వేరుసెనగ, టమాటా రైతుల ఆశలు ఆవిరే

Share Icons:

తిరుపతి, సెప్టెంబర్ 09,

తొలకరి వర్షాలు జూన్‌ మొదటి వారంలో పలకరించడంతో.. రైతులు వేరుశనగ సాగుపై దృష్టి పెట్టారు. మొదటి, చివరి వారాల్లో రెండు విడతలుగా వేరుశనగ విత్తారు. విత్తడంతోనే వర్షాలు ముఖం చాటేశాయి. వేరుశనగ మొలకెత్తడం మినహా ఎదుగుదలకు కూడా వర్షాలు కురవలేదు. రెండు నెలలుగా వర్షాలు లేకపోవడంతో వేరుశనగ మొక్కలను కాపాడడం ఎవరితరం కాలేదు.రెయిన్‌ గన్‌లతో నీటితడులు అందించడం, యూరియా పిచికారితో 10 శాతం పంటలను  వ్యవసాయశాఖ అధికారులు కాపాడగలిగారు. అది కూడా తాత్కాలిక ఉపశమనం మాత్రమే అయింది. వర్షాభావం వెంటాడడంతో భూమిలో తేమశాతం లేకపోయింది. మొక్కలు కూడా చనిపోతున్నాయి. ఈ పరిస్థితి జిల్లాలోని మదనపల్లె, తంబళ్లపల్లె, పుంగనూరు, పలమనేరు, కుప్పం, పీలేరు వంటి నియోజకవర్గాల్లో తీవ్రంగా ఉంది. ఇక వర్షాలు కురిసినా వేరుశనగ సాగులో 40శాతం దిగుబడులు కూడా పొందే అవకాశం లేదు. ఒక్క హెక్టారు వేరుశనగ సాగుకు రైతులు రూ.25 వేల వరకు పెట్టుబడి పెట్టారు. జిల్లా వ్యాప్తంగా రూ.200కోట్లకు పైగానే ఖర్చు చేశారు.ఇక వర్షాలు కురిసినా రూ.50 కోట్లు కూడా తిరిగి పంట దిగుబడులతో రాబట్టుకోలేని దుస్థితి.

ప్రస్తుతం 15 ఎకరాల్లో టమోటా సాగు చేశా. రూ.15 లక్షలకు పైగానే సాగుకు ఖర్చు చేశాం. పంట దిగుబడి బాగానే వచ్చింది. కాయలు పక్వదశకు వచ్చాయి. కోతలు కోస్తున్నాం. అయితే తోటలో కాయలకు తొడిమ రోగం వచ్చింది. మాగిన ప్రతి కాయ కిందికి రాలిపోతోంది. దిగుబడిలో సగం ఉత్పత్తిని నష్టపోయే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం మార్కెట్‌లో ధర కిలో రూ.8 వరకు ఉంది. అయితే తెగుళ్ల కారణంగా దిగుబడులు నష్టపోతున్నాం. గతంలో పంట దిగుబడులు బాగానే వచ్చింది. అప్పుడు గిట్టుబాటు ధరలు లేకనష్టాలు భరించాల్సి వచ్చింది.రెండు ఎకరాల్లో వేరుశెనగ సాగు చేశామని… విత్తనాలు మొలకెత్తాయి. తర్వాత రెండు నెలలుగా చినుకు జాడ లేదు. మొక్కలు ఎండిపోయాయి. భూమిలో తేమ లేకపోవడంతో వేరు పురుగులు మొక్కల వేర్లను తినేస్తున్నాయి. మొక్కలు కూడా చనిపోతున్నాయి. రెండు ఎకరాలకు పెట్టిన సాగుపెట్టుబడులు కోల్పోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడాది ఏప్రిల్‌, మే, జూన్‌, జులై నెలల్లో 20 వేల హెక్టార్లకు పైగానే రైతులు టమోటా సాగు చేశారు. రోజువారీగా 1300 టన్నులకు పైబడి రికార్డు స్థాయిలో మదనపల్లె టమోటామార్కెట్‌కు దిగుబడి వచ్చింది. అయితే గిట్టుబాటు ధరలు లేక రైతులు నిలువునా మునిగారు. కిలో రూ.5 నుంచి రూ.7 వరకు మాత్రమే పలికింది.

హైబ్రిడ్‌ రకం టమోటా సాగుకు రైతులు రూ.లక్ష నుంచి రూ.1.20 లక్షల వరకు సాగు పెట్టుబడులు చేస్తున్నారు. ఇలా మదనపల్లె డివిజన్‌ పరిధిలోని రామసముద్రం, మదనపల్లె, నిమ్మనపల్లె, పుంగనూరు, కురబలకోట, తంబళ్లపల్లె, బి.కొత్తకోట, మొలకలచెరువు, పీటీఎం, వాల్మీకిపురం, రామకుప్పం, కుప్పం, శాంతిపురం, పలమనేరు, పెద్దపంజాణి, చౌడేపల్లె వంటి మండలాల పరిధిలోని టమోటా రైతులు కోట్లాది రూపాయల పెట్టుబడులు నష్టపోయారు. ప్రస్తుతం ఖరీఫ్‌ ప్రారంభంలో రెండో దశలో నాటిన టమోటా తోటలు వాతావరణ పరిస్థితులు అనుకూలించక తెగుళ్లు బారిన పడ్డాయి. వాతావరణంలో మబ్బులు, చలి వాతావరణం టమోటా సాగుకు అనుకూలించలేదు. మొక్క దశ నుంచి ఆకుముడ త, విల్టు, వైరస్‌, పచ్చ పురుగు దిగుబడులను దెబ్బతీస్తున్నాయి. దీనికి తోడు ఊజి ఈగలు తోటలపై దాడి చేసి దిగుబడులను నష్టపరుస్తున్నాయి. ప్రస్తుతం టమోటాతోటల్లో కాయ తొడిమ రోగం విజృంభిస్తోంది. మొక్కలోని కాయ పక్వదశకు చేరుతున్న సమయంలోనే నేలకు రాలిపోతోంది. టమోటాసాగులో రైతులు రూ.కోట్ల నష్టపోయే దుస్థితి ఏర్పడింది.

మామాట :  కరవు కోరలు చాచిందంటే పేదలే పలహారం

Leave a Reply