అందగాడు కాదు, ఆజానుబాహుడు కాదు అయినా ఆయన…

Share Icons:

 అందగాడు కాదు, ఆజానుబాహుడు కాదు  

 దేశం గర్వించదగిన శాస్త్రవేత్త, రాష్ట్రపతి :  డా. ఏపీజే అబ్దుల్‌కలాం 

భారతదేశం గర్వించదగిన శాస్త్రవేత్త, రాష్ట్రపతిగా కూడా సేవలందించిన మహనీయుడు ఏపీజే అబ్దుల్‌కలాం..  ఆయన పూర్తి పేరు అవుల్‌ పకీర్‌ జైనులబ్దీన్‌ కలాం.అందగాడు కాదు, ఆజానుబాహుడు కాదు. ఐశ్వర్యవంతుడు అంత కన్నా కాదు. అగ్ర  కులీనుడు కాదు. పండిత కుటుంబం కాదు. కత్తి పట్టలేదు, క్షాత్రం కనుచూపు మేరలో కానరాదు.  రాముడు కాదు రహీము కాదు… పలుకులు నేర్చిన రామ చిలుకా కాదు. విల్లంబు లెత్తిన అర్జునుడు కాదు… సారథి కృష్ణుడూ కాదు. శౌర్యం మాటే లేదు…. అయినా శత్రు దేశాన్ని భయపెట్టని క్షణం లేదు. ఓడి ఆగింది లేదు, విజయ గర్వం లేదు… అసలు అలిసిన ఛాయ లేనే లేదు. కూడ బెట్టింది లేదు…కలిమి అంటింది లేదు. పదవీ గర్వం లేదు…పురస్కార వాంచ పుట్టుకతో లేదు. ఉన్నదంతా లక్ష్య సాధనే. అంపశయ్య లేదు… ఆసుపత్రి సూది మందు లేదు. జుట్టు చెదరలేదు…. నవ్వు ఆగలేదు. భవబందాలు లేవు…బయపడింది లేదు.

1931 అక్టోబరు 15న ఎక్కడో రామేశ్వరంలో పుట్టి ప్రపంచమంతా విహంగలా విహరించి, హిమాలయాలకన్న ఎత్తెదిగిన ఆ మహర్షి. మాటే మంత్రంగా… ఆదర్శమే జీవన పరమావదిగా సాగిన ఆ నడక మాయమయ్యింది. క్రమ శిక్షణకు ప్రాణంపోస్తే… అంకిత భావానికి బీజం వేస్తే… అలుపెరుగని యోధుని పయనం… వ్యక్తి శక్తిగా మారిన చరిత్ర… పేపర్ బాయ్ నుంచి మిస్సైల్ మ్యాన్ వరకు… రామేశ్వరం నుంచి రాష్ట్రపతి భవనం వరకు… ఎదిగిన మహోన్నత వ్యక్తిక్త్వం అబ్దుల్ కలాం సొంతం. అందుకే యువతకు ఆయన ఓ స్పూర్తి మంత్రం. ఆదర్శ భావాలకు నిలువెత్తు నిదర్శనం కలాం జీవితం. తన ప్రసంగాలతో ఉత్తేజ పరిచే మాటలతో ఎందరో విద్యార్థులకు స్ఫూర్తినిచ్చారు అబ్దుల్ కలాం. భారతదేశాన్ని శక్తిమంతం చేసేందుకు అభివృద్ధి ప్రణాళికలు సూచించారు. భారతదేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారమైన భారత రత్న సహా ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు కలాం సొంతమయ్యాయి.

దేశానికి కలలు కనటం నేర్పించారు, కష్టపడటం చూపించారు, దారి మార్చారు, మార్గాన్ని సృష్టించారు, రక్షణ కల్పించారు, ధైర్యం అందించారు, ముప్పుని అరికట్టారు, సామర్ధ్యాన్ని పెంపొందించారు, స్థాయిని పెంచారు, ఆనందపడేలా చేసారు.  నడకలు రాని దేశాన్ని పరుగులు పెట్టించారు, పదాలు రాని దేశంతో పద్యాలూ పాడించారు, నిలబడ లేని దేశాన్ని ఎగిరేల చేసారు. గమ్యం లేని దేశానికి మార్గమయ్యారు. ఈ రోజు ఆయన లేకపోవచ్చు గాక, కాని  చూపిన మార్గం, ఇచ్చిన స్పూర్తి, సాధించిన ప్రగతి, అనుభవించిన కష్టాలు, ఆచరించిన నియమాలు, అందించిన విజయాలు, పాటించిన పద్దతులు, నేలపై మొక్కలు నింగిలో చుక్కలు ఉన్నంతవరకు ఈ దేశంలో ప్రతి మనసులో మెదులుతూనే ఉంటాయి.

కలలు కనండి.. నిజం చేసుకోండి అంటూ పిల్లలకు, యువతకు అబ్దుల్ కలాం స్ఫూర్తినిచ్చారు. మిసైల్ మ్యాన్ కలాం ఎన్నో అవార్డులు, పురస్కారాలు అందుకున్నారు. భారతరత్న సహా కలాం ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 40 విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లు ఇచ్చాయి. అబ్దుల్ కలాం పిల్లలను బాగా ప్రేమించేవారు. చివరి నిమిషం వరకు పిల్లలతోనే గడిపారు. ఎప్పుడూ కలలు కనాలని, వాటిని సాకారం చేసుకోవాలని కలాం చెప్పేవారు. పిల్లలు, యువతతో కలిసిపోతారు. తన కెరీర్ తొలినాళ్లలో ఉపాధ్యాయుడిగా పని చేసిన అబ్దుల్ కలాం.. ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యాక 2001లో చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో టెక్నాలజీ, సొసైటల్ ట్రాన్ఫ్‌ఫర్మేషన్ ప్రొఫెసర్‌గా చేరారు. 2002 నుంచి రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ బాధ్యతల విరమించుకోగానే మళ్ళీ బోధనా వృత్తిని చేపట్టారు. విద్యార్థి లోకాన్ని, యువతను తన ప్రసంగాలు, రచనల ద్వారా వెన్నుతట్టి లేపారు. ప్రాథమిక స్థాయిలోనే ఉపాధ్యాయులు పిల్లల్లో సృజనాత్మకత తీసుకు రావడానికి మంచి సమయమని చెప్పేవారు. దేశంలో విశ్వవిద్యాలయ విద్యను సమూలంగా సంస్కరించాలని కలాం సూచించారు. ఉపాధ్యాయులు పిల్లలకు మార్గదర్శకులుగా ఉండాలని, ఆత్మ విశ్వాసం నింపాలని చెప్పేవారు. పిల్లలకు, యువతకే కాదు.. ఉపాధ్యాయులకూ మార్గదర్శకుడిగా నిలిచారు.

ప్రభుత్వాలను కదిలించారు. ప్రభుత్వ పథకాల్లో తన కలను భాగం చేశారు. అదే ‘పుర’ మిషన్‌. పూర్తిపేరు.. ప్రొవైడింగ్‌ అర్బన్‌ఎమినిటీస్‌ ఇన్‌ రూరల్‌ ఏరియా. దేశానికి తొలి బ్రహ్మచారి రాష్ట్రపతి. తొలి శాస్త్రవేత్త రాష్ట్రపతి. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని రాష్ట్రపతి. భారతరత్న పొందిన మూడో రాష్ట్రపతి. ఇవన్నీ కలాం ప్రత్యేకతలే. ఒక రాష్ట్రపతి ఎలా ఉండాలని ప్రజలు ఆశిస్తారో తన వేషభాషలు, నడవడిక, జీవనశైలి ద్వారా నిర్దిష్టంగా చేసి చూపారు. కలాం రాష్ట్రపతిగా భవన్‌కే పరిమితమై పోకుండా దేశమంతటా పర్యటిస్తూ, చిన్నారులు, యువత, శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు వంటి భిన్న వర్గాలను కలుస్తూ జనంలో మమేకమయ్యేవారు. భారత పురోగతికి, భవిష్యద్దర్శనానికి సంకేతమయ్యారు. రాష్ట్రపతి పదవి చేపట్టాక ఒకట్రెండు సూట్‌కేసులతో రాష్ట్రపతి భవన్‌కు వచ్చిన  కలాం.. మళ్లీ అంతే నిరాంబరంగా బయటికి సాగారు. కలాం కళా ప్రేమికుడు. నిత్య స్వాప్నికుడు. మహా దేశభక్తుడు. నిత్య విద్యార్థి. నిరాడంబరంగానే ఉండేవాడు. మీరు ఎవరు అని అడిగితే.. ‘నేను శాస్త్రవేత్తను. ఉపాధ్యాయుడిని, విద్యార్థిని అని మొదట చెప్పారు. ఆ తర్వాతే రాష్ట్రపతిగా పని చేశానని చెప్పేవారు. హైదరాబాదులో రెండు అద్భుతమైన వైద్య ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టి విజయవంతం చేశారు. అవి ఎందరో పేదల జీవితాల్లో వెలుగులు నింపాయి. ఇందులో అతి తక్కువ రకం కరోనరీ స్టంట్ ఒకటి అయితే, మరొకటి పోలియో రోగుల కోసం తయారు చేసిన తక్కువ బరువు పరికరం. 2002 జూలై 25 నుంచి 2007 వరకు రాష్టపతిగా ఉన్నారు. కలాం 11వ రాష్ట్రపతి.

విజేత, జగజ్జేత. నూరు కోట్ల భారతావని మదిని గెలిచిన మిసైల్ మ్యాన్. యువత ఆయనకు హారతులివ్వాలి. ఎందుకంటే ఆయన మలినం లేని మనీషి, కల్మషమెరుగని మహా ఋషి ఆయన చీమకు కూడా హాని తలపెట్టని పరమ సాత్వికుడు. మేళ తాళాలు, భాజా బజాయింపుల శబ్దాలలో ఆయన యువకుల గుండె చప్పుళ్ళనువినాలి. తనకు తెలిసిన విషయాలను తుది శ్వాస వరకూ పంచుకున్నారు.  గొప్ప లక్ష్యాలున్న యువకుల కళ్లలోకి వచ్చే కలలకి దశా దిశా నిర్దేశకుడతడు. తన రాకతో రాజకీయాలకు పాలాభిషేకం చేసిన మహత్ముడాయన. మోము పై చిరునవ్వును చెరగనివ్వని 83 యేళ్ళ పసిపిల్లాడాయన, దేశ సేవకు తన జీవితాన్నే గులాం చేసిన కలాం ఆయన. తాను చేసే పనిలోనే దైవాన్ని చూసుకున్న దేవుడాయన
రాజకీయేతర రాష్ట్రపతులుగా భరమాత ముద్దుబిడ్డలు ఇద్దరిలో.. తాత్వికవేత్త, విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ మొదటివారు కాగా.. శాస్త్రజ్ఞుడు, మానవతావాది డాక్టర్ ఏపిజె అబ్దుల్ కలాం ద్వితీయుడైన అద్వితీయుడు .. క్షిఫణి నిపుణుడుగా, శాస్త్రజ్ఞుడిగా, రాష్ట్రపతిగా…. ఆయన తపన మొత్తం యువత, దేశం పైనే.. .ఏరోజూ రాజకీయం – మతం మాటెత్తలేదు. “భారతరత్న” కు మిఒచి…. వీరిరువురే ఉత్తమ మానవరత్నాలు.. కలాం జన్మదినం ఇక నుంచి అంతర్జాతీయ విద్యార్థి దినం: ఐక్యరాజ్య సమితి ఘననివాళికి నిదర్శనం… నిస్వార్ధంగా, నిష్కలంకంగా, నిజాయితీగా… నిరంతరం క్రమశిక్షణతో జాతికోసం పరితపించారాయన. జనం గుండెల్లో ఆత్మీయునిగా కొలువైన ఆశాకిరణంగా వెలిగారు. యువతను సన్మార్గంలో పెట్టడానికి కలాం చూపించిన చొరవ వెలకట్టలేనిది. ఆ మహా నేత, ప్రజా రాష్రపతిగా… జాతికి ఇచ్చిన అమూల్యమైన మార్గదర్శకాలన్నీ జనహృదయాలలో సజీవంగానే గూడు కట్టుకునుంటాటాయి.

నేలమీది నుండి శాశ్వతంగా నింగికేగిన ఓ మహాక్షిపణి! కలలను ఎలా నిజం చేసుకోవాలో విద్యార్ధులకు, యువతరానికి జీవితాన్నే ఉదాహరణగా చూపి వాస్తవ జీవనశైలిని ఉపదేశించిన మహామహోపాధ్యాయుడు! మాతృభూమిని, దేశ జాతీయపతాకాన్ని అతర్జాతీయ స్థాయికి తీసుక వెళ్లిన  ప్రజ్ఞాశాలి! పరిశోధనా వేత్తగా, ప్రసిడెంట్ ఆఫ్ ఇండియాగా  ఒకే నిర్దేశిత శైలిలో జీవించిన తత్వజ్ఞాని! విశిష్ట విజ్ఞాన శాస్త్ర సంపదను అక్షరబద్ధం చేసి భావితరాలకు పరిజ్ఞాన సంపదను అందించిన మహారచయిత! ఆకులో ఆకుగా పువ్వులో పువ్వుగా.. పిల్లలలో పిల్లవాడిగా వారితో వోలలాడిన ఓ చిరంజీవి! పదవులు, బిరుదులు, పురస్కారాలు, సంపదలు, రాజసౌకర్యాలతో నిమిత్తం లేకుడా సాధరణంగా జీవితాన్ని సాగించిన నవీన బారత అభినవ భీష్మ పితామహ! ఆయన దారి అసలు సిసలైన రహదారి! అవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాంజీ! సలాంజీ!!  సైన్స్ కు మరో పేరు కలాం. ఆచంద్రార్కం ఆయన చిరంజీవి. గుండె గుండెలో ఆయనున్నారు- అదే ఈదేశానికి క్షిపణిబలం..

ఆయన నిత్య పాఠకుడు. అధ్యయనశీలి. జీవితకాలంలో వేలాది పుస్తకాలు చదివారు. అందులోంచి మూడు పుస్తకాలు మాత్రం తనను బాగా ప్రభావితం చేశాయని చెప్పేవారు. అందులో మొదటి పుస్తకం “లైట్ ఫ్రం మనీ ల్యాంప్స్” దీన్ని ఎడిట్ చేసింది లిలియన్ ఈష్లర్ వాట్సన్. రెండో పుస్తకం రెండువేల సంవత్సరాల క్రితం తిరువళ్లువార్ రాసిన తిరుక్కురల్. తమిళ సాహిత్యంలో అగ్రస్థానం ఆక్రమించిన ఈ పుస్తకంలో 1,330 శ్లోకాలు (కురల్స్) వున్నాయి. మూడో పుస్తకం “మ్యాన్ ద అన్ నోన్”. సుప్రసిద్ధ వైద్యుడు,రచయిత, నోబుల్ బహుమతి గ్రహీత అలెగ్జిస్ కలెర్. ఇందులో  మానవ దేహం గురించి సవివరంగా రాసి వుంటుంది. వైద్య విద్య అభ్యసించే వారు ఖచ్చితంగా చదవాల్సిన పుస్తకం అని చెప్తారాయన. ఈ మూడు కాకుండా, వేదాలు, భగవద్గీత, ఖురాన్ కూడా వివిధ సందర్భాల్లో తను సరైన నిర్ణయాన్ని తీసుకునేలా ప్రభావితం చేశాయని చెప్తారాయన, కవిత్వాన్ని కూడా విపరీతంగా ప్రేమించే వారాయన.

2015న జులై 27న షిల్లాంగ్‌కు వెళ్తున్నా అంటూ చివరిసారిగా ట్వీట్‌చేసిన అబ్దుల్‌కలాం.. అక్కడి విద్యార్థులతో మాట్లాడుతూనే.. అటునుంచి అంటే తిరిగి రాని లోకాలకు తరలిపోయారు.  దేశవ్యాప్తంగా కలాం అభిమానులు, అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు.  దేశం ఓ మహోన్నత వ్యక్తిని కోల్పోయింది. భారత దేశ కీర్తి కిరీటాన్ని ప్రపంచానికి చాటిన ఆ మేధావి ఇకలేరు. దార్శనికతకు దారి చూపిన ఆ గుండె ఆగిపోయింది. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కన్ను మూశారు.శాస్త్ర సాంకేతిక ప్రగతిని నలు దిశలా వ్యాపింపజేసిన ఆ స్వరం మూగబోయింది.కలాం మృతితో… ఆయన స్వస్థలమైన తమిళనాడులోని రామేశ్వరంతోపాటు… యావత్ భారత దేశం కన్నీటి సంద్రమయింది.

-నందిరాజు రాధాకృష్ణ 

Leave a Reply