తసమదీయులపై దర్యాప్తు – జప్తు లీలలు

Share Icons:

ఎప్పటి కెయ్యది ప్రస్తుత
మప్పటి కా మాటలాడి యన్యుల మనముల్
నొప్పింపక తా నొవ్వక
తప్పించుక తిరుఁగువాఁడు ధన్యుఁడు సుమతీ!

భావం: ఏ సమయమునకు ఏది తగినదో, అప్పటికి ఆ మాటలడి, ఇతరుల మనస్సులు నొప్పింపక, తాను బాధపదక, తప్పించుకొని నడచుకొనువాడే ధన్యుడు. అని మనం చిన్నతనంలో సుమతీ శతకంలో చదువుకునే ఉంటాం. కానీ కొన్ని ప్రభుత్వ విభాగాల వారు ముఖ్యంగా నేర విచక్షణ చేయవలసిన వారు ఈపద్యంలోని మూడవ పాదం మరచిపోయి నట్టున్నది. మిగితా అంతా చక్కగా జ్ఞాపకముంచుకుని ఆచరిస్తున్నారు.

[pinpoll id=”60015″]

 

దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కుమారుడు, ప్రస్తుత ప్రతిపక్షనేత జగన్ పై దాదాపు 11 కేసులు నడుస్తున్నాయి. వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు జగన్ పై ఎటువంటి కేసులూ లేవు. ఆయన ఆకాల మృతితో జగన్ కు కాంగ్రెస్ పార్టీకి మధ్య చెడింది. వెంటనే జగన్ పై అవినీతి ఆరోపనలలో ఫిర్యాదులు రావడం, దర్యాప్తు జరగడం వేగంగా జరిగిపోయాయి. ఆ సందర్భంగా జగన్ పై నమోదైన కేసులు ఇప్పటికీ ఓ కొలిక్కి రాకుండా, సాగుతున్న విషయం అందరికీ తెలుసు. కాగా మూడు రోజుల క్రితం ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) జగన్ మ్మోహన రెడ్డి శ్రీమతి అయిన భారతిరెడ్డి పేరు కూడా చేర్చుతూ… కొత్తగా ఛార్జి షీటు దాఖలు చేసింది. దీనిపై జగన్- “కుటుంబ సభ్యులను కూడా విడిచిపెట్టరా?” అంటూ బహిరంగ లేఖ ద్వారా వాపోయిన విషయమూ అందరికీ తెలిసిందే.

ఇంతకూ భారతిరెడ్డి నిందితురాలా? అయితే గత ఏడు సంవత్సరాలుగా సీబీఐ గానీ, ఈడీ గాని ఆమె పేరు ఎందుకు పరిశీలించలేదు? కొన్ని పత్రికలు చెబుతున్నట్టు.. జగన్ తరువాత వారి కంపెనీలలో భారతిరెడ్డి నిర్ణయాత్మక పాత్రపోషిస్తూ ఉంటే అది కొత్తగా జరిగిన పరిణామం కాదు. అదే విధంగా ఆవిడ తీసుకునే జీతం విషయంలో కూడా ఆ పత్రికలు విశేషంగా రాయడం జరిగింది. ఇవన్నీ తాజా సంఘటనలు కాదు. భారతి రెడ్డి ఎవరికీ తెలియకుండా రహస్యంగా కంపెనీ బాధ్యతలు నిర్వహించడంలేదు. సంబంధిత శాఖ నిబంధనల మేరకు ఆవిడ సదరు బాధ్యతలు స్వీకరించడం, నిర్వహించడం చట్టబద్దంగానే జరుగుతోంది. సంస్థలు ఎలా పెట్టారో, దానికి నిధులు ఎలా వచ్చాయో కూడా దర్యాప్తు సంస్థలు విచారణచేశాయి. ఆ విషయంలో భారతిరెడ్డి ప్రమేయాన్ని ఇపుడు ప్రశ్నించడం ఏమిటో… అక్రమ నిధులతో వ్యాపార సంస్థలు ఏర్పాటు చేసి ఉంటే అందుకు జగన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వాటిని ఇప్పటివరకూ దర్యాప్తు సంస్థలు రుజువు పరచలేదు. శిక్షపడేటట్టు చేయలేదు. తమ చేతిలో ఉన్న పని వదలి కొత్తగా నిందితులను చేర్చడం ద్వారా ఈడీ గాని, సీబీఐ గానీ ఈ కోసుల్లో సంపాదించనున్న రుజువులు ఏమిటి? దానివలన జగన్ ను జైలుకు పంపే వీలు ఎంతవరకూ ఉంటుంది అన్నది సామాన్యునికి బోధపడని విషయాలు. ఏడేళ్లుగా కేసులు నిగ్గుతేల్చలేని అధికారులు ఈ ఎన్నికల సంవత్సరంలో కొత్తగా పేర్లు జతచేయడం ద్వారా ఎవరిని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు. ఈ చర్యలు ఎవరికి మేలుచేస్తాయని కేంద్ర దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. జగన్ పై కేసులు ఏడు సంవత్సరాలుగా ఎక్కడవేసిన గొంగళి అక్కడే ఉంది. ఒక్క కేసులో కూడా పురోగతి లేదు. విచారణ పేరుతో నిందితులని బాధించడం సహజన్యాయసూత్రాలకు విరుద్దం అనే విషయం దర్యాప్తు అధికారులకు తెలియదనుకుందామా?

ఓడిన వాడు కోర్టులో ఏడుస్తాడు, గెలిచినవాడు ఇంటికెళ్లి ఏడుస్తాడనే సామెతను మన కేంద్ర దర్యాప్తు సంస్థలు నిజం చేయడానికి ప్రయత్నిస్తున్నట్టున్నాయి. గతంలో కూడా 2జి స్కాం అనే కేసులో ఈ దర్యాప్తు సంస్థలు చాలా హడావుడి చేశాయి. కనిమొళి, రాజా వంటి వారు విచారణ దశలోనే జైలు శిక్షకుడా అనుభవించారు. చివరకు ఆ కేసు కోర్టులో వీగిపోయింది. కెసు కొట్టేశారు. సరే అంతవరకూ జైలు శిక్ష అనుభవించిన వారి మానసిక స్థితి ఏమిటి, వారు సమాజంలో ఎంత వ్యతిరేకత ఎదుర్కొని వుంటారు. ముఖ్యంగా వారి పిల్లలు-కుటుంబ సభ్యులు, వారి ఆవేదన, దుఃఖం ఎలా తీరుతుంది. వాటి పర్యవసానాలు జీవితాంతం వెటాడుతూ ఉంటాయి. మరిపుడు కొత్తగా వైఎస్ భారతి రెడ్డి పేరును ఈడీ ఎందుకు పరిశీలిస్తోంది…. ఏమి సాధించాలనుకుంటోంది. రేపు కేసు వీగిపోతే… నిర్ధోషులుగా విడుదలైతే…. అపుడు జరిగిన నష్టానికి అధికారులు బాధ్యత వహిస్తారా… సరిగా దర్యాప్తుచేయలోకపోయినందుకు పదవులకు రాజీనామా చేస్తారా? వారిని జైల్లో వేయగలమా? దెబ్బతిన్న మనోభావాలకు ఎలా వెలకడుతారు?  ఎందుకంటే సుమతి శతక కారుడే చెప్పినట్టు. . .

కూరిమి గల దినములలో
నేరము లెన్నడును గలుగ నేరవు మఱి యా
కూరిమి విరసంబైనను
నేరములే తోచు చుండు నిక్కము సుమతీ!

భావం: పరస్పరము స్నేహమున్న రోజులలో నేరములెప్పుడును కనుపించబోవు. ఆ స్నేహము చెడగానే అన్నియును తప్పులుగా కనపడు చుండును. ఇది నిజము…  అవును అదే నిజంలాగుంది.

 

మామాట: చెప్పిన మాట వింటే ఓకే… లేదంటే వేధించడం… ఇదేమి న్యాయం?

Leave a Reply