కేటీఆర్ ఫామ్‌హౌస్ ఇష్యూ: రేవంత్‌కు బెయిల్…

Revanth Reddy detained for trying to lay siege to Pragati Bhavan
Share Icons:

హైదరాబాద్: కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ శివారులోని కేటీఆర్ ఫాంహౌజ్‌పైన డ్రోన్ కెమెరాలు ఎగరేసి చిత్రీకరించిన ఆరోపణలపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని శంషాబాద్ విమానాశ్రయం వద్ద పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఎలాంటి అనుమతులు లేకుండా డ్రోన్లు ఎగరేసి కెమెరాతో చిత్రీకరించడం నేరమని రేవంత్ రెడ్డిని నార్సింగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జీవో నెం. 111ను ఉల్లంఘించి మంత్రి కేటీఆర్ ఫాంహౌజ్ నిర్మించుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఆ విషయాన్ని నిరూపించేందుకు తాను డ్రోన్ ఎగరేసినట్లు చెప్పారు.

ఇక కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి ఎట్టకేలకు బుధవారం బెయిల్ మంజూరైంది. రేవంత్ రెడ్డి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు. ఈ కేసులో రేవంత్ రెడ్డి గత 14 రోజులుగా చర్లపల్లి జైలులోనే ఉన్న విషయం తెలిసిందే.

తొలుత బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను కూకట్‌పల్లి కోర్టు కొట్టువేసింది. దీంతో రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు బుధవారం రేవంత్ రెడ్డికి షరతలతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కాగా, రేవంత్ రెడ్డి విడుదలవనున్న నేపథ్యంలో చర్లపల్లి జైలు వద్దకు రేవంత్ అభిమానులు చేరుకునే అవకాశం ఉంది.

కాగా, అయితే, రేవంత్ రెడ్డి వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఇలా వ్యవహరిస్తున్నారంటూ టీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. గోపన్‌పల్లి భూ వ్యవహారంలో రేవంత్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలోనే ఆయన జీవో 111 అంశాన్ని తెరపైకి తెచ్చారని విమర్శించారు. కేటీఆర్ ఫాంహౌజ్ నిర్మాణంలో ఎలాంటి అవకతవకలు జగరలేదని టీఆర్ఎస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. కాగా, రేవంత్ రెడ్డి సొంత అజెండాను అమలు చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేతలు ఈ వ్యవహారంపై మండిపడ్డారు. అయితే ఈ విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డితోపాటు ఢిల్లీ పెద్దలు కూడా రేవంత్‌కు మద్దతుగా నిలవడం గమనార్హం.

 

Leave a Reply