ఎన్నికల వేళ కోట్లు సంపాదిస్తున్న జ్యోతిష్యులు

Share Icons:

అమరావతి, మే 18,

ఎన్నికలు జరిగాక, వాటి ఫలితాలు రావడానికి 42 రోజులు టైమ్ ఉండటం ఎవరికీ కలిసిరాకపోయినా… జ్యోతిష్యులు, సిద్ధాంతులు, పండితులు, హస్త సాముద్రికలు చూసేవారికి, సంఖ్యాశాస్త్రం, చిలకజోస్యం, మచ్చ శాస్త్రాల నిపుణులకూ  బాగా కలిసొచ్చింది.

ఆంధ్రప్రదేశ్‌తో పాటూ దేశవ్యాప్తంగా ప్రముఖ జ్యోతిష్యులతోపాటూ… చిన్నా చితకా పేరున్న వారు సైతం… బాగా సంపాదించింది ఈ 40 రోజుల్లోనే. ఇందుకు ప్రధాన కారణం ఫలితాలు ఆలస్యంగా వస్తుండటమే. రోజులు గడిచే కొద్దీ టెన్షన్ ఎక్కువైన వివిధ పార్టీల అభ్యర్థులు… కొన్నాళ్లపాటూ రకరకాల సర్వేలను పరిశీలించారు.

అప్పటికీ టెన్షన్ తగ్గకపోవడంతో… గ్రహబలం ఎలా ఉందో తెలుసుకుందామని కొందరు, చేతి రాతలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందామని మరికొందరు… జ్యోతిష్యుల చెంతకు వెళ్లి తమ భవిష్యత్తేంటని అడిగారు. ఈ సందర్భంగా… వాళ్లు అడిగినంతా ముట్టజెప్పారు. పెరిగిన పూజలు, యాగాలు : ఈ 40 రోజుల్లో గుళ్లు, గోపురాలకు వెళ్లిన నేతలకు లెక్క లేదు. కొంతమందైతే చండీయాగాలు, ఇతరత్రా యగాలు, వ్రతాలు, హోమాలు జరిపించుకున్నారు. తద్వారా దైవానుగ్రహంతో తాము గెలుస్తామని నమ్మకంతో ఉన్నారు.

పార్టీలూ, అభ్యర్థుల్లో ఉన్న టెన్షన్‌ను కొందరు జ్యోతిష్యులు క్యాష్ చేసుకుంటున్నారు. తాము చెప్పినట్లే ఫలానా పార్టీ అధికారంలోకి వస్తుందని కొందరు, ఫలానా అభ్యర్థికి అదిరిపోయే గ్రహబలం ఉందని మరికొందరు… ఏవేవో అంచనాలతో గెలుపోటములను ముందే చెబుతున్నారు. వాళ్లు చెప్పేది నిజమైనా, అబద్ధమైనా… ఓ ప్రకటనైతే చేస్తున్నారు.

దీని వల్ల స్వలాభం ఉంటుంది. ఫలితాల తర్వాత వాళ్లు చెప్పినట్లే జరిగితే… గెలిచిన పార్టీ… వాళ్లకు కాసుల వర్షం కురిపించకమానదు. అదే వాళ్లు చెప్పినట్లు జరగకుండా ఆ పార్టీ ఓడిపోతే, ఇక ఆ జ్యోతిష్యుడి కెరీర్ ముగిసినట్లే. ప్రజలు ఆయన్ని నమ్మే పరిస్థితి ఉండకపోవచ్చు. అయినప్పటికీ… ఏదో ఒక రకంగా ప్రజల నోళ్లలో తమ పేరు నానుతూ ఉండాలన్న ఉద్దేశంతో ప్రకటనలు చేస్తున్నారు జ్యోతిష్యులు.

మన తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ జ్యోతిష్యులు రెండుగా విడిపోయారు. కొందరు వైసీపీ గెలుస్తుందని చెబుతుంటే, మరికొందరు టీడీపీ తిరిగి అధికారంలోకి వస్తుందంటున్నారు. కొందరు చంద్రబాబు గ్రహబలం బాగుందని అంటుంటే… మరికొందరు ఆ ముహూర్తంలో జగన్ ప్రమాణ స్వీకారం చేస్తే చాలా బాగుంటుంది అని చెబుతున్నారు. ఎన్నికల సర్వేలైతే… రకరకాలుగా ఉండేందుకు అవకాశాలుంటాయి. జ్యోతిష్యం అలా కాదు కదా. అందులో పక్కా లెక్కలు ఉంటాయి. అలాంటప్పుడు ఒక్కొక్కరూ ఒక్కో రకంగా ఎందుకు చెబుతున్నారన్నది తేలాల్సిన ప్రశ్న.

ఎంత చిత్రమంటే ఏ అభ్యర్థి ఎన్ని వేల ఓట్లతో గెలిచేదీ కూడా చెప్పేస్తున్నారు కొందరు పండితులు. మంత్రి పదవి చేపట్టాలంటే ఫలానా శాంతి పూజలు చెయ్యాలని చెప్పేవారూ ఉన్నారు. ఫలానా ఏళ్లనాటి శని వెంటాడుతోంది, అది పోవాలంటే ఈ పూజలు చెయ్యాలి అని సలహాలిచ్చేవారికీ లెక్కలేదు.

న్నికల ప్రచారంలో కోట్లు ఖర్చుపెట్టిన నేతలు, ఇప్పుడు ఫలితాలు తెలుసుకునేందుకు సర్వేలు, జ్యోతిష్యులకు కూడా బాగానే ముట్టజెబు తున్నారు. ఇక పూజలు, వ్రతాలు, యాగాలకైతే కోట్లు ఖర్చవుతున్నాయి. దైవ కరుణ కోసం ఎంత ఖర్చుపెట్టినా తప్పులేదనే భావనే ఇందుకు కారణం. బిజినెస్ ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలన్న సూత్రాన్ని ఫాలో అవుతూ పండితులు, జ్యోతిష్యులు కూడా ఈ టైంలో బాగా సంపాదిస్తున్నారు.

మామాట- మే 23 తర్వాత   డిమాండ్ ఉండదు కదా మరి.

Leave a Reply