ఆస్ట్రేలియాని మట్టికరిపించి…..ప్రపంచ కప్ ఫైనల్ కు చేరుకున్న ఇంగ్లండ్…

england defeat australia and reaches world cup final
Share Icons:

లండన్:

 

ప్రపంచ కప్ లో మరో అదిరిపోయే ఫైట్ జరిగింది….అయితే ఏకపక్షంగా సాగింది. ఐదు సార్లు విశ్వవిజేతగా నిలిచిన ఆస్ట్రేలియాని మట్టికరిపించి ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు ఫైనల్ కు దూసుకెళ్లింది. బౌలింగ్‌లో వోక్స్, రషీద్ విజృంభిస్తే.. బ్యాటింగ్‌లో జాసెన్ రాయ్ ఆసీస్ పేసర్లతో ఒక ఆట ఆడుకున్నారు. ఫలితంగా మరో 108 బంతులు మిగిలుండగానే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించిన ఇంగ్లండ్ సొంతగడ్డపై సగర్వంగా తుదిపోరుకు చేరింది.

 

ఇక ఫైనల్లో తలపడే రెండు జట్లూ ఇప్పటి వరకు కప్పు కొట్టకపోవడంతో.. కొత్త చాంపియన్‌ను చూసే అవకాశం దక్కనుంది. బ్యాటింగే బలంగా దూసుకొచ్చిన ఇంగ్లండ్ క్రికెట్ మక్కా లార్డ్స్‌లో ఆదివారం జరిగే ఫైనల్లో నాణ్యమైన పేస్ వనరులున్న న్యూజిలాండ్‌ను ఢీకొట్టనుంది.

 

ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఆతిథ్య ఇంగ్లండ్ 27 ఏళ్ల తర్వాత విశ్వసమరం తుదిపోరుకు అర్హత సాధించింది. గురువారం జరిగిన రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై గెలిచి ఫైనల్ చేరింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ 49 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (119 బంతుల్లో 85; 6 ఫోర్లు), ఒంటరి పోరాటం చేయగా.. అలెక్స్ కారీ (46; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో రషీద్, వోక్స్ చెరో 3 వికెట్లు పడగొట్టారు.

 

అనంతరం లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ 32.1 ఓవర్లలో 2 వికెట్లకు 226 పరుగులు చేసింది. జాసన్ రాయ్ (65 బంతుల్లో 85; 9 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగితే.. రూట్ (46 బంతుల్లో 49 నాటౌట్; 8 ఫోర్లు), మోర్గాన్ (39 బంతుల్లో 45 నాటౌట్; 8 ఫోర్లు) రాణించారు. వోక్స్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

Leave a Reply