చంద్రబాబుకు ఝలక్ ఇచ్చిన తూర్పు నేతలు…జంపింగేనా?

chandrababu sensational decision tdp arrange the Rehabilitation for the activists
Share Icons:

కాకినాడ:

ఎన్నికల్లో ఓటమి పాలైన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీకి వరుస షాకులు తగులుతున్న విషయం తెలిసిందే. ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలు పార్టీని వీడి బీజేపీలోకి, వైసీపీల్లోకి వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబుకు తూర్పు గోదావరి జిల్లా నేతలు ఝలక్ ఇచ్చారు. అయితే మొన్న ఎన్నికల్లో తూర్పులో టీడీపీ నాలుగు సీట్లు గెలుచుకుంది. రాజమండ్రి రూరల్, అర్బన్, మండపేట, పెద్దాపురంలో గెలిచారు. అయితే ఓటమి తర్వాత చంద్రబాబు స్వయంగా జిల్లా స్థాయి కార్యకర్తల సమావేశం నిరహించారు. ఈ సమావేశానికి పలువురు సీనియర్ నేతలు, పేరున్న లీడర్లు గైర్హాజరు కావడం కలకలం రేపుతోంది.

టీడీపీ విస్తృత స్థాయి సమావేశానికి జిల్లా ప్రధాన నేతల్లో ఒకరైన తోట త్రిమూర్తులు హాజరు కాలేదు. ఈయన పార్టీ మారుతారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఆయన టీడీపీని వీడటం ఖాయమని తెలుస్తోంది. త్రిమూర్తులుతో పాటు చలమలశెట్టి సునీల్, మాగంటి రూపలు కూడా హాజరు కాలేదు. సునీల్ కాకినాడ పార్లమెంట్ నుంచి పోటీ చేసి ఓడిపోతే, రూప రాజమండ్రి పార్లమెంట్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

ఇక వీరితో పాటు కాకినాడ నగర టీడీపీ అధ్యక్షుడు దొరబాబు, మరికొందరు కార్పొరేటర్లు కూడా ఈ సమావేశానికి రాలేదు. జిల్లా ముఖ్య నేతల్లో ఒకరైన వరుపుల రాజా ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన బాటలోనే మరింత మంది టీడీపీని వీడుతారని సమాచారం. వీరిలో అత్యధికులు బీజేపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు వీరంతా తమ తమ అనుచరులతో మంతనాలు సాగిస్తున్నట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి.

ఇదిలా ఉంటే నిన్న ఆ సమావేశంలో చంద్రబాబు వైసీపీ 100 రోజుల పాలనపై విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వ 100 రోజుల పాలన అప్రతిష్ఠను మూటకట్టుకుందని అన్నారు. ఇది విధ్వంసకర ప్రభుత్వం అని ధ్వజమెత్తారు. వందరోజుల్లో ఇంత చెడ్డపేరు తెచ్చుకున్న సీఎం చరిత్రలో మరొకరు లేరని విమర్శించారు. టీడీపీ కార్యకర్తలపై వైసీపీ సర్కారు అకృత్యాలకు పాల్పడుతోందని మండిపడ్డారు.

పిఠాపురం, తుని, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో టీడీపీ కార్యకర్తలపై దాడులు చేశారని వివరించారు. నెలలు గడుస్తున్నా తన బాబాయిని ఎవరు హత్య చేశారో తేల్చలేదని అన్నారు. జగన్‌కు దమ్ముంటే తన బాబాయ్‌ని చంపిన నిందితులను బయటపెట్టాలని సవాల్ విసిరారు. చేతకాకుంటే కేసు సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. పులివెందుల పంచాయితీని రాష్ట్రం మొత్తం రుద్దాలని చూస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రుల రాజధాని అమరావతిని చంపాలని చూస్తున్నారని… ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టును అటకెక్కించారని ఆరోపించారు. పులివెందుల పంచాయతీ రాష్ట్రమంతటా చేయాలనుకుంటున్నారని విమర్శించారు.

 

Leave a Reply