనీ అభివృద్ధి చేసిన బ్యాటరీ ప్యాక్, స్మార్ట్‌ చార్జర్లు దశల వారీగా దేశం మొత్తమ్మీద ఏర్పాటు కానున్నాయి! 15 నిమిషాల్లోనే బ్యాటరీని నింపేస్తామంటోంది ఆ కంపెనీ!

ఎక్స్‌పొనెంట్‌ ఎనర్జీ అభివృద్ధి చేసిన బ్యాటరీతో ఈవీని తయారు చేశారంటే- ‘ఈ–పంప్‌’తో ఇంటి దగ్గర 15 నిమిషాల్లో చార్జ్‌ చేసుకుంటే.. 312 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. దగ్గరలోని ఛార్జింగ్‌ స్టేషన్‌లో బ్యాటరీని చార్జ్‌ చేసేందుకు ఉంచి.. ఓ కాఫీ తాగొస్తే సరి.. మళ్లీ 312 కి.మీలు వెళ్లేందుకు కారు సిద్ధంగా ఉంటుంది. ఈ–ప్యాక్‌ను ఏకంగా 3 వేల సార్లు చార్జింగ్, డిస్‌ చార్జింగ్‌ చేసినా దాని సామర్థ్యంలో వచ్చే నష్టం తక్కువగానే ఉంటుందని అరుణ్‌ వినాయక్‌ తెలిపారు.

అనుమతులు పొందిన తర్వాత ఈ ఏడాది చివరికల్లా బెంగళూరు, ఢిల్లీలో వీటిని మార్కెట్‌లోకి ప్రవేశపెడతామని పేర్కొన్నారు. కాగా, ఈ–ప్యాక్, ఈ–పంప్‌లను నడిపించేందుకు ప్రత్యేకమైన బ్యాటరీ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థను కూడా వీరు సిద్ధం చేశారు. బ్యాటరీ ప్యాక్‌లోని ఒక్కో సెల్‌లో విద్యుత్తు మోతాదు ఎంత ఉందన్నది గమనించి అందుకు తగ్గట్టుగా ఈ–పంప్‌ ద్వారా జరిగే విద్యుత్తు ప్రవాహాన్ని ఈ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థ నియంత్రిస్తుంది.

అరుణ్‌ వినాయక్, సంజయ్‌ బైలా కలసి బెంగళూరు కేంద్రంగా ఎక్స్‌పొనెంట్‌ ఎనర్జీ అనే స్టార్టప్‌ కంపెనీని స్థాపించారు. విద్యుత్తు వాహనాల బ్యాటరీలను 15 నిమిషాల్లోనే చార్జ్‌ చేసేందుకు ప్రత్యేకమైన చార్జర్‌ ‘ఈ–పంప్‌’ను, అవసరానికి తగ్గట్టు సామర్థ్యాన్ని పెంచుకుంటూ పోయేందుకు అవకాశం కల్పించే బ్యాటరీ ప్యాకేజీ ‘ఈ–ప్యాక్‌’ను ఈ కంపెనీ అభివృద్ధి చేసింది.

ఈ రెండింటినీ కలిపి వాడితే 15 నిమిషాల్లో బ్యాటరీని ఫుల్‌గా చార్జ్‌ చేయడం సాధ్యమవుతుందని కంపెనీ వ్యవస్థాపకుల్లో ఒకరైన అరుణ్‌ వినాయక్‌… బ్యాటరీ పరిస్థితిని బట్టి చార్జర్‌ విద్యుత్తు ప్రసారాన్ని నియంత్రిస్తూ ఉంటుందని, ఫలితంగా బ్యాటరీకి జరిగే నష్టాలను నివారిస్తూనే తక్కువ సమయంలో ఎక్కువ విద్యుత్‌ను నింపేందుకు అవకాశం ఏర్పడిందని వివరించారు.

సేకరణ :- మామాట డస్క్ (అంతర్జాల సంచికల నుండి)

Leave a Reply