అరుణ విందు రాజకీయాలు

Share Icons:

మహబూబ్ నగర్, జనవరి 9,

తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో ఓటమితో ఢీలా పడింది కాంగ్రెస్ పార్టీ. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ సారథ్యంలో ఏర్పాటైన ప్రజాకూటమికి రాష్ట్ర ప్రజలు షాక్ ఇచ్చారు. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన కూటమి కేవలం 21 నియోజకవర్గాల్లోనే విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలోని చాలా మంది సీనియర్లు ఘోరంగా ఓడిపోయారు. ఆ పార్టీలోనే ముఖ్యమంత్రి రేసులో ఉన్నామని చెప్పుకున్న జానారెడ్డి, డీకే అరుణ, పొన్నాల లక్ష్మయ్య, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, షబ్బీర్ అలీ, జీవన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, సంపత్ కుమార్‌, కొండా సురేఖ, సర్వే సత్యనారాయణ సహా పలువురు ఓటమి పాలయ్యారు. దీంతో తెలంగాణ కార్యవర్గాన్ని మార్చాల్సిన అవసరం ఉందని చాలా మంది నేతలు కామెంట్లు చేస్తున్నారు.

ఇక సర్వే సత్యనారాయణ అయితే, ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్‌ ఇంచార్జ్‌ కుంతియాలే కారణమని ఆరోపించారు. ఓటమి కారకులే మళ్లీ ఓటమిపై సమీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉత్తమ్‌, కుంతియాల వల్ల తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేదని అన్నారు. దీంతో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసేశారు. ఇది హైకమాండ్ దృష్టికి వెళ్లింది. కాంగ్రెస్ పార్టీలోని ఓ వర్గం తెలంగాణలో నాయకత్వ మార్పు జరగాల్సిందేనని అధిష్ఠానానికి కంప్లైంట్ చేశారనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో ఓటమికి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలేనని, ఆయనకు కమిటీలోని పలువురు నాయకులు వంత పాడడం వల్లే నష్టం జరిగిపోయిందని రాహుల్‌కు సమాచారం అందించారని తెలిసింది.

ఇలాంటి సందర్భంలో తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నేత చేసిన పని వల్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముందస్తు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారిలో ఒకరైన డీకే అరుణ ఆదివారం గండిపేటలో విందు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పార్టీకి చెందిన చాలా మంది నాయకులు హాజరయ్యారు. ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడి మార్పు జరగాలన్న డిమాండ్ వినిపిస్తున్న తరుణంలో అరుణ ఇలా అందరినీ ఏకం చేయడం చర్చనీయాంశం అయింది. ఇలా అందరు నేతలను కలపడం వల్ల తన బలం నిరూపించుకోవడంతో పాటు, పీసీసీ అధ్యక్ష రేసులో తానున్నానని పరోక్షంగా సంకేతాలు పంపినట్టు అందరికీ అర్థమవుతోంది. కానీ, అరుణ మాత్రం అందరినీ కలపాలన్న ఉద్దేశంతోనే విందు ఏర్పాటు చేశానని చెబుతున్నారు.

మామాట: విందులు ఓట్లు కురిపిస్తయా తల్లీ…  

Leave a Reply