TRENDING NOW

త్వరలో డిజిటల్ అడ్మినిస్ట్రేషన్

త్వరలో డిజిటల్ అడ్మినిస్ట్రేషన్

త్వరలో డిజిటల్ అడ్మినిస్ట్రేషన్

హైద‌రాబాద్‌, ఫిబ్ర‌వ‌రి 13ః

ఇకపై అంతా అర చేతిలోనే. సమస్త వివరాలు మొబైల్ ఫోన్లోనే. పరిపాలనా పరమైన సమగ్ర సమాచారాన్ని ఒకేచోట క్రోడీకరించి ఓ డాష్ బోర్డు వ్యవస్థను ఏర్పాటు చేసే బృహత్తర ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

పనిలో పనిగా సచివాలయంలో ఓ కంట్రోల్ రూం ఏర్పాటుకు సైతం కార్యాచరణ రూపొందుతోంది.

ఐఐటీలో ఎలెక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ చేసిన చీఫ్ సెక్రెటరీ జోషి తన అభిరుచులకు పదును పెడుతున్నారు.

సమాచార సాంకేతిక విప్లవానికి అనుగుణంగా పరిపాలనా వ్యవస్థను పటిష్టం చేసే దిశలో ఆయన అడుగులేస్తున్నారు.

మోడ్రన్ డిజిటల్ అడ్మినిస్ట్రేషన్ కు బాటలు వేసి పరిపాలనపై తనదైన సరికొత్త ముద్ర వేయనున్నారు. ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించేందుకు ఆధునిక పోకడలను అనుసరించనున్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కేజోషి సంస్కరణల వైపు వడివడిగా అడుగులేస్తున్నారు.

రాష్ట్ర భౌగోళిక స్థితిగతులు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ఇతర పథకాలు వాటి సమగ్ర సమాచారం తదితర పూర్తి వివరాలు ఒకే చోట అందుబాటులో ఉండేలా సమీకృత పాలనా పర్యవేక్షణ వ్యవస్థ రూపకల్పనకు నడుంబిగిస్తున్నారు.

రాష్ట్రంలోని వివిధ రకాల నెట్ వర్క్ లను అనుసంధానం చేస్తూ ఓ ఇన్ఫర్మేషన్ డాష్ బోర్డును ఏర్పాటు చేస్తున్నారు.

ఆ దిశలో తొలి అడుగ్గా అధికారులు వివిధ శాఖల్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న డేటా బేస్ ను క్రోడీకరించే ప్రయత్నాలు మొదలుపెట్టారు.

ఇక సచివాలయంలో ఓ కంట్రోల్ రూంను కూడా ఏర్పాటు చేసి పరిపాలనను ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు.

ఇందుకు అనుగుణంగా సీఎస్ నుంచి జిల్లా కలెక్టర్, ఇతర జిల్లాస్థాయి అధికారుల వరకు ప్రతి ఒక్కరినీ ఈ డిజిటల్ డాష్ బోర్డుతో అనుసంధానం చేయనున్నారు.

దీంతో పాటు ప్రభుత్వ ఫైళ్లు, ప్రజల సమస్యల ఉత్తర ప్రత్యుత్తరాల సమాచారాన్ని కూడా ఎప్పటికప్పుడు తెలుసుకునేలా కొత్తగా ఫైల్ ట్రాకింగ్ సిస్టంను ప్రవేశపెట్టనున్నారు.

వివిధ ఫైళ్ల ప్రస్తుత స్థితి ఏంటి, అవి ఏ అధికారి దగ్గర ఉన్నాయి, ఎన్ని రోజులుగా పెండింగ్లో ఉన్నాయన్న విషయాలను తెలుసుకునేలా ఈ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు.

ఉత్తర, ప్రత్యుత్తరాలు, వినతులకు సంబంధించి కూడా ఈ తరహా విధానాన్నే అవలంభించాలని అధికారులు భావిస్తున్నారు.

తద్వారా ప్రభుత్వ యంత్రాంగాన్ని మరింత సమర్థంగా వినియోగించుకుంటూ సత్వర ఫలితాలు రాబట్టలనేది ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఆలోచన.

ఓ పకడ్బందీ సమీకృత పాలనా పర్యవేక్షణ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, గ్రామాల సమాచారం, వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పూర్తి వివరాలు ఒకేచోట అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతున్నారు.

మరోవైపు సచివాలయంలో ఓ కంట్రోల్ రూంను ఏర్పాటు చేసేందుకు కూడా జీఏడీ అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.

అత్యవసర, విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తన ఛాంబర్లోనే కూచుని డిజిటల్ స్క్రీన్ ద్వారా పరిస్థితిని పర్యవేక్షించే వెసులుబాటు కల్పించనున్నారు.

పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను కూడా దీంతో అనుసంధనం చేయనున్నారు.

నిరంతర పర్యవేక్షణ కోసం సీఎస్ ఛాంబర్లో డిజిటల్ స్క్రీన్

తద్వారా శాంతి భద్రతల పరిస్థితులను సైతం ఆయన స్వయంగా పర్యవేక్షించే ఏర్పాటు చేస్తున్నారు.

రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ, విధ్వంసకర సంఘటనలు చోటు చేసుకున్నా ఈ కమాండ్ కంట్రోల్ రూంలోని సీసీ కెమెరాల ద్వారా సీఎస్ కూడా మానిటర్ చేసే సౌకర్యాన్ని కల్పించనున్నారు.

ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి అధర్ సిన్హా ఇప్పటికే హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ ను పరిశీలించారు.

అక్కడ నెట్ వర్క్ ను అనుసంధానం చేసిన తీరుపై చర్చించారు.

సమీకృత పాలనా పర్యవేక్షణ వ్యవస్థలో సీఎస్ తో సహా ఇతర ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, సచివాలయ ముఖ్యమైన అధికారులు, హెచ్ఓడీలు, 31 జిల్లాల కలెక్టర్లు, వివిధ జిల్లాస్థాయి అధికారులను కూడా అనుసంధానం చేస్తారు.

అధికారులకు స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ వెసులుబాటు

ఇందుకోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మొదలుకొని జిల్లాస్థాయి అధికారుల వరకు ప్రత్యేకంగా స్మార్ట్ ఫోన్లు, కొత్త మొబైల్ నెంబర్లను ఇవ్వనున్నారు. వాళ్లకు ఇంటర్నెట్ సదుపాయం కూడా కల్పించనున్నారు.

ఒకవేళ సంబంధిత అధికారి అక్కడి నుంచి బదిలీ అయినా, ఆ బాధ్యతలు నిర్వర్తించే కొత్త అధికారి దగ్గర సంబంధిత మొబైల్ నెంబర్ అలాగే ఉంటుంది.

తరచూ మొబైల్ నెంబర్లు మారి, ప్రజాసేవకు ఆటంకం కలగకుండా ఈ చర్యలు తీసుకుంటున్నారు. ఆ దిశలో ఐడియా నెట్ వర్క్ కు చెందిన కొత్త సిమ్ కార్డులను అధికారులకు అందించనున్నారు.

7997959 సీరిస్ తో మొదలయ్యే ఈ మొబైల్ నెంబర్లను వివిధ స్థాయిల్లోని ప్రభుత్వ అధికారులకు వాళ్ళ హోదాలను అనిసరించి డిస్ట్రిబ్యూట్ చేయనున్నట్లు సమాచారం.

ఈ నెంబర్లన్నిటినీ ఇంటర్నెట్ ద్వారా కంట్రోల్ రూంకు అటాచ్ చేయనున్నారు.

సీఎస్ నుంచి జిల్లాస్థాయి వరకు ప్రతి ఒక్క అధికారికి, ఒక యూనిక్ ఐడీ, పాస్ వర్డ్ ను ఇవనున్నారు.

అలా సమీకృత సమాచార వ్యవస్థకు లింకై, సంబంధిత అధికారులు కొత్త వివరాలను డేటా బేస్ లో నమోదు చేయడమే కాకుండా, వాళ్లకు అవసరమైన సమాచారాన్ని కూడా అక్కణ్ణుంచి సేకరించే విధంగా పక్కా ప్రణాళికను రూపొందిస్తున్నారు.

మొన్నటిదాకా నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న జోషి అక్కడ కూడా ఈ తరహా విధానాన్ని ప్రవేశపెట్టారు.

ఫైళ్ళన్నిటికీ ఓ నిర్దిష్టమైన బార్ కోడ్ ఇచ్చి విన్నూత్న పద్ధతులను అవలంభించే ప్రయత్నం చేశారు.

ఫైల్ స్టేటస్ తెలుసుకొని దాన్ని శాఖల మధ్య మరింత వేగవంతంగా కదిలించేందుకు ఫైల్ ట్రాకింగ్ సిస్టంను ప్రయోగాత్మకంగా మొదలుపెట్టారు.

అయితే కేవలం నీటి పారుదల శాఖ ఒక్కదానికే అప్పట్లో ఆ ప్రయోగం పరిమితం కావడంతో అది అనుకున్నంత ఫలితాల్ని ఇవ్వలేదు.

దీంతో అప్పటి ఆ విధానానికి మరిన్ని మెరుగులు దిద్ది, డిజిటల్ నెట్ వర్క్ తో అన్ని శాఖలను అనుసంధానం చేసి ఓ సమర్థవంతమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని సీఎస్ ఎస్కే జోషి కంకణం కట్టుకున్నారు.

వీలైనంత త్వరగా ఈ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆయన సంకల్పించారు.

అన్నీ అనుకున్నట్లు జరిగితే రాబోయే రోజుల్లో ప్రభుత్వ పాలనలో కొన్ని విప్లవాత్మక మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు సచివాలయ అధికారులు.

మామాటః డిజిట‌లైజేష‌న్‌తో అన్ని క‌ష్టాలు తీరుతాయా?

 

English Summery: Chief Secretary of Telangana Government S.K.Joshi is punting the administration in digital way. File transfer would be digital in coming days.

(Visited 26 times)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: