డిఎంకే అధ్యక్షుడుగా స్టాలిన్

Share Icons:

చెన్నయ్. ఆగస్టు 28,

ద్రవిడ ఉద్యమనేత కరుణానిధి కనుమరగైన నేపథ్యంలో డీఎంకేలో నూతన శకం ప్రారంభమైంది. పార్టీ అధినేతగా స్టాలిన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కరుణానిధి మరణంతో ఖాళీ అయిన పార్టీ అధ్యక్ష పదవికి ఆయన చిన్న కుమారుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ ను డీఎంకే నేతలు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం వద్ద సందడి నెలకొంది. కరుణ మరణం తర్వాత శోకసంద్రంలో మునిగిన పార్టీ కార్యాలయం, మంగళవారం మళ్లీ ఈరోజు పండుగ శోభను సంతరించుకుంది.

మరోవైపు, పార్టీలో తనను చేర్చుకోవాలని, లేకపోతే తన సత్తా ఏంటో చూపిస్తానని స్టాలిన్  సోదరుడు అళగిరి హెచ్చరిస్తు న్నప్పటికీ… పార్టీ నేతలు ఎవరూ ఆయనను పట్టించుకోవడం లేదు. పార్టీ సీనియర్ నేత దురైమురుగన్ పార్టీ ట్రెజరర్ గా బాధ్యతలను చేపట్టనున్నారు. ఇప్పటిదాకా ఈ బాధ్యతలను కూడా స్టాలినే నిర్వహించారు. పార్టీ అధినేతగా ఎన్నికైన స్టాలిన్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తండ్రి కరుణ సారథ్యంలో ఇంతకాలం పార్టీని నడిపిన స్టాలిన్ ఇకపై స్వంతంగా నిర్వహనచేపట్టవలసి ఉంటుంది.

గత కొంత కాలంగా కరుణ స్వయంగా పార్టీ పనులు చూడకున్నా, నాన్న ఉన్నారనే ధీమా ఒకటి ఉండేది. ఇపుడు ఆ అండలేక పోగా, అన్న అళగిరి రూపంలో పొగపెట్టే వారు పెరగవచ్చు. కాకపోతే అటు జయలలితను కోల్పోయిన అన్నాడీఎంకే కూడా చుక్కాని లేని నావలాగా పయనిస్తోంది.. తమిళనాడులో ఇపుడు అంతో ఇంతో సంస్థాగతంగా పటిష్టంగా ఉంది డిఎంకేనే.. చూడాలి ఈ బిగువు వచ్చే ఎన్నికల వరకూ స్టాలిన్ నిలుపుకోగలరా… ఏమైనా స్టాలిన్ ప్రయాణం  నల్లేరుపైనడక కాబోదు.

మామాట: డిఎంకే కొత్త దళపతికి అభినందనలు

Leave a Reply