తెలంగాణ అభివృద్ది తెలుగుదేశంతోనే సాధ్యం…

Share Icons:

హైదరాబాద్, 1 అక్టోబర్:

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో తెలుగుదేశం పార్టీ తమ నాయకులతో ప్రచారం ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే నటసింహం నందమూరి బాలకృష్ణను సైతం రంగంలోకి దించింది.

తెలుగుదేశానికి ఆయువు పట్టైన ఖమ్మం జిల్లా మధిర నుండి బాలయ్య ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ది తెలుగుదేశంతోనే సాధ్యమని స్పష్టం చేశారు.

ప్రచారానికి వస్తున్న బాలయ్యకు ఘన స్వాగతం పలికేందుకు అభిమానులు, కార్యకర్తలు ఏపీ, తెలంగాణ సరిహద్దు గ్రామమైన జొన్నలగడ్డ నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు.

తొలుతగా రాయపట్నం చేరుకుని ఎన్టీఆర్, అంబేద్కర్ విగ్రహాలకు బాలయ్య పూలమాలలు వేసి, నివాళి అర్పించారు. ఆ తర్వాత దెందుకూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

అనంతరం ఆయన ప్రసంగిస్తూ తెలుగుజాతి కీర్తి, ప్రతిష్ఠలను ప్రపంచ నలుమూలలకు చాటిన మహనీయుడు దివంగత ఎన్టీఆర్ అని వ్యాఖ్యానించారు.

తెలంగాణ అభివృద్ధి కోసం ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడులు ఎంతో కృషి చేశారని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని చెప్పారు.

ఈ కార్యక్రమంలో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, నామా నాగేశ్వరరావు, స్వర్ణకుమారి తదితరులు పాల్గొన్నారు. రమణ  మాట్లాడుతూ, తెలంగాణ అసెంబ్లీలో మహాకూటమి జెండా ఎగరడం ఖాయమని,మహాకూటమి తొలి గెలుపు మధిర స్థానం నుంచే వస్తుందని తెలిపారు.

 

మామాట:ముందు గెలవాలి కదా….

Leave a Reply