ఇంగ్లీష్ గడ్డపై ఇంగ్లండ్ ని మట్టికరిపించి తొలి టెస్ట్ లో ఆసీస్ విజయం…….

England vs Australia...Aussies hand Poms hammering at Edgbaston
Share Icons:

లండన్:

 

విశ్వ విజేత ఇంగ్లండ్ ని….వాళ్ళ సొంతగడ్డపైనే ఆస్ట్రేలియా జట్టు మట్టికరిపించి అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఐదు టెస్టుల యాషెస్ సిరీస్ లో భాగంగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్‌ను 251 పరుగుల భారీ తేడాతో ఓడించి… ఆసీస్ ఘనవిజయం సాధించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో నిలిచి.. 14 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ గడ్డపై యాషెస్ సిరీస్‌లో ఆధిక్యం సాధించింది.

 

ఇక 398 పరుగుల లక్ష్యఛేదన కోసం ఓవర్‌నైట్ స్కోర్ 13/0తో చివరి రోజైన సోమవారం బరిలోకి దిగిన ఇంగ్లిష్ జట్టు… ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్(6/49), పేసర్ కమిన్స్(4/32) ధాటికి 146 పరుగులకే కుప్పకూలిపోయింది. తొమ్మిదో స్థానంలో వచ్చిన క్రిస్ వోక్స్(37; 54 బంతులు, 7ఫోర్లు) ఇంగ్లిష్ జట్టు టాప్‌స్కోరర్ కాగా… జేసన్ రాయ్(28; 58 బంతులు, 4ఫోర్లు) మాత్రమే కాసేపు నిలబడగలిగారు. మరోవైపు రెండు ఇన్నింగ్స్‌లో శతకాలు సాధించి ఆసీస్ విజయంలో ప్రధాన పాత్ర పోషించిన స్టీవ్ స్మిత్(144, 142)కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.

 

ఇక 2001 తర్వాత ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో ఏ ఫార్మాట్లోనైనా ఆసీస్‌కు ఇదే తొలి విజయం. అలాగే ఈ మ్యాచ్‌లో అంపైర్ విల్సన్ ఇచ్చిన ఎనిమిది నిర్ణయాలు డీఆర్‌ఎస్‌లో తప్పుగా తేలాయి. రెండో ఇన్నింగ్స్‌లో స్టోక్స్‌ను ఔట్ చేయడం ద్వారా ఆస్ట్రేలియా బౌలర్ లియాన్ టెస్టుల్లో 350 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు.

 

తొలి ఇన్నింగ్స్ : ఆస్ట్రేలియా 284 ఆలౌట్, ఇంగ్లండ్ 374 ఆలౌట్

 

రెండో ఇన్నింగ్స్ : ఆస్ట్రేలియా 487/7 డిక్లేర్డ్, ఇంగ్లండ్ 146 ఆలౌట్

 

Leave a Reply