మ్యాచ్ టై…సూపర్ ఓవర్ టై…అయినా విశ్వ విజేత ఇంగ్లండ్….

England win World Cup 2019 despite tied Super Over vs New Zealand
Share Icons:

 

లండన్:

 

క్రికెట్ చరిత్రలో ఊహించని ఫలితం తాజా ప్రపంచ కప్ లో వెలువడింది. లార్డ్స్ వేదికగా  క్షణక్షణం ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో ఒత్తిడిని అధిగమించిన ఇంగ్లండ్‌నే విజయం వరించింది. బంతి బంతికి ఆధిక్యం చేతులు మారుతూ వచ్చిన పోరు తొలుత టైఅయినా.. సూపర్ ఓవర్‌లో ఇంగ్లిష్ జట్టు బ్యాటింగ్ చేసి 15 పరుగులు సాధించింది. అనంతరం కివీస్ కూడా సరిగ్గా 15 పరుగులే చేసినా.. అసలు మ్యాచ్‌లో కివీస్(16) కంటే ఎక్కువ బౌండరీలు (24) కొట్టిన ఇంగ్లండ్‌నే విజయం వరించింది.

 

ఆదివారం క్రికెట్ మక్కా లార్డ్స్‌లో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ సూపర్ ఓవర్‌లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసి నయా చాంపియన్‌గా అవతరించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 241 పరుగులు చేసింది. ఓపెనర్ నికోల్స్ (55; 4 ఫోర్లు) అర్ధ శతకం సాధించగా.. టామ్ లాథమ్ (47; 2 ఫోర్లు, 1 సిక్స్) పోరాడాడు. భీకర ఫామ్‌లో ఉన్న కెప్టెన్ కేన్ విలియమ్సన్ (30) మంచి ఆరంభాన్ని భారీ స్కోరుగా మలచలేకపోయాడు.

 

ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ (3/37), లియామ్ ప్లంకెట్ (3/42) సత్తాచాటారు. అనంతరం లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ 50 ఓవర్లలో సరిగ్గా 241 పరుగులకే ఆలౌటైంది. స్టోక్స్ (98 బంతుల్లో 84; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), బట్లర్ (60 బంతుల్లో 59; 6 ఫోర్లు) పోరాడినా చివరకు మ్యాచ్ టైఅయింది. స్టోక్స్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, విలియమ్సన్‌కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి.

 

ఇక ఈ వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు చేసిన టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ(648)కు గోల్డెన్ బ్యాట్ దక్కింది. అలాగే అత్యధిక వికెట్లు తీసిన ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్(27)కు గోల్డెన్ బాల్ అవార్డు దక్కింది. ఇక 2023లో జరిగే ప్రపంచ కప్ కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. అంతక ముందు 1987, 1996, 2011లో భారత్ వన్డే ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇచ్చినా.. పొరుగు దేశాలైన పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లు కూడా ఆతిథ్యం పంచుకున్నాయి.

 

ఈ క్రమంలో 2023లో జరగనున్న ప్రపంచకప్ మ్యాచ్‌లన్నింటినీ పూర్తిగా భారత్‌లోనే నిర్వహించనున్నారు. ఇక ఆ మ్యాచ్‌లో లీగ్ దశ ఇప్పుడు జరిగినట్లుగానే రౌండ్ రాబిన్ పద్ధతిలో ఉంటుంది. ఆ తరువాత సెమీఫైనల్స్, ఫైనల్ ఉంటాయి. 2023 ఫిబ్రవరి 9 నుంచి మార్చి 26వ తేదీ వరకు వన్డే ప్రపంచ కప్ షెడ్యూల్‌ను ఇప్పటికే ఫిక్స్ చేశారు.

Leave a Reply