రాజధానిపై గంటా కొత్త డిమాండ్…ఆర్ధిక రాజధానిగా విశాఖ…

Share Icons:

విశాఖపట్నం:

ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి రాజకీయ వర్గాల్లో రోజుకో చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. అమరావతి మారిపోతుందని కొందరు అంటుంటే..అమరవాతే రాజధానిగా ఉంటుందని కొందరు అంటున్నారు. మరికొందరు అయితే రాష్ట్రానికి నాలుగు రాజధానులు ఉంటాయని ప్రకటనలు చేస్తున్నారు. అయితే దీనిపై ప్రభుత్వం మాత్రం ఇంతవరకు క్లారీటీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మరో సరికొత్త డిమాండ్ ని తెరపైకి తెచ్చారు.

సీఎం జగన్ రాజధానిపై రాష్ట్రం స్పష్టమైన ప్రకటన చేయాలని కోరిన గంటా… విశాఖను ఏపీకి ఆర్థిక రాజధానిగా ప్రకటించాలని కోరారు. ఏ రాష్ట్రానికైనా దశ, దిశ నిర్దేశించేది రాజధాని అని, నవ్యాంధ్ర వంటి కొత్త రాష్ట్రానికి ఈ అంశం మరింత ముఖ్యమని, అంతటి ప్రాధాన్యం ఉన్న అంశంపై జగన్ మౌనవ్రతం పాటించడం ప్రమాదకరమని అన్నారు. రాజధాని అంశంపై మంత్రులు, అధికార పార్టీ నాయకులు ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతుండడంతో ప్రజల్లో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయన్నారు.

ఇలాంటి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తరపున స్పష్టమైన వైఖరి ప్రకటించాల్సిన బాధ్యత సీఎంకు ఉందని, కానీ ఆయన మౌనంగా తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడం దారుణమన్నారు. అమరావతిలో అవినీతి జరిగిందని భావిస్తే ప్రభుత్వం విచారణ జరిపించుకోవచ్చని, కానీ సందిగ్ధానికి తెరలేపడం సరికాదన్నారు.

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్యేలు ఫైర్

ఇక మరోవైపు జగన్ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్యేలు బుచ్చయ్య చౌదరీ, చిన రాజప్పలు విరుచుకుపడ్డారు. ఏపీలో రద్దుల పరంపర కొనసాగుతోందని, పాలన కుక్కలు చింపిన విస్తరిగా మారిందని విమర్శించారు. నవరత్నాలు పేరుతో ప్రజలను మోసం చేస్తోందని వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అలాగే టీడీపీ కార్యకర్తలపై వైసీపీ దాడులు ఎక్కువయ్యాయని ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరుగురు టీడీపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని, అన్ని రంగాల కార్మికులు ఇబ్బంది పడుతున్నారని విమర్శించారు.

కూనకు అండగా టీడీపీ ఉంటుంది…

టీడీపీ నేత కూన రవికుమార్ ప్రభుత్వ ఉద్యోగులతో అనుచితంగా మాట్లాడి.. తమపై దౌర్జన్యం చేశారని పోలీసులకు శ్రీకాకుళం సరుబుజ్జిలి ఎంపీడీవో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదుతో రవితో పాటూ అనుచరులపైనా కేసులు పెట్టారు పోలీసులు. రవికుమార్‌‌ను అరెస్ట్‌ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే కూన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. కూన రవికుమార్‌పై ప్రభుత్వం కక్ష సాధింపునకు దిగితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.

కూన రవికుమార్‌ ఇంటికి వచ్చి పోలీసులు ఎందుకు తనిఖీలు చేశారని ప్రశ్నించారు. . కూన రవికుమార్‌కు టీడీపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. జిల్లా ఎస్పీ వాస్తవ పరిస్థితులు తెలుసుకుని అడుగులు వేయాలని, లేదంటే మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో వైసీపీ నాయకుల అనధికార పెత్తనం ఎక్కువయ్యిందని, అధికారుల కుర్చీల్లో వారెలా కూర్చుంటారని మండిపడ్డారు.

 

Leave a Reply