ప్రపంచ రికార్డు సృష్టించిన మోర్గాన్….ఆఫ్ఘన్‌పై ఇంగ్లండ్ ఘనవిజయం…

Share Icons:

లండన్, 19 జూన్:

పసికూనలపై ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్ ఇయాన్ మోర్గాన్ చెలరేగి ఆడాడు. ఆకాశమే హద్దుగా పసికూన ఆఫ్ఘన్‌కి చుక్కలు చూపించాడు. ప్రపంచకప్‌లో అత్యధిక సిక్సర్ల రికార్డును తన పేరిట లిఖిస్తూ.. మెగాటోర్నీలో తమ జట్టుకు అత్యధిక స్కోరు అందించాడు. కేవలం 71 బంతుల్లో 148; 4 ఫోర్లు, 17 సిక్సర్లతో దుమ్ము లేపాడు.

మంగళవారం ఓల్డ్ ట్రఫోర్డ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 150 పరుగుల తేడాతో ఆఫ్ఘన్‌పై జయభేరి మోగించింది. బెయిర్‌స్టో (99 బంతుల్లో 90; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), రూట్ (82 బంతుల్లో 88; 5 ఫోర్లు, 1 సిక్స్) వేసిన బలమైన పునాదిపై కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (71 బంతుల్లో 148; 4 ఫోర్లు, 17 సిక్సర్లు) కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్‌తో కదం తొక్కడంతో మొదట ఇంగ్లండ్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 397 పరుగులు చేసింది.

ఆఫ్ఘన్ స్పిన్ సంచలనం రషీద్ ఖాన్ బౌలింగ్‌లో (0/110) కూడా సెంచరీ చేశాడు. కాకపోతే అనంతరం లక్ష్య ఛేదనలో ఆఫ్ఘనిస్థాన్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 247 పరుగులు చేసింది. హష్మతుల్లా (76; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), రహ్మత్ షా (46; 3 ఫోర్లు, 1 సిక్స్), అస్గర్ (44; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాటం.. ఓటమి అంతరాన్ని తగ్గించగలిగిందే తప్ప మ్యాచ్ ఫలితాన్ని మార్చలేకపోయింది. తుఫాన్ ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డ మోర్గాన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

ఇక నేడు ప్రపంచకప్‌లో మరో రసవత్తర పోటీకి రంగం సిద్ధమైంది. టోర్నీలో మూడు ఓటముల తర్వాత ఇటీవలే ఆప్ఘనిస్థాన్‌పై గెలిచిన దక్షిణాఫ్రికా… ఆడిన అన్నింటిలోనూ గెలిచిన న్యూజిలాండ్‌తో బుధవారం తలపడనుంది.

Leave a Reply