కవితకు ఎమ్మెల్సీ…కేబినెట్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారా?

Share Icons:

హైదరాబాద్: ఎట్టకేలకు తెలంగాణ సీఎం తనయ, నిజామాబాద్ మాజీ ఎంపీ కవితకు పదవి దక్కనుంది. కేసీఆర్….తన కుమార్తె కవితను శాసనమండలికి పంపాలని నిర్ణయించారు. నిజామాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కావటంతో..అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత పార్టీ ముఖ్యులతో ముఖ్యమంత్రి ఈ విషయానికి సంబంధించి చర్చించి..చివరకు కవిత పేరును ఖరారు చేసారు. అయితే, త్వరలోనే కవిత మంత్రివర్గంలోనూ చేరటం ఖాయంగా తెలుస్తోంది.

అయితే ఆమెకు రాజ్యసభ వస్తుందని అంతా అనుకున్నారు. కానీ రెండు రాజ్యసభలు కె.కేశవరావు, ఉమ్మడి ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్‌ కె.ఆర్‌.సురే్‌షరెడ్డికి ఖరారయ్యాయి. వారు ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే బుధవారం వారిద్దరి ఏకగ్రీవ ఎన్నికపై ఈసీ అధికార ప్రకటన చేయనుంది. ఈ దశలో నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్‌ఎస్‌ తరఫున కవిత పేరు తెరపైకి వచ్చింది. దీని పైన ముఖ్యమంత్రి కేసీఆర్ తుది చర్చల తరువాత కవితకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తున్నట్లుగా పార్టీ నేతలతో వెల్లడించారు.

కాగా, టీఆర్‌ఎస్‌ నుంచి నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలిచి, కాంగ్రెస్ లో చేరిన డాక్టర్‌ భూపతిరెడ్డిపై అనర్హత వేటు పడింది. దీంతో..ఇక్కడ ఎమ్మెల్సీ స్థానంకు ఉప ఎన్నిక జరుగుతోంది. అర్ధంతరంగా ఖాళీ అయిన ఈ ఎమ్మెల్సీ స్థానం పదవీ కాలం 2022, జనవరి 4 న ముగియనుంది. షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 19న నామినేషన్ల దాఖలుకు చివరి రోజు. నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం ఎన్నికల బరిలో కాంగ్రెస్‌, బీజేపీ నిలిచినప్పటికీ, టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కవిత ఇబ్బంది లేకుండా గెలుస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఎన్నిక అనివార్యమైతే ఏప్రిల్‌ 7న పోలింగ్‌, 9న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. జిల్లాలో మారుతున్న రాజకీయ పరిస్థితులు..పార్టీ పైన పట్టుకోసమే కవితను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. ఇక కవిత ఎమ్మెల్సీగానే పరిమితం కారని.. కాబోయే మంత్రి అనే చర్చ అప్పుడే మొదలైంది. గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ సిటింగ్‌ ఎంపీగా కవిత నిజామాబాద్‌ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి అర్వింద్‌ చేతిలో ఓడిపోయారు.

మరోవైపు లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిపాలైన నుంచి కవిత నియోజకవర్గంతో కొంత దూరం పాటిస్తున్నారు. అదే జిల్లాకు చెందిన సురేష్ రెడ్డికి రాజ్యసభ..ఇప్పుడు కవితకు ఎమ్మెల్సీ కేటాయించి జిల్లా పైన పార్టీ పట్టుకోసం కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. కవిత ఎన్నిక కానున్న ఎమ్మెల్సీ స్థానం పదవీ కాలం జనవరి 4, 2022న ముగిశాక, మళ్లీ అదే స్థానం నుంచి ఆమె పోటీ చేసి గెలుస్తారని వివరిస్తున్నారు.

 

Leave a Reply