మళ్ళీ చేతులెత్తేశారు….సిరీస్‌ని జారవిడిచారు….

Share Icons:

సౌతాంప్టన్, 3 సెప్టెంబర్:

సిరీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఖచ్చితంగా గెలువాల్సిన నాలుగో టెస్టును అప్పనంగా వదిలేశారు… ఒక్కరంటే ఒక్కరూ పోరాడకుండా చేతులెత్తేయడంతో సిరీస్‌ని కూడా చేజేతులా జారవిడుచుకున్నారు. కనీసం రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ టెయిలెండర్లు చూపించిన పోరాటం.. భారత జట్టులో కనిపించకపోవడంతో మూల్యం చెల్లించుకుంది. దీంతో ఐదు టెస్టుల సిరీ్‌సను 1-3తో కోల్పోవాల్సి వచ్చింది.

260/8 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 96.1 ఓవర్లలో 271 పరుగులకు ఆలౌటైంది. ఆతిథ్య బ్యాట్స్‌మన్ 4.2 ఓవర్లు ఆడి 11 పరుగులు జోడించి చివరి రెండు వికెట్లు చేజార్చుకున్నారు. బ్రాడ్ (0) వచ్చిన వెంటనే ఔట్‌కాగా, కుర్రాన్ (46) చివరి బ్యాట్స్‌మన్‌గా వెనుదిరిగాడు. షమీ 4, ఇషాంత్ 2 వికెట్లు తీశారు.

england

అనంతరం 245 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమ్‌ఇండియా బ్యాట్స్‌మెన్ అండర్సన్ (2/33), బ్రాడ్ (1/23) పేస్ అటాకింగ్‌ను, మొయిన్ అలీ (4/71) స్పిన్ మ్యాజిక్‌ను అర్థం చేసుకోలేక చేజేతులా మ్యాచ్‌ను జారవిడుచుకున్నారు. ఓపెనర్లు ధవన్ (17), రాహుల్ (0), పుజార (5) విఫలమైనా.. విరాట్ కోహ్లీ (58), రహానే (51) అర్ధసెంచరీలతో ఫర్వాలేదనిపించారు. ఇక నాలుగో వికెట్‌కు వీరిద్దరి 101 పరుగుల భాగస్వామ్యం ముగియడంతో భారత్ వికెట్లపతనం మొదలైంది. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్ ఎవరు నిలకడ ఆడకపోవడంతో 184 పరుగులకే కుప్పకూలి 60 పరుగుల తేడాతో పరాజయం పాలయ్యారు. మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించిన మొయిన్ అలీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య ఆఖరిదైన ఐదో టెస్టు ఈనెల 7 నుంచి ఓవల్‌లో జరుగుతుంది.

మామాట: కనీసం పోరాటం చేయకుండా ఓడిపోయారుగా…

Leave a Reply