పెట్రేగుతున్న డ్రగ్స్ మాఫియా

Share Icons:

హైదరాబాద్, డిసెంబర్ 15: 

హైదరాబాద్ మాదకద్రవ్యాల మత్తులో కూరుకుపోతోందా.. ? న్యూ ఇయర్‌ వేడుకలే లక్ష్యంగా డ్రగ్స్ మాఫియా చెలరేగిపోనుందా?  ఇప్పటికే భారీ స్థాయిలో డ్రగ్స్ నగరానికి చేరిపోయిందా?  వీటన్నింటికి అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి. వేడుకల్లో భారీ స్థాయిలో డ్రగ్స్‌ వినియోగం జరుగనున్నట్లు..పోలీసులు అనుమానిస్తున్నారు. పటిష్టమైన భద్రతతో వాటికి చెక్‌ పెడతామని చెబుతున్నారు. హైదరాబాద్ లో డ్రగ్స్ మాఫియా విస్తరిస్తోంది.

న్యూ ఇయర్‌ వేడుకలను టార్గెట్ చేసుకుని…డ్రగ్స్‌ను భారీ స్థాయిలో విక్రయించేందుకు ముఠాలు నగరానికి చేరుకున్నాయని పోలీసులు భావిస్తున్నారు. దీంతో డ్రగ్ పెడలర్స్ కదలికలపై పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నారు. డ్రగ్స్‌ తరలించే అన్ని మార్గాలపైనా పోలీసులు దృష్టి సారించారు. అయితే..ఎవరికీ అనుమానం రాకుండా డ్రగ్ పెడలర్స్ వాటిని చేర్చాల్సిన చోటుకి చేర్చేస్తున్నారు. తాజాగా విదేశీ డ్రగ్ పెడలర్ తో పాటు మరో ఇద్దరు వ్యక్తులను వెస్టుజోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో.. ఇప్పటికే  కొందరు వ్యక్తుల చేతుల్లోకి మాదక ద్రవ్యాలు చేరాయన్న విషయాన్ని పోలీసులు గుర్తించారు.

న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా మత్తుపదార్థాలను విక్రయించి సొమ్ము చేసుకోవాలని కొందరు వ్యాపారులు ఈ దందాకు మరోసారి తెర తీశారు. ఇదిలా ఉంటే గత ఏడాది 2016 నవంబర్ నెలలో ఆరుగురు స్మగ్లర్ల ను అదుపులోకి తీసుకొని, 3 కోట్లకు పైగా విలువైన మాదకద్రవ్యాలను శంషాబాద్‌లో ఎయిర్‌ పోర్టులో కస్టమ్స్ స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఇద్దరు ప్రయాణికులు మాదక ద్రవ్యాలతో మలేసియా వెళ్లేందుకు ప్రయత్నించగా తనిఖీల్లో పట్టుబడ్డారు. అదే ఏడాది అదే నెలలో  మత్తుపదార్థాలను సరఫరా చేస్తున్న నలుగురు వ్యక్తులను నగరంలోని కూకట్‌పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి  550 గ్రాముల అల్పజ్రోలమ్ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఇప్పటికే నగరంలో భారీగా డ్రగ్స్ చేరిందన్న విషయాన్ని సీరియస్ గా తీసుకుంటున్న పోలీసులు…  డ్రగ్స్ ఎవరు వినియోగించినా, ఎవరు విక్రయించినా కఠినశిక్షలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఎవరు డ్రగ్స్ వినియోగించినా కనీసం పదిసంవత్సరాలు జైలు శిక్ష పడుతుందని చెబుతున్నారు. ప్లవర్ బోకేస్, కొరియర్స్‌, గిఫ్ట్ ప్యాక్ ల ద్వారా కూడా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పట్టుబడ్డ వ్యక్తులు చెప్పడంతో ..ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సిటీలో కంటే..నగర శివారు ప్రాంతాల్లో జరిగే వేడుకలకు హజరయ్యేందుకే యువత ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీంతో అక్కడే ఎక్కువగా మాదక ద్రవ్యాల వినియోగం ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. వాటిని సమర్ధవంతంగా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రేవ్ పార్టీలు.. వీకెండ్ నైట్స్.. సెలబ్రేషన్స్ తో పాటు.. రిసార్ట్.. హోటల్స్.. పబ్స్ పై ప్రత్యేక నిఘా పెట్టేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.

మామాట: ఈ డ్రగ్స్ మాఫియాకి అడ్డుకట్ట పడేదెప్పుడో

Leave a Reply