సామాజిక మాధ్యమాల్లో చెడుని ప్రచారం చేయొద్దు – మోదీ

Share Icons:

కొత్త ఢిల్లీ, ఆగష్టు 29,

సామాజిక మాధ్యమాల్లో చెడుని ప్రచారం చేయొద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ప్రజలను కోరారు. ఉత్తర్‌ప్రదేశ్‌ వారణాశిలోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో ఈ రోజు ఆయన వీడియో సంభాషణలో పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాల ప్రభావం గురించి ప్రస్తావించారు. ‘సామాజిక మాధ్యమాల్లో చెడుని ప్రచారం చేయకుండా ప్రజలు జాగ్రత్త పడాలి. వాటి ద్వారా ఎన్నో మంచి విషయాలను ప్రచారం చేయవచ్చు. కొన్నిసార్లు సామాజిక మాధ్యమాల్లో హద్దులు మీరి పోస్టులు చేస్తున్నారు. దీంతో చాలా మంది అసత్యాలను వింటున్నారు, చూస్తున్నారు. అంతేగాక, వాటిని మరికొందరికి చేరేలా ప్రజలు షేర్‌ చేస్తున్నారు. వాటి వల్ల సమాజానికి తాము ఎంత నష్టం కలిగిస్తున్నామనే విషయాన్ని వారు గుర్తించడం లేదు. సభ్య సమాజంలో ఉపయోగించకూడని పదాలను వాడుతూ కొందరు పోస్టులు చేస్తున్నారు’ అని మోదీ వ్యాఖ్యానించారు.

ఇవి ఏ రాజకీయ పార్టీకో, కొందరి భావజాలాలకో సంబంధించిన సమస్యలు కావని ఆయన అన్నారు. దేశంలోని ప్రజలందరూ అవగాహనతో మెలిగి చెడు విషయాలను ప్రచారం చేయకుండా, మంచిని మాత్రమే అందరితోనూ పంచుకోవాలని పిలుపునిచ్చారు.తమ కార్యకర్తలను ఉద్దేశించి మోదీ మాట్లాడుతూ… సామాజిక మాధ్యమాల్లో చెడు పదజాలాన్ని ఉపయోగిస్తూ పోస్టులు చేస్తే భాజపా ప్రత్యర్థి పార్టీలు వాటి ఆధారంగా విమర్శలు చేస్తాయని అన్నారు. తమకు నచ్చని వారిపై భాజపా తీరు ఈ విధంగా ఉంటుందంటూ ఆరోపణలు చేసే అవకాశం ఉందని చెప్పారు. అభివృద్ధి పనులకు సంబంధించిన వీడియోలను షేర్‌ చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

భారత్‌లోని అన్ని గ్రామాల్లో ఇప్పుడు విద్యుత్‌ సౌకర్యం ఉందని, పాఠశాలలు చిన్నారులందరికీ అందుబాటులో ఉన్నాయని చెప్పారు. మొబైల్‌ ఫోన్‌ల తయారీ అత్యధికంగా జరుగుతోన్న దేశంగా భారత్ ఉందని చెప్పారు. ఈ అభివృద్ధి పనులు ప్రతి భారతీయుడు గర్వపడేలా చేస్తాయని అన్నారు. తాము ప్రారంభించిన ‘ఆయుష్మాన్‌ భారత్‌’ వల్ల 10 కోట్ల కుటుంబాలు లబ్ధిపొందుతాయని చెప్పారు. అలాగే, వచ్చే నెల 15 నుంచి అక్టోబరు 2 వరకు నిర్వహించనున్న ‘స్వచ్ఛతా హీ సేవా’ కార్యక్రమంలో అందరూ పాల్గొని సహకరించాలని ఆయన కోరారు.

మామాట: మంచిమాటలు వింటున్నారా

Leave a Reply