మట్టి గణపతికి జై

Share Icons:

కుమురంభీం, సెప్టెంబర్ 10, 2018

త్వరలోనే వినాయకచవితి శోభ మొదలవనుంది. ఇప్పటికే పలు చోట్ల గణపయ్య విగ్రహాలను ప్రతిష్టించేందుకు కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పర్యావరణహిత గణపతి విగ్రహాల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అంతా మట్టి గణపయ్యలనే పూజించాలన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఎందుకంటే పర్యావరణ పరిరక్షణకు సహజ రంగులతో తయారైన వినాయక విగ్రహాలే మంచింది.  ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ప్రతిమలతో పెను ముప్పు వాటిల్లుతుంది. అందుకే మట్టి గణపతి విగ్రహాలను నెలకొల్పడమే మంచిదని నిపుణులు, పర్యావరణవేత్తలు స్పష్టంచేస్తున్నారు. ఏటా… మట్టి విఘ్నేషుడే పర్యావరణానికి మేలు.. ఏకో దంతుడికి సహజ రంగులే బెటర్ అంటూ ప్రకృతి, పర్యావరణ పరిరక్షకులు నినాదాలు చేస్తూ ర్యాలీలు చేస్తున్నారు. ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు, ఔత్సాహిక యువకులు పది రోజుల ముందు నుంచే మట్టి వినాయక ప్రతిమలు తయారు చేసి ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. అయినప్పటికీ కొందరు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను ప్రతిష్టిస్తున్నారు. ఇలాంటివారిలో మార్పు తెచ్చేందుకు పర్యావరణవేత్తలు మట్టి గణపతి విగ్రహాల వల్ల జరిగే మేలు.. రసాయన విగ్రహాల వల్ల పర్యావరణానికి జరిగే కీడును విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

సర్వ విఘ్నాలను తొలగించే ఆదిదేవుడు వినాయకుడు. ఏ శుభకార్యమైన వినాయకుడి పూజతోనే ప్రారంభమవుతుంది. ఈ విఘ్నేశ్వరుడి జన్మదినమే వినాయక చవితి. ఏటా భాద్రపద మాసంలో శుక్లపక్షమి చవితి రోజున వినాయక నవరాత్రులు ఆరంభం అవుతాయి. వినాయక చవితిని పురస్కరించుకుని వినాయకుడి ప్రతిమలను ఇంటింటా, వాడవాడలా, ప్రతి గ్రామంలో నెలకొల్పి తొమ్మిది రోజులపాటు పూజిస్తాం. ఇప్పటి నుంచే వినాయక ప్రతిమలు రూపుదిద్దుకుంటున్నాయి. వీటిలో అధికంగా పర్యావరణానికి హానీ కలిగించే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, వాతావరణానికి విఘాతం కలిగించే రసాయనాలు వినియోగిస్తున్నారు. ఇటువంటి రసాయనాలతో కూడిన విగ్రహాలు పర్యావరణానికి నష్టం వాటిల్లనుంది. దీంతో ప్రకృతి ప్రేమికులు, పర్యావరణ రక్షకులు ఇటీవల ఎక్కువగా మట్టితో తయారు చేసిన గణపతి విగ్రహాల వైపే మొగ్గు చూపుతూ.. ఏకో గణపతి ప్రతిమలను పంపిణీ చేస్తున్నారు. ప్రకృతి పరిరక్షణకు పెద్దపీట వేసే పండుగ వినాయకచవితి. అందుకే మట్టి వినాయకులను తయారు చేద్దాం.. మట్టి గణపతి ప్రతిమలనే పూజిద్దాం.

మామాట: మట్టి గణపతి పూజ మహిమాన్వితమని తెలుసుకోండి…

Leave a Reply