దేవుడా…అసెంబ్లీ ఎన్నికల ఖర్చు ఇంతే అయిందా…కేసీఆర్, రేవంత్ ఖర్చు ఎంతంటే?

Share Icons:

హైదరాబాద్, 14 జనవరి:

గత నెలలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే. ఇక టీడీపీతో కలిసి మహాకూటమిగా పోటీ చేసి కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.

అయితే ఈ ఎన్నికల ఫలితాలని పక్కన పెడితే…ఆ ఎన్నికల్లో ఒకో ఎమ్మెల్యే అభ్యర్ధి రూ.28 లక్షలే ఖర్చు పెట్టాలని, అంతకు మించి పెట్టడానికి వీల్లేదని ఈసీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కానీ ఎన్నికలు ముగిసిన తరువాత అభ్యర్థులంతా తమ తమ ఖర్చు లెక్కలను ఈసీకి అందించారు. ఆ లెక్కల ప్రకారం చూసుకుంటే పోటీ చేసిన అభ్యర్ధుల సగటు వ్యయం ఈసీ పరిమితి దరిదాపులకు కూడా చేరలేదట. ఒక్క ప్రాంతంలోనూ మద్యం, నగదు పంపిణీ లేదట.

ఉదాహరణకి గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్ రూ. 6.53 లక్షలు ఖర్చు చేశారట. ఇక, హై టెన్షన్ ను తలపించిన కొడంగల్ లో రేవంత్ రెడ్డి చేసిన ఖర్చు రూ. 7.40 లక్షలు మాత్రమేనట. అలాగే టీఆర్ఎస్ యువనేత కేటీఆర్, సిరిసిల్లలో రూ. 7.53 లక్షలు ఖర్చు చేశానని చెప్పగా, కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి రూ. 17.06 లక్షలు ఖర్చు పెట్టారట.

అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేసిన అత్యంత ధనవంతుడు, టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్, నాగర్ కర్నూలులో రూ. 17.77 లక్షలు ఎన్నికల వ్యయాన్ని చూపగా, తుమ్మల నాగేశ్వరరావు రూ. 14.44 లక్షలు ఖర్చు చేశారట. ఇక ఒక్కరంటే ఒక్కరు కూడా తమ ఎన్నికల ఖర్చులో క్వార్టర్ మద్యం బాటిల్ కొన్నట్టు కూడా చూపించలేదు.

అసలు ఈ రోజుల్లో పంచాయితీకి పోటీ చేస్తేనే కనీసం 50 లక్షలు ఖర్చు చేయకుండా ఉండరు. అలాంటిది అసెంబ్లీ ఎన్నికల్లో పెట్టిన ఖర్చు అంత తక్కువంటే నమ్మశక్యం కావడం లేదు.

మామాట: కొన్ని కొన్ని నమ్మేయాలి అంతే…

Leave a Reply