దిశ కేసు: ‘ఎన్‌హెచ్‌ఆర్‌సి’కి కీలక ఆధారాలు ఇచ్చిన పోలీసులు

Share Icons:

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసులో చటాన్ పల్లి ఎన్ కౌంటర్ లో మరణించిన నలుగురు నిందితుల మృత దేహాలు గాంధీ ఆసుపత్రికి చేరాయి. దిశ అత్యాచార ఘటన అనంతరం జరిగిన ఎన్ కౌంటర్ లో నిందితులు నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. పలు సందేహాలను తెరపైకి తెచ్చిన ఈ ఎన్ కౌంటర్ పై  ఓవైపు జాతీయ మానవ హక్కుల కమిషన్, మరోవైపు తెలంగాణ హైకోర్టు విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే దిశ ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘానికి హైదరాబాద్ పోలీసులు నివేదిక అందించారు. దిశ అపహరణ, అత్యాచారం, మృతదేహం కాల్చివేత వివరాలను నివేదికలో తెలిపారు. ఈ కేసులో కీలకమైన ఆధారాలను ఎన్‌హెచ్చ్‌ఆర్సీకి అందజేసిన నివేదికలో పొందుపర్చినట్లు తెలుస్తోంది. అలాగే, ఇదే కేసులో నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ లో కాల్చిచంపిన విషయం తెలిసిందే. వారు పారిపోయేందుకు ప్రయత్నించడంతోనే తాము కాల్పులు జరిపామని వారు అంటున్నారు. అయితే, దీనిపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్‌కౌంటర్‌పై సిట్‌ బృందం విచారణ జరుపుతోంది. రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ నేతృత్వంలో క్షేత్రస్థాయిలో సిట్‌ సభ్యుల బృందం దర్యాప్తు ప్రారంభించింది.

అటు ఎన్‌కౌంటర్‌లో హతమైన ప్రధాన నిందితుడు మహ్మద్ ఆరిఫ్ వయసు 26 ఏళ్లు అని, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవుల వయసు 20 ఏళ్లని విలేకరుల సమావేశంలో పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. అయితే, పోలీసులు చెబుతున్నట్టు దాంట్లో నిజం లేదని, నిందితుల్లో ఇద్దరు మైనర్లని వారి పుట్టిన రోజు తేదీలను బట్టి తెలుస్తోంది. ఇదే విషయాన్ని వారి తల్లిదండ్రులు మానవ హక్కుల సంఘం విచారణ బృందానికి తెలియజేసినట్టు సమాచారం. మైనర్లని కూడా చూడకుండా తమ కొడుకులను ఎన్‌కౌంటర్ చేశారని నిందితుల తల్లిదండ్రులు ప్రశ్నించినట్టు తెలుస్తోంది.

ఈ మేరకు నిందితుల ఆధార్ కార్డులు, పాఠశాల బోనఫైడ్ సర్టిఫికెట్లను అధికారులు సేకరించారు. వాటి ప్రకారం ఓ నిందితుడి పుట్టిన రోజు ఆగస్టు 15, 2002. దాని ప్రకారం అతడి వయసు 17 సంవత్సరాల ఆరు నెలలు. అయితే, ఆధార్‌కార్డులో మాత్రం 2001గా నమోదైంది. మరో నిందితుడి పుట్టిన తేదీ ధ్రువపత్రంలో 10 ఏప్రిల్ 2004గా ఉంది. అంటే అతడి వయసు 15 సంవత్సరాల 8 నెలలు మాత్రమే. దీంతో నిందితుల వయసుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

 

Leave a Reply