ఈటెల ఎఫెక్ట్: కేసీఆరే గులాబీ  జెండా బాస్ అంటున్న ఎర్రబెల్లి…

etela effect in trs party...minister errabelli counter to etela
Share Icons:

హైదరాబాద్:

తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. టీఆర్ఎస్ సీనియర్ నేత, మంత్రి ఈటెల రాజేందర్ పేల్చిన మాటల తూటాలు ఎఫెక్ట్ రాష్ట్ర రాజకీయాలపై గట్టిగానే పడింది.  ముఖ్యంగా ఈటెల మేమే గులాబీ జెండాకు ఓనర్లమంటూ చేసిన వ్యాఖ్యలు టీఆర్ఎస్ అధిష్టానాన్ని షాక్ కు గురిచేశాయి. తనని మంత్రివర్గం నుండి తప్పిస్తారనే వార్తలతో ఈటెల ఒక్కసారిగా మీడియా ముందుకు వచ్చి ఓ రేంజ్ లో  ఈటెల  ‘మంత్రి పదవి తనకు ఎవరో వేసిన బిక్ష కాదని, తామే గులాబీ జెండా ఓనర్లమని, పార్టీలోకి మధ్యలో వచ్చినోళ్ళం, అడుక్కుని వచ్చినోళ్ళం కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే ఈ వ్యాఖ్యలకు మరో టీఆర్ఎస్ నేత, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కౌంటర్ ఇచ్చారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ…గులాబీ జెండా బాస్ ముమ్మాటికి సీఎం కేసీఆరేనని చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ లో ఎలాంటి విభేదాలు లేవని అంతా కలిసే ఉన్నామన్నారు. ఈటెల రాజేందర్ అంశం సమసిపోయిందని, ఆయన పదవికి ఎలాంటి ఢోకా లేదని అన్నారు.

కానీ పార్టీ క్రమశిక్షణకు ప్రతీ ఒక్కరూ కట్టుబడి వ్యవహరించాలని, టీఆర్ఎస్ పార్టీలో ఓనర్ల చిచ్చు లేదని, ఆదిపత్యపోరు అంతకన్నా లేదని చెప్పుకొచ్చారు. ఇక తెలంగాణ కోసం తాను కూడా పోరాటం చేశానని, ఉద్యమ సమయంలో తాను ఉన్న తెలుగుదేశం పార్టీ నుంచి తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇప్పించినట్లు గుర్తు చేశారు. ఇక ఒకవైపు టీఆర్ఎస్ అధిష్టానం ఈటెల మాటలపై ఇలా మాట్లాడుతుండగా.. మరోవైపు ఈటెలకు ప్రజాసంఘాలు, కుల సంఘాలు, అభిమానులు జై కొడుతున్నారు. ఆయన ఎప్పుడైతే ఫైర్ గా మాట్లాడారో అప్పటి నుంచి ఆయన ఇంటికి అభిమానులు, కార్యకర్తలు, నేతలు, ఉద్యోగ, మహిళా, కుల సంఘాల నేతలు, ప్రజా ప్రతినిధుల తాకిడి ప్రారంభమైంది.

అలాగే తాజాగా మానకొండూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ కూడా ఈటలను కలిసి చాలాసేపు మాట్లాడారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎటువంటి ప్రకటనలూ చేయనని, ఓపికగా ఉండాలని ఈటెల.. కార్యకర్తలకు సూచించారు. మరి రానున్న రోజుల్లో ఈటెల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని అటు టీఆర్ఎస్ వర్గాలు, ఇటు ఈటెల అభిమానులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాయి. చూడాలి మరి టీఆర్ఎస్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో.

Leave a Reply