దిశ కేసు: లోక్ సభలో తెలంగాణ ఎంపీల ఆవేదన..కన్నీరు పెట్టుకున్న ఉదయభాను

revanth reddy fires on kcr govt in the issue of disha case
Share Icons:

హైదరాబాద్: శంషాబాద్ పశువైద్యురాలి దిశ అత్యాచారం, హత్య కేసుపై ఈరోజు పార్లమెంట్ లో తీవ్ర చర్చ జరిగింది. మొదట రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందిస్తూ… మహిళలపై దాడులకు స్వస్తి పలకాల్సిన అవసరముందని ఆయన వ్యాఖ్యానించారు. కేవలం చట్టాలు చేసినంత మాత్రాన బాధితులకు న్యాయం జరగదని చెప్పారు.  ‘ఇప్పుడు కొత్త బిల్లు తీసుకురావడం కాదు.. ఇటువంటి దాడులను అరికట్టాలన్న రాజకీయ సంకల్పం మనకు కావాలని అన్నారు.

అటు సమాజ్ వాదీ పార్టీ సభ్యురాలు జయా బచ్చన్, తీవ్ర ఆగ్రహంతో మాట్లాడారు. “ఇటువంటి కామాంధులను ప్రజలకు అప్పగించాలి. అప్పుడు ప్రజలే వారిపై మూకదాడి చేసి చంపేస్తారు. జరుగుతున్న ఘోరాలపై ప్రభుత్వం సరైన సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చింది. ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారు” అని ఆమె అన్నారు.

ఇక దీనిపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… దిశ ఘటనలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనపడుతోందని, ఇటువంటి కేసుల్లో విచారణలు సంవత్సరాల తరబడి జరుగుతున్నాయని చెప్పారు.ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లోనూ ఇటువంటి ఘటనల్లో విచారణలు జరుగుతూనే ఉన్నాయన్నారు. అయితే, హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటనపై మాత్రమే స్పందించాలని రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో జరిగిన వాటిపై మాట్లాడడం ఎందుకని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నించారు. ప్రసంగాన్ని ముగించాలని సూచించారు. దీంతో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘మోదీజీ మన్ కీ బాత్ లో చెప్పారు’ అంటూ ఏదో చెప్పబోయారు.. దీంతో రేవంత్ రెడ్డిని ఇక మాట్లాడవద్దని సూచిస్తూ ఓం బిర్లా మరో సభ్యుడికి దిశ ఘటనపై మాట్లాడే అవకాశం ఇచ్చారు.

దిశను అత్యంత కిరాతకంగా హత్య చేశారని లోక్ సభలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దిశ ఘటనపై లోక్ సభలో చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ… హైదరాబాద్ కు కూతవేటు దూరంలో దిశ హత్య జరిగిందని అన్నారు. కేసు నమోదుకు బాధితురాలి కుటుంబ సభ్యులు పలు పోలీస్ స్టేషన్లు తిరగాల్సి వచ్చిందని చెప్పారు. మొదట వారు ఓ పోలీస్ స్టేషన్ కు వెళితే మరో స్టేషన్ కు వెళ్లాలని చెప్పారని తెలిపారు.

ఇక దిశ ఘటనపై ప్రముఖ యాంకర్ ఉదయ భాను స్పందించారు. ఈ ఘోర ఘటన జరిగినప్పటి నుంచి తన వెన్నులో వణుకు పుడుతోందని అన్నారు. టీవీ 9కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఉద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. దిశ ఘటనపై సోషల్ మీడియాలో కొందరు విషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఉదయభాను ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి వారు చీడపురుగులాంటి వారని వ్యాఖ్యానించారు. రాత్రి పూట తోపులాగ ఒంటరిగా వెళ్లే అమ్మాయిలకు ఇలాగే అవ్వాలంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి వారిని తుపాకీతో కాల్చి పడేయాలని అన్నారు.

 

Leave a Reply