అయోధ్య తీర్పుపై భిన్నాభిప్రాయాలు: తర్వాత ఏం జరగబోతుంది?

different opinions on ayodhya verdict
Share Icons:

ఢిల్లీ: ఎన్నో దశాబ్దాల పాటు పరిష్కారం లేని సమస్యగా మిగిలిపోయిన అయోధ్య కేసు విషయంలో నేడు తుది తీర్పు వచ్చిన విషయం తెలిసిందే. యావత్‌ దేశం ఉత్కంఠగా ఎదురుచూసిన ఈ తీర్పుపై జస్టిస్ రంజన్ గొగొయ్ నేత్రుత్వంలోని జస్టిస్ఎస్.ఎ.బోబ్డే, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ అబ్దుల్ నజీర్‌‌లతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవ తీర్పును వెల్లడించింది. మొత్తం ఐదు ఎన్వలప్స్‌లో తీర్పు కాపీలను పొందుపరచగా.. దాని సారాంశాన్ని జస్టిస్ రంజన్ గొగొయ్ దాదాపు అరగంట పాటు చదివి వినిపించారు.

వివాదాస్పద స్థలమైన 2.77 ఎకరాల భూమి రామజన్మభూమి న్యాస్‌కే చెందుతుందని సుప్రీం స్పష్టం చేసింది.రామ మందిర నిర్మాణం కోసం మూడు నెలల్లో అయోధ్య ట్రస్టు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది.వివాదాస్పద స్థలం తమదేనని ముస్లిం సంస్థలు నిరూపించుకోలేకపోయానని సుప్రీం తెలిపింది. మసీదు నిర్మాణం కోసం ప్రత్యామ్నాయంగా ఐదెకరాల స్థలాన్ని కేటాయించాలని కేంద్రాన్ని ఆదేశించింది.

అయితే ఈ తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొదట దీనిపై ప్రధాన మంత్రి మోడీ స్పందిస్తూ… ఈ నిర్ణయాన్ని ఎవరి విజయం లేదా ఓటమిగా చూడకూడదు. ఇది రామభక్తి అయినా, రహీమ్ భక్తి అయినా.. మనమంతా దేశ భక్తి అనే స్ఫూర్తిని బలోపేతం చేసే సమయం ఇది. శాంతి, సామరస్యం , ఐక్యతను కాపాడుకోవాలని దేశవాసులకు నా విజ్ఞప్తి’ అంటూ మోదీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.  అన్ని సమాజాలు మరియు మతాల ప్రజలు ఈ నిర్ణయాన్ని అంగీకరించాలన్నారు. శాంతి మరియు సామరస్యంతో నిండిన ‘ఏక్ భారత్-శ్రేష్ట భారత్’ ప్రతిజ్ఞకు కట్టుబడి ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.

అటు అయోధ్య తీర్పుపై సున్నీ వక్ఫ్ బోర్డు అసంతృప్తి వ్యక్తం చేసింది. సుప్రీం తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేశారు సున్నీ వక్ఫ్ బోర్డ్ లాయర్ జాఫర్‌యాబ్ జిలాని. కానీ అత్యున్నత న్యాయస్థానం తీర్పును గౌరవిస్తున్నామన్నారు.  సుప్రీం ఇచ్చిన ఐదు ఎకరాల భూమి మాకు అత్యంత ముఖ్యమైనది కాదన్నారు. తీర్పులో అనేక అంశాలు ఉన్నాయన్నారు. శాంతి నెలకొనాలని అంతా కోరుకుంటున్నామన్నారు. తీర్పులో ప్రతీ అంశాన్ని వ్యతిరేకించడం లేదు కానీ.. కొన్ని అంశాలపై మాకు అభ్యంతరాలు ఉన్నాయన్నారు. కోర్టు తీర్పుపై రివ్యూకు వెళ్లే అంశాన్ని  అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే ఈ అంశంపై ఎలాంటి ప్రదర్శనలు చేయమని స్పష్టం చేశారు.

అసదుద్దీన్ స్పందన

సుప్రీంకోర్టు వెల్లడించిన తీర్పుపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఈ తీర్పు పట్ల తాను సంతృప్తి వ్యక్తం చేసే స్థితిలో లేనని అన్నారు. సుప్రీంకోర్టు నిజంగా అత్యున్నతమైనదేనని, అయితే, పొరపాటుపడనిది కాదని వ్యాఖ్యానించారు. తమకు రాజ్యాంగంపై పూర్తి నమ్మకం ఉందని, తాము తమ హక్కులపై పోరాటం చేశామని చెప్పారు. విరాళంగా తమకు ఐదు ఎకరాల భూమి అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఈ భూమిని తాము తిరస్కరించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.

యోగా గురువు రాందేవ్‌ బాబా, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్‌) చీఫ్‌ మోహన్‌ భగవత్‌ స్పందించారు. ‘సుప్రీం తీర్పు చారిత్రాత్మకం. మతాలు వేరైనా మనమంతా రాముడి వారసులమే. ఇక అయోధ్య వివాదాలన్నీ పరిష్కారమైనట్లే. దేశంలో శాంతి కొనసాగాలి. శాంతి, సామరస్యాలు నెలకొనేలా మీడియా వ్యవహరించాలి. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి హిందువులకు ముస్లింలు సహకరించాలి’ అని రాందేవ్ బాబా అన్నారు.

మోహన్‌ భగవత్‌ స్పందిస్తూ.. ‘అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పు ఏ ఒక్కరి విజయమో, ఓటమో కాదు. ప్రతి ఒక్కరూ శాంతి, సంయమనంతో వ్యవహరించాలి. మసీదు, మందిరం పక్కనే ఉన్నా ఎలాంటి సమస్య ఉండబోదు. దేశ అత్యున్నత న్యాయస్థాన తీర్పును అనుసరిస్తాం. భారతీయులను హిందు, ముస్లింలు అంటూ రెండు వర్గాలుగా చూడబోము’ అని తెలిపారు.

 

Leave a Reply